08/9/18 5:24 PM

ఆ ఇద్దరు రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు, సమాజాన్ని విభజించారు..! పవన్

Untitled-1 copy

జనసేనాని పవన్ కల్యాణ్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలపై ఫైర్ అయ్యారు. ఏపీని చంద్రబాబు, జగన్ గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. సమాజాన్ని విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. భీమవరంలో బీసీ సంఘాలతో భేటీ అయ్యారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం మనుషులుగా ఉన్నా కులాలుగా విడిపోయామని, కాపు రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందంటున్నారని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై బీసీ కులాలకు లాభనష్టాలు వివరించాలని పవన్ సూచించారు. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీలో ఉన్న కాపు నాయకులు ఏం చేస్తున్నారు? అలాగే, ప్రతి బీసీ కులంలో ఉన్న నాయకులు వాళ్ళ వాళ్ల కులాల కోసం ఏం చేస్తున్నారు? అని పవన్ ప్రశ్నించారు. రాజకీయనాయకులను గుడ్డిగా నమ్మేసి ప్రతిసారి మోస పోకూడదని, మనల్ని మనం ప్రశ్నించుకోవాలని పవన్ సూచించారు.

 

అదే సమయంలో ‘జనసేన’ ప్రశ్నించే పార్టీ అని తానెప్పుడూ చెప్పలేదన్నారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి పార్టీ బాధ్యత అని వివరించారు. కానీ, చాలామంది ఏం చేశారంటే.. ‘జనసేన’ను ప్రశ్నించే పార్టీగా పరిమితం చేస్తే అధికారం ఇంకొకరి ఇవ్వొచ్చనే ఆలోచనను బలంగా తీసుకెళ్లారని అన్నారు. జనసేన అందరి పార్టీ అని పవన్ చెప్పారు. జనసేన కేవలం ప్రశ్నించేందుకే పుట్టిందనే విషయాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. తద్వారా పరిపాలన కూడా సాధిస్తామని అభిప్రాయపడ్డారు. చిత్తశుద్ధితో పని చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. మనలోని అనైక్యత వల్ల మనం దెబ్బతింటాం, మోసపోతామని బీసీ సంఘ నాయకులతో అన్నారు. దశాబ్దాలుగా మోసం చేస్తున్నప్పటికీ మనం ఓట్లు వేస్తున్నామన్నారు.

 

2009లో తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని పవన్ గుర్తు చేశారు. బీసీలు రాజ్యాధికారంలో వెనుకబడిపోతున్నారని తాము ఎక్కువ సీట్లు ఇచ్చామని, అది సఫలీకృతం కాకపోయినప్పటికీ ఓ ముందడుగు వేశామన్నారు. కానీ మిగతా వారు ఎవరూ చేయలేదన్నారు. అది గొప్ప ప్రయత్నమని, ఆ ప్రయత్నం వెనుక గొప్ప ఆశయం ఉందన్నారు. కానీ మిగతా పార్టీలలోని వారితో పోటీ పడలేక దెబ్బతిన్నారన్నారు. బీసీలలో వందకు పైగా కులాలు ఉన్నాయన్నారు. కానీ కులాల మధ్య ఐక్యత లేదన్నారు.

 

కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడితే బీసీలు దూరమవుతారు, బీసీల గురించి మాట్లాడే వారు దూరమవుతారని లెక్కలు వేసి సమాజాన్ని చీట్ చేస్తున్నారని, ముక్కలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. అందరూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి నేతలు పదవులు లేకున్నా ఎంతో పని చేశారన్నారు. కానీ అలా అని జనసేనకు పదవి వద్దని చెప్పడం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి తాను సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నానని, కానీ ఇక్కడి సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. నేను అన్ని పార్టీలకు సమదూరం పాటిస్తానని వెల్లడించారు. తాను సామాజిక మార్పు కోరుకుంటున్నానని… రామ్ మనోహర్ లోహియా ఆలోచనలతో ఉన్నానని జనసేనాని చెప్పారు.

Tags : bc leadersBhimavaramcastechandrababuJAGANjanasenapawan kalyanwest godavari

Also read

Use Facebook to Comment on this Post



Menu