01/9/19 11:22 AM

అలా అయితే జనసేన నిలబడదు : పవన్ కళ్యాణ్

Pawan Kalyan Gives Clarity On Tickets

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఎలాంటి వారిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి అనే అంశాలపై కసరత్తు చేస్తున్నాయి. టికెట్లు కావాలంటే అర్హతలు ఉండాలంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే రీతిలో ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ టిక్కెట్ ఆశించే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి అన్న అంశాలపై పవన్ క్లారిటీ ఇచ్చారు.

 

ఈ సార్వత్రిక ఎన్నికల్లో 60శాతం కొత్తవారికి, 20శాతం భావజాలం ఉన్నవారికి, మరో 20శాతం విలువలు ఉన్నవారికి టిక్కెట్లు ఇస్తానని జనసేనాని వెల్లడించారు. కొత్తవారికి ఎన్ని స్థానాలు కేటాయించాలన్న అంశంపైనా క్లారిటీ వచ్చిందని చెప్పారు. కొత్తవారిలో కసి ఉంటుంది కానీ వ్యూహం ఉండదని తేల్చేసిన పవన్.. అందరూ కొత్తవాళ్లే ఉంటే పార్టీ నిలబడదని స్పష్టం చేశారు. అందువల్ల సీనియర్లు కూడా అవసరమే అని చెప్పారు.

 

2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేనాని జిల్లాల నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. జనసైనికులకు దిశానిర్దేశనం చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేశారు. తాజాగా కర్నూలు జిల్లా జనసేన పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబాల మధ్య కర్నూలు జిల్లా నలిగిపోతుందని ఆరోపించారు. యువత ఎదగాలనుకున్నా రాజకీయ శక్తులు ఎదగనివ్వడం లేదన్నారు. 2001 నుంచే తెలుగు రాష్ట్రాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పవన్ చెప్పారు. తాను 2003 నుంచే రాజకీయాలను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆనాడే తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు.

 

ఎన్నికలకు వెళ్తున్న స్ట్రాటజీని సైతం పవన్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంపై దృష్టిసారించినట్లు జనసేనాని సంకేతాలిచ్చారు. సంక్రాంతిలోపు తాత్కాలిక కమిటీలు వేయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత పూర్తి స్థాయి కమిటీలు వేసి నిత్యం ప్రజల మధ్య గడిపేందుకు వ్యూహరచన చేస్తానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పార్టీలపై ప్రజలు విసుగుతో ఉన్నారని, వారంతా మనవైపు చూస్తున్నారని, మనం ఏదో చేస్తామని ప్రజలు ఆశతో ఉన్నారని వారి ఆశలు నెరవేర్చేలా జనసేన ఉంటుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

 

రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని పవన్ పిలుపునిచ్చారు. రాజకీయాల పట్ల యువత ఉత్సాహంగా ఉందని, కానీ దాంతో పాటు వ్యూహాలు కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చాలనుకునే యువతను అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తామని చెప్పారు. మనలోని శక్తిని సమాజం కోసం, మంచి కోసం ఉపయోగించాలన్నారు. తన శక్తి, వీక్‌నెస్ ఏంటో తనకు బాగా తెలుసని పవన్ చెప్పారు.

 

అదే సమయంలో జన సైనికులకు పవన్ కీలక సూచన చేశారు. ఇతరులను విమర్శించే సమయంలో ఎట్టిపరిస్థితుల్లో వారి కులాల గురించి మాట్లాడొద్దన్నారు. అంతేకాదు వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దని సూచించారు. సమస్యల ఆధారంగా మాత్రమే విమర్శలు ఉండాలని చెప్పారు.

Tags : ap electionsjanasenajanasensa ticketspawan kalyanpawan kalyan directionspawan kalyan kurnoolqualifications

Also read

Use Facebook to Comment on this PostMenu