01/6/19 1:14 PM

చంద్రబాబు, జగన్ నా వెంటపడుతున్నారు : పవన్

Pawan Kalyan Key Comments On Chandrababu, Jagan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఫుల్ జోష్ మీదున్నారు. పవన్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఇందుకు కారణం చంద్రబాబు, జగన్‌లే అని స్వయంగా పవనే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్-పవన్ పొత్తు పెట్టుకుంటారని, కలిసి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్స్. మాతో కలిసి రావాలని పవన్‌ను చంద్రబాబు పదే పదే కోరడం, పవన్‌తో కలిసి పని చేస్తే జగన్‌కు ఏంటి సమస్య? అని చంద్రబాబు అనడం.. ఇలా జనసేనాని మద్దతు కోసం పోటీ నెలకొన్న పరిస్థితి నెలకొంది.

 

బాబు, జగన్ అవసరం లేదు:
ఈ పరిణామాలపై పవన్ స్పందించారు. మొదట్లో జనసేన పార్టీను గుర్తించడానికి కూడా టీడీపీ, వైసీపీలు ఇష్టపడలేదన్నారు. అలాంటి పార్టీలు ఇప్పుడు జనసేన తమతో కలిసి వస్తోందని ప్రచారం చేసుకుంటున్నాయని, ఇదే మన తొలి విజయం అని పవన్ అన్నారు. అయితే వాళ్లకు మన అవసరం ఉందేమో కానీ, మనకు మాత్రం వారి అవసరం లేదని పవన్ తేల్చి చెప్పారు. తెలియకుండానే సామాన్యులు వాడే గాజు గ్లాస్ ఎన్నికల గుర్తుగా వచ్చిందని పవన్ సంతోషం వ్యక్తం చేశారు. కాలం మనకు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం అన్నారు. రిస్క్ చేయకుంటే కొత్తదనం రాదన్నారు జనసేనాని. ప్రకాశం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

60శాతం టికెట్లు కొత్తవారికే:
అసెంబ్లీ ఎన్నికల విషయంలో పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 60శాతం టికెట్లు కొత్తవారికే ఇస్తానని స్పష్టం చేశారు. 2014 ఎన్నిక‌ల్లో రాష్ట్ర సమగ్రత కోసం టీడీపీకి మద్దతిచ్చానన్న జనసేనాని.. ఈ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో సమతుల్యత కోసమే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని వివరించారు. దేశంలో కులాల ప్రభావం, అంబేద్కరిజం వంటి వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాకే పార్టీని ఏర్పాటు చేశానని పవన్ చెప్పారు. అన్ని పార్టీల్లోని నేతలు రాజకీయాల్లో తాము పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా మాట్లాడేవారే గానీ… ప్రజలకు అనుగుణంగా మాట్లాడే వారు కనుమరుగైపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ పెట్టినప్పుడు పెద్ద నాయకులు ఎవరూ తన వెంటలేరని… యువతను నమ్మి తాను పార్టీ పెట్టానని వెల్లడించారు. తనకు సినిమాల్లో నటన ఎప్పుడూ సంతృప్తి ఇవ్వలేదని… ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు మాత్రం సంపూర్ణమైన ఆనందం కలుగుతుందని పవన్ చెప్పారు. వ్యక్తిగతంగా ప్రజాబలం ఉన్న వారు పార్టీలోకి వస్తే జనసేన బలం తోడై విజయానికి చేరువ అవుతారన్నారు.

 

మొదటి ఎన్నికలో, చివరి ఎన్నికలో కావు:
అభిమానులకు, తనకు అనుసంధానం ఉందని పవన్ అన్నారు. యువత, మహిళలు జనసేనను ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు. పార్టీని క్రమంగా విస్తరించుకుందామని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్‌ స్థాయి కమిటీలు వేద్దామన్నారు. ఈ ఎన్నికలు మనకు మొదటి ఎన్నికలో, చివరి ఎన్నికలో కావని, ఇది ప్రారంభం మాత్రమేనని పవన్ చెప్పారు. జనసేన ఇంకా ప్రారంభదశలో ఉందని పార్టీ సంస్థగత పటిష్టతకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చిన జనసేనాని భవిష్యత్తు జనసేనదే అని ధీమా వ్యక్తం చేశారు.

 

రూ.2వేల కోట్లు కావాలి:
ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 వేల కోట్ల రూపాయలు కావాలని, ఇతర పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయని చాలామంది తనతో అంటున్నారని పవన్ చెప్పారు. కానీ మన పార్టీ డబ్బు లేకుండానే ఎన్నికల్లో గెలుస్తుందని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags : ALLIANCEap electionschiranjeevijanasenajanasena first victorypawan kalyanpawan kalyan on chandrababupawan kalyan on jaganpraja rajyam party

Also read

Use Facebook to Comment on this PostMenu