12/5/18 8:11 PM

పవన్ కళ్యాణ్ ధైర్యం చేయలేకపోయారా?

Pawan Kalyan Plays Safe Game In Telangana Elections

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదా? జనసేనాని కావాలనే వెనకడుగు వేశారా? పరువు పోకుండా, చిక్కుల్లో పడకుండా తెలివిగా వ్యవహరించారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు చూస్తే ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. తన మద్దతు ఎవరికి? ఎవరికి ఓటు వేయాలి? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో పవన్ చాలా తెలివిగా వ్యవహరించారు. ఎవరికి ఓటేయాలన్న దానిపై ప్రజలు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని పవన్ సూచించారు. ఎవరైతే తక్కువ అవినీతి – ఎక్కువ పారదర్శకతతో మంచి పరిపాలన అందించగలరో వారికే ఓటేసి తెలంగాణలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇటు ప్రజాకూటమి, అటు టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల విషయంలో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లయింది. ఏ ఒక్క పార్టీకి పవన్ స్పష్టమైన మద్దతు ప్రకటించలేదు. అభ్యర్థులను చూసి ఓటేయాలంటూ కార్యకర్తలకు సూచించారు.

 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం..తక్కువ సమయం ఉండటం వల్లే జనసేన పార్టీ పోటీకి దూరంగా ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇక్కడి పోరాట స్ఫూర్తిని, త్యాగాలను సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాను కాబట్టే తెలంగాణ అంటే నాకు అంత గౌరవమని ట్విటర్ ద్వారా తెలియచేశారు. ముందస్తు ఎన్నికలు రావడంతో సమయం లేక తెలంగాణలో జనసేన పోటీ చేయలేకపోయిందని పవన్‌ తెలిపారు. తెలంగాణను ఇచ్చామని ఒకరు, తెలంగాణను తెచ్చామని మరొకరు విరుద్ధ ప్రకటనలు చేస్తున్న దశలో ప్రజలు అయోమయంలో ఉన్నారని పవన్ అన్నారు. ఈ సమయంలో ప్రజలు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

 

తెలంగాణ ఎన్నికలపై తన నిర్ణయాన్ని బుధవారం చెబుతానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఏ పార్టీకి మద్దతిస్తారోనని అందరూ ఆసక్తిగా చూశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌-బీజేపీ రహస్య కూటమికి లోపాయికారీ మద్దతిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనసేనకు ఉన్న ఓటింగ్ అధికార పార్టీకి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో పవన్ ప్రకటన ఆసక్తికరంగా మారింది. పవన్ కచ్చితంగా టీఆర్ఎస్‌కే సపోర్ట్ చేస్తారని చాలామంది నమ్మారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలపై పవన్ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కేసీఆర్‌కు మద్దతిస్తారని విశ్లేషించారు. అయితే ఏ పార్టీకి మద్దతిచ్చినా అనవసరంగా ఇబ్బందుల్లో పడినట్టు అవుతుందని పవన్ భావించినట్టు తెలుస్తోంది. ఒకవేళ తాను మద్దతిచ్చిన పార్టీ గెలవలేకపోతే.. అప్పుడు పరువు పోవడం ఖాయం. ఇలాంటి లెక్కలు బేరీజు వేసుకున్న జనసేనాని సేఫ్ గేమ్ ప్లే చేసినట్టు అర్థమవుతుంది. తన మద్దతు ఎవరికీ ప్రకటించని పవన్.. అవినీతి తక్కువగా చేసే పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చి గండం నుంచి బయటపడినట్టు అయింది.

 

తన మద్దతు ఎవరికి అనే విషయం చెప్పని పవన్.. ఓ మంచి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకే సూచించడం గమనార్హం. తక్కువ అవినీతితో మంచి పరిపాలన అందించేవారు ఎవరో మీరే డిసైడ్ చేసుకుని వారినే ఎన్నుకోమని పవన్ చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. పవన్ నుంచి ఎంతో ఆశించామని, మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకున్నామని, కానీ ఇలా నిరుత్సాహపరుస్తారని అస్సలు ఊహించలేదంటున్నారు. మంచి వారికే ఓటు వేయాలని చెప్పిన పవన్.. ఆ మంచి వారు అనేది కూడా మీరే చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. మొత్తంగా పవన్ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags : janasenaKCRless corruptedpawan kalyanpawan kalyan supportpawan safe gameprajakutamitelangana electionstrs

Also read

Use Facebook to Comment on this Post



Menu