12/2/18 10:29 PM

చంద్రబాబు, జగన్, లోకేష్‌ల పై పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు

babu pawan jagan copy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. విమర్శల వర్షం కురిపించారు. మాటల తూటాలు పేల్చారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి చంద్రబాబు పారిపోయి ఏపీకి వచ్చారని, ఏపీ ప్రజలకు తీరని అన్యాయం చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జగన్ ఏమో పాదయాత్రలు, బుగ్గ నిమరడాల్లో మునిగిపోయారని విమర్శించారు. చంద్రబాబు, జగన్‌లా తాను రాజకీయాలను ఎప్పుడూ వ్యక్తిగత అవసరాలకు వాడుకోలేదన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడతానని, పోరాటం చేస్తానని పవన్ స్పష్టం చేశారు. కేవలం విధివిధినాల గురించే తాను మాట్లాడుతున్నాని చెప్పారు. తాను విధివిధినాల గురించి మాట్లాడుతుంటే జగన్ ఏమో తన ఇంటి ఆడపడుచులను తిట్టారని పవన్ మండిపడ్డారు. నేనూ ఉప్పుకారం తినేవాడినే, రాయలసీమలో పుట్టకపోయినా ఇక్కడి జొన్న కూడు, రాగి సంకటి తిన్నా.. మాటకు, మాట చెప్పగలను.. కాని సంస్కారం అడ్డొస్తోందని పవన్ అన్నారు. అనంతపురంలో జనసేన నిరసన కవాతులో చంద్రబాబు, జగన్‌లపై పవన్ నిప్పులు చెరిగారు.

 

ప్రధాని మోడీని చూస్తే భయపడటానికి తాను చంద్రబాబు, జగన్‌ను కాదని పవన్ అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే.. ప్రజల తరపున ప్రశ్నించడానికి.. ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చినవాడినన్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో నిలదీయడానికి ప్రతిపక్షనేత జగన్‌కు భయమైతే.. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించడానికి చంద్రబాబుకు భయమన్నారు. కానీ తనకు మాత్రం ఎలాంటి భయాలూ లేవని.. గుండెల నిండా ధైర్యంతో తప్పు చేసేవారిని ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని వెల్లడించారు.

 

జగన్ నాకు శత్రువు కాదు.. చంద్రబాబు నాకు మిత్రుడు కాదు అని పవన్ పేర్కొన్నారు. ఆ ఇద్దరిలా తన వద్ద వేల కోట్లు లేవన్నారు. తాతలు, తండ్రులు ముఖ్యమంత్రులు కాదన్నారు. వారిలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను పార్టీ పెట్టలేదన్నారు. నాయకులంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పవన్ సూచించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పోరాటాలు చేసి గొప్ప వాళ్లు జైలుకు వెళితే.. జగన్‌ ఏమో కుంభకోణాలు చేసి జైలుకు వెళ్లారు… అలాంటి వారు యువతకు ఆదర్శమా? అని పవన్ ప్రశ్నించారు.

 

పవన్ కళ్యాణ్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడని చంద్రబాబు అంటున్నారని మండిపడిన పవన్.. తాను ఏనాడూ బీజేపీకి వత్తాసు పలకలేదన్నారు. తొలి రోజు నుంచి బీజేపీని ఎదురించింది నేనే అని చెప్పారు. ‘మోడీ అంటే జగన్‌కు, చంద్రబాబుకు, లోకేష్‌కు చాలా భయం.. ఎందుకంటే మీరు పాత దొంగలు కాబట్టి. పవన్ కళ్యాణ్‌కు అలాంటి భయాలు లేవు. తొమ్మిదేళ్ల క్రితమే ‘కాంగ్రెస్ హఠావో దేశ్ కి బచావ్’ అని నినదించిన వ్యక్తిని. అలాంటి నేను మోడీకి భయడతానా’? అంటూ జనసేనాని ఆవేశంగా మాట్లాడారు.

 

ఏపీలో నేతల దోపిడీ పెరిగిపోయిందని, ఏ నియోజకవర్గానికి వెళ్లినా.. రూ.వెయ్యి కోట్ల అవినీతి కనిపిస్తోందని పవన్ ఆరోపించారు. అవినీతిపై ఆధారాలతో సహా సీఎం చంద్రబాబుకు పంపిస్తే.. కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి లోకేష్ దోపిడీ చేస్తున్నా.. ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఆ అవినీతిని ప్రశ్నించి, అన్యాయాన్ని ఎదురించి, ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన జెండా ఉందన్నారు. అనంతపురంలో కియా కంపెనీ వచ్చింది యువతకు ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది… కానీ పరిస్థితులు వేరుగా ఉన్నాయని.. ఉద్యోగ అవకాశాలు ఎవరికీ రాలేదని పవన్ అన్నారు. పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేయని వ్యక్తి పంచాయతీ రాజ్‌ మంత్రిగా పని చేస్తున్నారు అంతేకాదు సీఎం కావాలని కలలు కంటున్నారు అని లోకేష్ ను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు.

 

2009లో ఒక బలమైన మార్పు జరుగుతుందని తాను ఆశించానని.. కానీ ఆంధ్రా, తెలంగాణ అని చెప్పి వారి అధికారాల కోసం మనల్ని బలి పశువులను చేస్తుంటే బాధేసిందని పవన్ వాపోయారు. అయినా 2014లో చంద్రబాబును నమ్మి మద్దతిస్తే.. ఆయనకు ఆత్మగౌరవం లేదన్నారు. చంద్రబాబు రాజధానిని వదలుకొని వచ్చారని ధ్వజమెత్తరాు. ఒక్క ఎమ్మెల్సీ కోసం.. మన హక్కును కాదని వదులుకొని వచ్చి మనకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయకపోతే మేము జనసైనికులమే కాదని పవన్ అన్నారు. జనసేనతో సరికొత్త రాజకీయ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. ఇది యుద్ధం చేసే సమయం అని, ప్రజలు చైతన్యంతో ముందుకు నడవాలని పవన్ సూచించారు. అనంత ప్రజలకు జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. రాయలసీమకు ఆత్మగౌరవం తీసుకొస్తానని, రాయలవారు ఏలిన రాయలసీమను మనం స్థాపించుకుందాం అని పవన్ పిలుపునిచ్చారు. తనకు దశాబ్దాల రాజకీయ అనుభవం లేదు కానీ.. దశాబ్దాల పాలు అలుపెరుగని పోరాటం చేయగల సత్తా ఉందన్నారు. తన పాతికేళ్ల జీవితం రాష్ట్రానికి, దేశానికి అంకితం అన్నారు పవన్ కళ్యాణ్.

Tags : chandrababujanasenaJanaSena Nirasana Kavathu Anantapurlokeshpawan cmpawan kalyanys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu