10/15/18 9:57 PM

ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

pawan kalyan on chief minister post

ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. పోరాటయాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతన్న పవన్ కళ్యాణ్.. ఓటర్లపై తనదైన ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. తూటాల్లాంటి మాటలతో, ఆలోచింపజేసే ప్రశ్నలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ వింటే జనసేనాని దూకుడు అర్థమవుతుంది.

 

అధికార పార్టీకి చురకలు.. ప్రతిపక్ష పార్టీలకు వార్నింగ్‌లు.. మధ్య మధ్యలో పవర్ ఫుల్ పంచ్‌లు.. ఇదీ జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగిన తీరు. తన స్పీచ్‌తో జనసైనికుల్లో నూతనోత్సాహం నింపారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లాలోని పిచుకలలంక నుంచి కాటన్ విగ్రహం వరకు ధవలేశ్వరం బ్యారేజ్ మీదుగా భారీ స్థాయిలో జనసేన కవాతు సాగింది. కవాతు అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిపైన ఆయన కొడుకు లోకేష్‌లపైన పవన్ నిప్పులు చెరిగారు. తన లక్ష్యంతో ఏంటో చెప్పారు.

 

ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవి గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవి అలంకారం కాదని పవన్ స్పష్టం చేశారు. అదే సమయంలో వారసత్వాలతో సీఎంలు కాలేరంటూ నారా లోకేశ్, వైఎస్ జగన్‌లపై పవన్ విమర్శలు చేశారు. తమ తాత, తండ్రీ సీఎంలు కనుక తానూ ముఖ్యమంత్రిని అవుతానని లోకేశ్.. తన తండ్రి సీఎంగా చేశారు కనుక తానూ ఆ పదవిని పొందాలన్న జగన్‌లా తనకు వారసత్వం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ఒక కానిస్టేబుల్ కొడుకు ఈ రాష్ట్రానికి సీఎం ఎందుకు కాలేడు, కచ్చితంగా అవుతాడు అంటూ పవన్ ధీమా వ్యక్తం చేశారు. సభలో ‘సీఎం..సీఎం’ అంటూ అభిమానులు చేసిన నినాదాలపై స్పందించిన పవన్ ‘మీరు చేసే నినాదం సత్యమై తీరుతుంది’ అని అన్నారు.

 

తనకు దశాబ్ధం పాటు రాజకీయ అనుభవం ఉందని పవన్ అన్నారు. ‘ఈ అనుభవంలో ఎన్నో దెబ్బలు తిన్నాం,. మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. చేయని తప్పుకి నెలలుగా అవమానాలు ఎదుర్కొన్నాం. భంగపడ్డాం. కన్న తల్లిని దూషించుకున్నాం. అవమానాలు. ఎందుకు పడ్డాం. పౌరుషం లేదా మాకు.. ఉప్పు కారం తినలేదా మేం. మాకు అవమానాలు రావా. పౌరుషాలు ఉండవా. ఆకాశంలో నుండి ఊడిపడ్డారా మీరు. ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. తేడాలొస్తే.. తాట తీస్తాం” అని పవన్ హెచ్చరించారు.

 

సీఎం చంద్రబాబుపైనా పవన్ ఫైర్ అయ్యారు. ‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. బాబు వస్తే జాబు ఇస్తా అన్నారు. ఈ మధ్య పలాసలో రోడ్డు పక్కన ఒకతన్ని అడిగా.. బాబు వస్తే జాబు ఇస్తా అన్నారు ఏమైంది? అని.. ఆ పెద్దాయన ఒకటే అన్నారు. జీలకర్రలలో కర్రాలేదు. నేతి బీరకాయలో నెయ్యి లేదు. బాబు జేబులో జాబు లేదు. దీన్ని బట్టి చంద్రబాబు పాలన ఎలా ఉందో అర్ధమవుతుంది’ అని పవన్ విమర్శించారు.

 

”రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా దోపిడీలే. జన్మభూమి కమిటీలా దోపిడీ కమిటీలో అర్ధం కావడం లేదు. బాబు గారు మళ్లీ మీరే రావాలని విజయవాడలో హోర్డింగ్‌లు కనిపించాయి. వచ్చి ఏం చేస్తారు మీరు” అని పవన్ ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే.. చిన్న కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలబడతామని పవన్ హామీ ఇచ్చారు.

 

”మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్.. సినిమా యాక్టర్ అంటారు. అరె మీ లోకేష్‌కి ఏం తెలుసు. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయితీ రాజ్ శాఖా మంత్రిని చేశారే మీరు. ఆయనకు ఏం తెలుసు? ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకుకి రావాలి. వారసత్వం అంటే ఏంటి? ఇంటిపేరు? ఆస్తులు అంతస్తులు వస్తాయి. మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేసేందుకా జనసేన మీకు సపోర్ట్ చేసింది’ అంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్.

 

అంతకుముందు జనసేన కవాతుకు లక్షలాదిగా తరలి వచ్చిన వారందరికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు.. దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమసింహాలు’ అంటూ జనసైనికులను ప్రశంసించారు పవన్ కళ్యాణ్.

 

‘కవాతు ఎవరు చేస్తారు? మిలిటరీ సైనికులు. సామాన్య ప్రజలు కవాతు చేయరు. మరి, మనం ఎందుకు కవాతు చేయాల్సి వచ్చింది?’ అని పవన్ ప్రశ్నించారు. అవినీతిని, దోపిడీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే ఈ కవాతు చేయాల్సి వచ్చిందని అన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందని, అవినీతితో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని పవన్ విమర్శించారు.

Tags : dowleswaramjanasenaJanasena kavathupawan kalyanpawan kalyan on chandrababupawan kalyan on cm post

Also read

Use Facebook to Comment on this PostMenu