01/5/19 11:40 AM

పేరు, ప్రఖ్యాతలతో ఓట్లు పడవు : పవన్ కళ్యాణ్

Pawan Kalyan Comments On PRP, Caste Equations

ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అన్ని పార్టీలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. గెలుపు కోసం వ్యూహలు రచిస్తున్నాయి. జనసేన కూడా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అధికార, ప్రతిపక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలని పవన్ ఆశిస్తున్నారు. ఆ దిశగా పార్టీని ప్రిపేర్ చేస్తున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎలాంటి పొరపాట్లు జరక్కుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ నోట ప్రజారాజ్యం పార్టీ పేరు వినిపించింది. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి 2009లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సమయంలోని అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీని తీర్చిదిద్దుతున్నట్లు పవన్ తెలిపారు. అదే సమయంలో అన్ని కులాల వారిని ప్రసన్నం చేసుకునే వ్యూహం రచించారు. పేరు, ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రాన పార్టీలు స్థాపించి వాటిని విజయవంతంగా నడపలేరని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

విజయవాడలో తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లా నేతలతో జనసేనాని సమావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని… తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు వచ్చే సలహాలు ఇవ్వాలని కోరారు. వ్యక్తిగతంగా 10 వేల ఓట్లను తెచ్చుకోగల సామర్థ్యం ఉన్న నేతలను జనసేన అక్కున చేర్చుకుంటుందని చెప్పారు.

 

కులాల గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన సమాజం అనేక కులాలతో ముడిపడి ఉందని… అన్ని కులాలను కలుపుకుని ముందుకు సాగాలని పవన్ సూచించారు. కులాల ప్రభావం అధికంగా ఉండే యూపీలో కూడా కుల రాజకీయ ప్రయోగాలు విఫలమయ్యాయని పవన్ గుర్తు చేశారు. కులం పేరు చెప్పి వ్యక్తులు బాగుపడుతున్నారు తప్ప కులాలు లాభపడటం లేదన్నారు. ఒకటి రెండు కులాలను అడ్డం పెట్టుకుని గెలుపు సాధించలేరని చెప్పారు. బాధ్యత, సహనం ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారని అన్నారు. తోటి వారికి సాయం చేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ మరణించడం తనకు ఇష్టమని పవన్ చెప్పారు.

 

నిస్వార్థంగా పనిచేస్తే పదవులు అవే వస్తాయని జనసేనాని అన్నారు. ఎవరు కూడా రాజకీయాల్లోకి రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేరని చెప్పారు. పార్టీ కోసం పని చేసేవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. పదవులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదన్నారు. అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఉంటాయన్నారు. బాధ్యత, సమాజం కోసం పని చేయాలన్న తపన, ఓపిక, సహనం అవసరమన్నారు. డబ్బు పెట్టి రాజకీయాల్లో లాభం పొందాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారని అన్నారు. సేవ చేద్దామనే ఆలోచన ఉన్నవారు కనుమరుగు అవుతున్నారని జనసేనాని వాపోయారు.

Tags : ap electionscastechiranjeeviDirectionsjanasenapawan kalyanPRP

Also read

Use Facebook to Comment on this Post



Menu