11/13/18 11:17 AM

చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వార్నింగ్

chandrababu mistake

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. చంద్రబాబు, జగన్‌లను టార్గెట్ చేస్తున్నారు. వారికి తనకి మధ్య ఉన్న తేడాలను వివరిస్తున్నారు. ఓటర్లను ఆలోచింపజేసేలా, ప్రభావితం చేసేలా పవన్ ప్రసంగాలు ఇస్తున్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు పాలనపై, నిర్ణయాల నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో చేసిన తప్పు మళ్లీ ఏపీలోనూ చేస్తున్నారని, దీని కారణంగా చంద్రబాబు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పవన్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో అన్ని ప్రధాన కంపెనీలు, కేంద్రాలు ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడు మళ్లీ అదే తప్పు ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారని పవన్ విమర్శించారు. అన్ని కేంద్రాలు రాష్ట్ర రాజధాని అమరావతిలోనే నిర్మిస్తే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ విబేధాలు రావడంతోపాటు జిల్లాల వారీగా ఉద్యమాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని పవన్ హెచ్చరించారు.

 

ప్రజలకు, యువతకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరా? అని పవన్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు అన్నీ అమరావతిలోనే పెడితే ఎలా అని నిలదీశారు. ఉద్దానంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీనిపై మన ఎంపీలు మాట్లాడారని పవన్ విమర్శించారు. పార్లమెంటులో తెలుగు ఎంపీలను కొడుతుంటే రాజకీయ ప్రయోజనాల కోసం మనవారు చోద్యం చూస్తూ కూర్చున్నారన్నారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ వాదం పుట్టుకు రావడం ఖాయమని పవన్ హెచ్చరించారు. టీడీపీ చేసే అడ్డగోలు అవినీతిని జనసేన ప్రశ్నిస్తుందన్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో హార్ట్ కేర్ సెంటర్ లేకపోవడం దారుణమన్నారు. అలాగే 14 మెడికల్ కాలేజీలు అమరావతి పరిసర ప్రాంతాల్లో పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. అన్ని ముఖ్య కేంద్రాలను వికేంద్రీకరించాలని పవన్ సూచించారు. అవినీతి, లంచాలు లేని పాలనను తాను చంద్రబాబు నుంచి కోరుకున్నానని, కానీ ఇప్పుడు అడుగడుగునా అవినీతే అని పవన్ ధ్వజమెత్తారు.

 

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించిందని దాన్ని తాను అడ్డుకోవడంతో అది ప్రైవేట్ పరం కాకుండా చేశానని పవన్ గుర్తు చేశారు.

 

భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు సెజ్‌ల పేరుతో ప్రజల దగ్గర భూములు లాక్కుని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుందంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజలకు అన్యాయమే జరుగుతోందన్నారు. నిలదీయాల్సిన ఎంపీలు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు. వారికి నిత్యం డబ్బు సంపాదన మీదే ధ్యాస అన్నారు. ప్రజలకు, యువతకు తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరా? అంటూ పవన్ నిలదీశారు.

 

ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయాన్ని వదులుకొని తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్యాయాన్ని ఎదిరించేందుకే జనసేన పుట్టిందన్నారు. తాను క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని పెట్టానని పవన్ చెప్పుకొచ్చారు.

Tags : ap cm chandrababu naidujanasenakakinada pawan speechpawan kalyanporatayatraTDP

Also read

Use Facebook to Comment on this PostMenu