12/1/18 8:07 PM

చంద్రబాబు కారణంగానే జనసేనలో చేరా – రావెల

Ravela Kishore Babu Joins Janasena

జనసేనలో నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి. మరో నేత జనసేనకు జైకొట్టారు. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేన కండువా కప్పుకున్నారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో రావెల పార్టీలో చేరారు. నవ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్‌తో కలిసి నడవాలనే ఉద్దేశంతో తాను జనసేనలో చేరానని రావెల తెలిపారు. ప్రజాస్వామ్యం.. డబ్బు, కుల స్వామ్యంగా మారిందని రావెల వాపోయారు.

 
కుల పట్టింపుల లేని సమాజం కోసం పవన్ నడుం బిగించారని.. ఆయన ఉద్యమంలో భాగమై.. సమిధగా మారేందుకే జనసేనలో చేరినట్టు రావెల చెప్పారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని రావెల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపైన, ముఖ్యమంత్రి చంద్రబాబుపైన రావెల విమర్శలు చేశారు. రాజకీయంగా పదవులు ఇస్తారు కాని.. అధికారం మాత్రం ఇవ్వరు అంటూ చంద్రబాబుపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అందుకే ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయలేకే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చానని పేర్కొన్నారు. అవినీతి, దుర్మార్గాలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు దిగజారాయని రావెల ధ్వజమెత్తారు. టీడీపీలో ఉండగా సైధ్దాంతిక విభేదాలతో ఎం‍తగానో నలిగిపోయానని తెలిపారు.

 

ఉన్నతాధికారిగా పనిచేసి తొలిసారి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు రావెల కిశోర్ బాబు. తంతే గారెల బుట్టలో పడ్డట్లుగా తొలి రాష్ట్రంలో తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారాయన. సామాజికవర్గం కోణంలో చంద్రబాబు రావెలకు అప్పట్లో కేబినెట్లో స్థానం కల్పించారు. అయితే అంతే వేగంగా రావెల తన పదవిని కోల్పోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ నుండి తప్పించినప్పటి నుంచి రావెల కిషోర్ బాబు టీడీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పలు సమయాల్లో టీడీపీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. తాజాగా జనసేనలో చేరిపోయారు.

Tags : chandrababu naiduex minister ravelajanasena joiningspawan kalyanravela kishore babu joins janasena

Also read

Use Facebook to Comment on this Post



Menu