06/11/19 7:29 PM

మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏంటో స్వయంగా చెప్పిన రోజా

Reason Behind MLA Roja Not Getting Minister Post

వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే రోజాకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆ పార్టీ నేతలు సహా చాలామంది అనుకున్నారు. సీఎం జగన్ కి ఆమె సన్నిహితురాలు. దీంతో మినిష్టర్ పోస్టు గ్యారంటీ అని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా సీఎం జగన్ రోజాని పక్కన పెట్టారు. కేబినెట్ లో ఆమెకు స్థానం దక్కలేదు. రోజాకి కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై రకరకాల వార్తలు వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్ పదవిని జగన్ రోజాకి ఆఫర్ చేశారని, ఆ పదవిని రోజా తిరస్కరించారని ప్రచారం జరిగింది. దీంతో కొంతకాలం ఆగాల్సిందే అని జగన్ రోజాతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రోజాకి నామినేటేడ్ పోస్టుని జగన్ ఖాయం చేశారని న్యూస్ వచ్చింది. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి రోజా మీడియా ముందుకు వచ్చారు. విజయవాడకు వచ్చిన రోజాను మీడియా పలకరించింది. మంత్రి పదవి రాకపోవడంపై వస్తున్న ఊహాగానాలపై రోజా స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

తనకు మంత్రి పదవి దక్కలేదనే బాధలేదని రోజా అన్నారు. కుల సమీకరణాలతో తనకు పదవి దక్కలేదని అభిప్రాయపడ్డారు. తనకు ఏవేవో పదవులంటూ మీడియాలో హైప్ చేశారని.. తనకు ఛానల్ వాళ్లు చాలా పోస్టులు ఇచ్చేశారంటూ సెటైర్లు వేశారు. తాను రెడ్డి సామాజిక వర్గానికి చెందినదానిని కావడం వల్లే మంత్రి పదవి దక్కలేదని రోజా చెప్పారు. ‘సీఎం జగన్ గారిని మీరు ఇప్పుడు కలుస్తారా?’ అని ప్రశ్నించగా, ‘పిలిస్తే కలుస్తాను’ అని, ఇప్పటి వరకైతే తనను ఎవరూ పిలవలేదని రోజా స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల కోసమే తాను విజయవాడకు వచ్చానన్నారు. తననెవరూ అమరావతి రమ్మని చెప్పలేదని ట్విస్ట్ ఇచ్చారు.

 

మంత్రి పదవి దక్కలేదని.. అందుకు తాను అలిగానన్నది పచ్చి అబద్ధం అని స్పష్టం చేశారు. అదంతా మీడియా సృష్టి అని అన్నారు. తనకు నామినేటెడ్‌ పదవి ఇస్తానని ఎవరూ చెప్పలేదని.. అది కూడా మీడియా సృష్టేనని ఆమె తెలిపారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సానికి రాకపోవడంపైనా రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారుంటే చాలు.. ఎమ్మెల్యేలు ఎందుకు.. అందుకే మంత్రుల ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను రమ్మని పిలిస్తే వెళ్తానన్నారు రోజా.

 

కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు కదా, ఆ సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవి తనకు రాలేదేమో అని రోజా అభిప్రాయపడ్డారు. వైసీపీకి చెందిన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తాను ‘రెడ్డి’గా కాకుండా ఏ ‘ఎస్సీ’గానో, ‘బీసీ’గానో పుట్టుంటే తనకు మంత్రి పదవి వచ్చి ఉండేదన్న వ్యాఖ్యలను రోజా మీడియా ప్రతినిధుల దగ్గర ప్రస్తావించారు. అదే సమయంలో తనకు చిన్నప్పటి నుంచి ‘కులం’పై వ్యామోహం లేదన్నారు. తాను పెళ్లి చేసుకుంది కూడా ‘బీసీ’ నే అన్నారు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా వేర్వేరు క్యాస్ట్ ల వాళ్లే అని చెప్పారు. తనకు ఎప్పుడు కూడా కులం గురించి ఆలోచించే అవకాశం రాలేదన్నారు. మీకు మంత్రి పదవి దక్కకపోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు రోజా బదులిస్తూ, ‘జగన్ గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్పగలను?’ అంటూ నవ్వులు చిందించారు.

 

మంత్రివర్గంలో పదవి ఆశించిన అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు రంగంలోకి దిగినట్లు వార్తలొచ్చాయి. నేతలకు ఫోన్లు చేసి అమరావతికి రావాలని పిలిచారని ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే రోజాకు వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చేసినట్లు.. వెంటనే అమరావతికి రావాలని కబురు పంపారట. ఈలోపే రోజా విజయవాడ వెళ్లడంతో.. జగన్‌ను కలుస్తారని వార్తలొచ్చాయి. కానీ ఆమె మాత్రం అసెంబ్లీ సమావేశాల కోసం వచ్చానని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. రోజా మాటలు చూస్తుంటే ఏదో జరుగుతోందనే అనుమానం కలగక మానదు.

 

మరోవైపు తమ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవులు దక్కని తమ ఎమ్మెల్యేల్లో ఎటువంటి అసంతృప్తి లేదని చెప్పారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు సీఎం చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ పదవులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యమైన నామినేటెడ్ పదవులను ఎమ్మెల్యేలకు దక్కవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags : ap cm ys jagancabinet ministerjagan cabinetMinister postmla rojanagariReddy

Also read

Use Facebook to Comment on this PostMenu