10/10/19 1:27 PM

రవిప్రకాశ్.. పాపం పండిందా? కక్ష సాధింపు రాజకీయాలకు బలయ్యాడా?

Reason Behind Tv9 Former CEO Ravi Prakash Arrest

తెలుగు మీడియా రంగంలో ఆయన ఓ సెన్సేషన్. అప్పటి వరకు ఉన్న మీడియా రూపురేఖలను సమూలంగా మార్చేసి, మీడియా స్థాయిని పటిష్టం చేసిన జర్నలిస్ట్. డాషింగ్ జర్నలిజానికి ఆజ్యం పోసిన పాత్రికేయుడు. ఓ న్యూస్ చానల్ ద్వారా అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేశాడు. ఒకానొక సమయంలో ప్రభుత్వాలను శాసించాడు. ఉమ్మడి ఏపీలో ఎన్నో ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఆయన సొంతం. మీడియా ఉంటే ఇలా ఉండాలి అనిపించేలా చేశారు. ఆయనే రవిప్రకాశ్. మీడియాని కొత్త పుంతలు తొక్కించి కొత్త వెలుగులు నింపిన రవిప్రకాశ్ చుట్టూ ప్రస్తుతం చీకట్లు అలుముకుంటున్నాయి. అవినీతి, అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టాయి. చీటర్ అనే ముద్రపడింది. నిధుల గోల్ మాల్, దుర్వినియోగం, సంతకాలు ఫోర్జరీ కేసులో రవిప్రకాశ్ అరెస్ట్ అయ్యారు.

 

రవిప్రకాశ్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా మీడియా రంగంలో సంచలనంగా మారింది. మీడియా ద్వారా ప్రభుత్వాలను శాసించిన వ్యక్తి ఇప్పుడు అవినీతి, అక్రమాల ఆరోపణలతో అరెస్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రవిప్రకాశ్ అరెస్ట్ అంశం రాజకీయ మలుపు తీసుకుంది. రవిప్రకాశ్ అరెస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అరెస్ట్ ని సమర్థిస్తే… కొందరు తప్పుపడుతున్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు రవిప్రకాశ్ బలయ్యాడని వాపోతున్నారు. చేసిన తప్పులు, పాపాలు ఊరికేపోవు అనే వారూ లేకపోలేదు. టీవీ9 పేరుతో బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడ్డారని ఆ పాపమే ఇప్పుడు వెంటాడుతోందని అనే వారూ ఉన్నారు.

 

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పుకునే జర్నలిజం వృత్తిలో ఉన్న రవిప్రకాశ్.. సమకాలీన రాజకీయాల్లో సమిధలా మారిపోయాడని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలతో స్నేహమే రవిప్రకాశ్ కు మైనస్ అయిందని విశ్లేషిస్తున్నారు. అసలు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఒక్కసారిగా ఇలా కేసుల్లో ఎలా, ఎందుకు కూరుకుపోయారు? అటు ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు, ఇటు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కూడా రవిప్రకాశ్‌ను ఎందుకు వెంటాడుతున్నారు? రవి ప్రకాశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేయకుంటే తమ రాజకీయ భవిష్యత్తుకు ఆయన సమాధి కట్టేస్తాడని భయపడ్డారా? ఇలా ఎన్నో అనుమానాలు మరెన్నో సందేహాలు.

 

రవిప్రకాశ్ అరెస్ట్ కి అసలు కారణం.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో స్నేహమే అని వార్తలు మీడియా వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. తాము తీవ్రంగా వ్యతిరేకించే రేవంత్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ, ఆయనకు సాయం చేస్తుండడమే దీనికి కారణం అని మీడియా వర్గాలు అంటున్నాయి. రేవంత్ రెడ్డితో రవిప్రకాశ్ కలిసి పనిచేస్తున్నారన్న కారణంతోనే ఆయన్ను అన్ని వైపుల నుంచి మూస్తున్నారని సమాచారం.

 

టీడీపీలో ఉన్నప్పటి నుంచి దూకుడుగా ఉన్న నేత రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్‌ను బలంగా ఎదుర్కొంటున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంతే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నా ఎక్కడా తగ్గకుండా కేసీఆర్‌ని ఢీకొడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా మళ్లీ కోలుకుని లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు రేవంత్.

 

కేసీఆర్ పతనమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న రేవంత్ ఇప్పుడు హుజూర్‌నగర్ ఉప ఎన్నిక విషయంలోనూ టీఆర్ఎస్ ఓటమి టార్గెట్‌గా పనిచేస్తున్నారట. పార్టీలో విభేదాలున్నప్పటికీ కేసీఆర్‌ ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా బైపోల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న రేవంత్‌ను టీఆర్ఎస్ మరోసారి టార్గెట్ చేసిందట. ఆ క్రమంలోనే ఆయనకు అండదండలు అందిస్తున్న రవి ప్రకాశ్‌కు అన్ని దారులూ మూసినట్లు తెలుస్తోంది.

 

రవిప్రకాశ్‌ను టీవీ 9 కొత్త యాజమాన్యం పూర్తిగా బయటకు గెంటేయడంతో పాటుగా ఏకంగా నిధుల దుర్వినియోగం, సంతకాలు ఫోర్జరీ, మోసం తదితర కేసులను ఇప్పటికే నమోదు చేసింది. అయినా రవిప్రకాశ్ ను టీఆర్ఎస్ సర్కారు అరెస్ట్ చేయలేదు. ఏదో అలా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఓ నాలుగైదు రోజులు విచారించింది. ఆ తర్వాత ఆయన కూడా కామ్ అయిపోయారు.

 

ఇదంతా పైకి కనిపించేది మాత్రమేనట.. తనను మూడు చెరువుల నీళ్లు తాగించి, తనను డీఫేమ్ చేసిన కేసీఆర్ బ్యాచ్‌పై రివెంజ్ తీర్చుకోవాలని రేవంత్ రెడ్డితో కలిసి రవి ప్లాన్ చేసినట్లు ప్రభుత్వంకి సమాచారం అందిందట. ఢిల్లీ కేంద్రంగా రేవంత్, రవి ప్రకాశ్‌లు పలుమార్లు భేటీ అయినట్లుగా సమాచారం ఉందట. ఇది చాలదన్నట్లు రవిప్రకాశ్ హుజూర్ నగర్ లో రేవంత్ బృందానికి సాయం అందించేందుకు రంగంలోకి దిగారట. రేవంత్ ప్రసంగాలను సిద్ధం చేయడంతో పాటుగా హుజూర్ నగర్ బైపోల్స్ లో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ లోనూ కీలక భూమిక పోషించడం మొదలెట్టారట. ఈ సంగతి కూడా టీఆర్ఎస్ పెద్దలకు చేరిపోయిందట. అంతే రవిప్రకాశ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందట.

 

టీవీ 9 వివాదం సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారన్న ఓ చిన్న కేసును అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ సర్కారు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసింది. రవిప్రకాశ్‌ను తామొక్కరమే ఎదుర్కోలేమోమో అన్న భయంతో మరో మాస్టర్ మైండ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితోనూ ఫిర్యాదు చేయించారని వినిపిస్తోంది. రవి ఆస్తులపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి సీఎం జగన్ సన్నిహితుడు లేఖ రాశారు.

 

ప్రభుత్వాలు మారినప్పుడు కక్ష్యపూరిత రాజకీయాలు సర్వ సాధారణం. కానీ అవే రాజకీయాలు మీడియాను శాసించడం అరుదు. రవి ప్రకాశ్ అంశంలో అచ్చం ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. రవిప్రకాశ్ ను టీఆర్ఎస్ సర్కార్ మొదట్లో అరెస్ట్ చేయలేదు. పోలీస్ స్టేషన్ కు పిలిపించి, విచారించింది. ధోరణి మారకపోతే తీవ్ర పరిణామంలుటాయని హెచ్చరించింది. అనవసర కేసుల్లో ఇరుక్కుకున్నానన్న భావనతో రవిప్రకాశ్ కూడా సంయమనంగా ఉండిపోయారట. అంతవరకు కథ బాగానే ఉన్నా హుజూర్ నగర్ ఉప ఎన్నిక రవిప్రకాశ్ కేసును మళ్లీ మొదటికి తెచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా టీవీ9 ప్రమేయం కాకుండా రేవంత్ రెడ్డికి సాయం చేసినందుకే రవిప్రకాశ్ అరెస్ట్ అయిపోయారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 

తమకు కొరకరాని కొయ్యగా మారి ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డికి ఎవరు సాయం చేసినా ఇలాంటి గతే పడుతుందన్న సంకేతాలను ఇవ్వడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం రవిని అరెస్ట్ చేసినట్టు చర్చ జరుగుతోంది. రేవంత్ తో స్నేహం చేయడానికి ఆసక్తి చూపేవారందరికి ఇదే గతి తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇది కక్ష సాధింపు రాజకీయం కాదనే వారూ ఉన్నారు. మెరుగైన సమాజం పేరుతో రవి చేసిన పాపం పండింది.. అందుకే అరెస్ట్ అయ్యారు అని వాదిస్తున్నారు. రవిప్రకాశ్ చేసిన మోసాలు, అక్రమాలే ఆయనను ఇవాళ ఈ స్థితికి తెచ్చాయని అంటున్నారు. మరి ఏది నిజమో, ఏది అబద్దమో… రవిప్రకాశ్ కే తెలియాలి.

Tags : arrestcheatingcm kcrforgeryfraudhuzurnagarravi prakashrevanth reddyTV9

Also read

Use Facebook to Comment on this PostMenu