01/4/19 8:08 PM

మోడీగారు.. దేశానికి ఏం సమాధానం చెబుతారు

Rs 2000 Notes Ban, Modi Rectifies His Mistake

బ్లాక్ మనీకి చెక్ పెడతామన్నారు. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. నల్ల కుబేరుల పని పడతామన్నారు. విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తెప్పిస్తామన్నారు. మనీ లాండరింగ్‌కు, నకిలీ కరెన్సీకి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. ఇదీ ప్రధాని మోడీ చేసిన వాగ్దానం. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోడీ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. దేశ కోసమే నోట్ల రద్దు అని సందేశాలు ఇచ్చారు. మరి మోడీ అనుకున్నది సాధించారా? ఆయన చెప్పినట్టుగానే బ్లాక్ మనీని నియంత్రించారా? పన్ను ఎగవేతలను, మనీలాండరింగ్‌ను అడ్డుకున్నారా? నల్ల కుబేరుల తాట తీశారు? అంటే వందకి వంద శాతం లేదనే జవాబు వస్తుంది.

 

పెద్ద నోట్లు రద్దు చేసి సంచలనానికి తెరలేపిన ప్రధాని మోడీ.. సరిగ్గా రెండేళ్ల తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను నిలిపేశారు. అంతేకాదు త్వరలో 2వేల రూపాయల నోట్లను రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. బ్లాక్ మనీ లేకుండా చేస్తానని చెప్పిన మోడీ.. రెండేళ్ల క్రితం (2016 నవంబర్ 8)పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. అదే సమయంలో అంతకన్నా పెద్ద నోటు 2వేల రూపాయల నోటు తీసుకొచ్చారు. పెద్ద నోట్ల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన మోడీ.. అంతకన్నా పెద్ద నోటు తీసుకురావడం అప్పట్లో పెద్ద వివాదమైంది. మోడీ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2వేల నోటు వల్ల మరిన్ని అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు అదే నిజమైంది. 2వేల నోటు అవినీతిపరులకు వరంగా మారింది. తమ అక్రమ సంపాదనను బ్లాక్ మనీ రూపంలో పోగేసుకునేందుకు 2వేల నోటు బాగా ఉపయోగపడింది. పన్ను ఎగవేతదారులు ఎక్కువయ్యారు. బ్లాక్ మనీ రూపంలో 2వేల రూపాయల నోట్లను దాచుకుంటున్నారు. మనీ లాండరింగ్‌కు అడ్డు లేకుండా పోయింది. బ్యాంకుల నుంచి వెళ్లిన నోట్లు అదేస్థాయిలో బ్యాంకులకు తిరిగి చేరడం లేదు. అటువంటి నోట్లన్నీ నల్లధనంగా పోగుపడుతున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితిని నిలువరించాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఉన్నపళంగా రూ.2వేల నోటును రద్దుచేస్తే ఎన్నికల ముందు తీవ్ర వ్యతిరేకత, విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉండటంతో తొలుత ముద్రణను నిలిపివేసి ఆ తర్వాత క్రమంగా చలామణిని తగ్గించాలని మోడీ స్కెచ్ వేశారట. 2వేల నోటు కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత ఎక్కువయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. దీంతో ప్రధాని మోడీ మేలుకున్నారు. చేసిన తప్పుని సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో చెలామణిలో ఉన్న 2వేల రూపాయల నోట్లను కూడా బ్యాంకులు వెనక్కి తీసుకోనున్నాయని, క్రమంగా అవి ఎక్కడా కనిపించకుండా చేస్తారని, ఆ తర్వాత వాటిని రద్దు చేస్తారని వార్తలు వస్తున్నాయి.

 

ఏ లక్ష్యంతో అయితే పెద్ద నోట్లను రద్దు చేశారో.. ఆ లక్ష్యాలనే 2వేల నోటు దెబ్బతీసింది. అక్రమ నిల్వలు, పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్ పెరిగిపోయి మళ్లీ నల్లధనం పేరుకుపోతోందని పసిగట్టిన మోడీ ప్రభుత్వం.. ఇక రూ.2వేల నోట్ల ముద్రణను ఆపేయాలని ఆర్బీఐకి సూచించింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 18.03 ల‌క్ష‌ల కోట్ల కరెన్సీ చెలామ‌ణిలో ఉంది. అందులో 37శాతం అంటే 6.73 ల‌క్ష‌ల కోట్లు 2వేల నోట్ల రూపంలో ఉంది.

 

నకిలీ కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోందని, అందుకే అత్యంత భద్రతా ప్రమాణాలతో కొత్త నోట్లను తీసుకొస్తున్నామని పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోడీ ఎంతో గొప్పగా చెప్పారు. అయితే కొత్త రూ.2వేల నోట్లు భద్రతా ప్రమాణాలు, నాణ్యత విషయాల్లో తేలిపోయాయి. మార్కెట్‌లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే నకిలీ కరెన్సీ రావడం సంచలనం అయింది. పైగా అప్పుడే ఈ నోట్లు చిరిగిపోవడం కూడా వీటి నాణ్యతను ప్రశ్నార్థకం చేసింది. దీంతో బ్యాంకుల్లోకి వచ్చిన సదరు నోట్లను తిరిగి వ్యవస్థలోకి పంపించకుండా ఆర్బీఐ దగ్గరకు చేరుస్తూ ఈ నోట్ల సంఖ్యను నెమ్మదిగా తగ్గించాలని కేంద్రం యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. 2వేల రూపాయల నోట్ల రద్దు గురించి కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ప్రధాని మోడీ చేసిన తప్పుని సరిదిద్దుకునే పనిలో పడటం సంతోషం అని ఇప్పటికైనా ఆయన కళ్లు తెరిచారని మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

రూ.2వేల నోటు రద్దు చేస్తారనే వార్త‌లు కలకలం రేపడంతో ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర గార్గ్‌ స్పందించారు. కావాల్సిన దాని క‌న్నా ఎక్కువ మొత్తంలోనే ప్ర‌భుత్వం వ‌ద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయ‌ని గార్గ్ తెలిపారు. 2వేల నోటు ముద్ర‌ణ‌ నిలిపివేతకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం కావాల్సినంత నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయ‌ని వివరించారు. 2వేల నోటు ముద్ర‌ణ‌ను ఆపేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న నేరుగా స‌మాధానం ఇవ్వ‌లేదు.

Tags : 2000 rupees notes ban2000 rupees notes printing stoppedBlack moneyDemonetisationpm modirbiRs.2000 notestax evasion

Also read

Use Facebook to Comment on this PostMenu