04/8/19 4:35 PM

ఎన్నికల వేళ సంచలనం… లక్ష్మీపార్వతి, విజయసాయి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

sensational allegations on lakshmi parvathi, vijaya sai reddy

ఏపీలో ఎన్నికల వేళ సంచలనం చోటు చేసుకుంది. ఊహించని పరిణామాలు తెరపైకి వచ్చాయి. అందులో ఒకటి లక్ష్మీపార్వతిది కాదా, మరొకటి విజయసాయి రెడ్డిది. ఇద్దరూ వైసీపీ నేతలే. దివంగత ఎన్టీరామారావు భార్య, వైసీపీ నేత లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తున్నారని కోటి అనే వ్యక్తి ఆరోపించాడు. తనకు వైసీపీ నేతల నుండి, లక్ష్మీపార్వతి నుండి రక్షణ కల్పించాలని వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం దుమారం రేపుతోంది. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు పేలుతున్నాయి.

 

ఇదంతా చంద్రబాబు కుట్ర అని లక్ష్మీపార్వతి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని అంటున్నారు.

 

దీనిపై లక్ష్మీపార్వతి స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు కుట్ర అని అంటున్నారు. ఒక సినిమా డైరెక్టర్ ఈ కోటిని తన ఇంటికి తెచ్చారని లక్ష్మీపార్వతి చెప్పారు. కోటి గుంటూరు జిల్లా వినుకొండ అని చెప్పారు. ఇంటికొచ్చిన మనిషిని సాదరంగా ఆహ్వానించడమే తాను చేసిన పెద్ద తప్పు అని ఆమె వాపోయారు. తనకేదైనా ఉద్యోగం చూపించమని కోటి ప్రాధేయపద్దాడని చెప్పారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడని, ప్రతి నెలా తన తల్లి కోసం మందులు తెచ్చి ఇచ్చేవాడని తెలిపారు. అంతకుమించి అతనితో తనకెలాంటి సంబంధం లేదన్నారు.

 

వైసీపీ నేత లక్ష్మీపార్వతిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై వైసీపీ మద్దతుదారు, నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో లక్ష్మీపార్వతికి ఆయన మద్దతుగా నిలిచారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించారు. 70ఏళ్ల వయసున్న లక్ష్మీపార్వతిపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, అమ్మమ్మ వయసులో ఉన్న ఆమెపై ఈ తరహా ఆరోపణలు చేయడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెను కావాలని ఇబ్బంది పెట్టే విధంగా టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. లక్ష్మీపార్వతిపై కక్షతో కేసులు పెట్టించి అప్రదిష్ట పాలుచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత నీచానికి దిగజారడం సమంజసం కాదన్నారు.

 

లక్ష్మీపార్వతి వ్యవహారమే కాదు.. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సంబంధించినదిగా చెబుతున్న ఓ ఆడియో టేప్ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ‘ఆంధ్రా జనం తెలంగాణవారిలా నిబద్ధత కలిగినవారు కాదు. ఏపీలో భయానకమైన కుల సంఘర్షణ ఉంది. ఈ ఎన్నికల్లో గెలుస్తామంటూ కొందరు జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోదీ పచ్చి స్వార్థపరుడు. మోదీ స్వార్థం మాత్రమే చూసుకుంటారు’.. ఇలా ఏపీ ప్రజలను, పార్టీ చీఫ్ జగన్ ని, ప్రధాని మోడీని.. కించపరుస్తూ ఆ ఆడియో టేప్ లో మాటలు ఉన్నాయి. లీకైన ఆడియో టేప్ ఏపీలో హల్‌చల్ సృష్టిస్తోంది. ఈ ఆడియో ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఛానెల్‌కు మాత్రమే లభించింది. దీని ఆధారంగా టీడీపీ నేతలు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. విజయసాయి రెడ్డి నిజస్వరూపం ఇదే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

ఆడియో టేప్ రాజకీయంగా దుమారం రేపింది. దీనిపై విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆడియోలో ఉన్న గొంతు తనది కాదని, అది ఫేక్ వాయిస్ అని స్పష్టం చేశారు. ‘‘ఏబీఎన్‌ ఛానెల్‌లో నేను మాట్లాడినట్లుగా ప్రసారం చేసిన ఆడియో పచ్చి ఫేక్‌. ఆ గొంతు నాది కానే కాదు. నా గొంతును మిమిక్రీ చేయలేక బొక్కబోర్లా పడ్డారు. ఓటమి తథ్యం అని తెలిసి జిమ్మిక్కులు మొదలెట్టారు. ఓట్ల కోసం ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే కుటిల యత్నం అది. అధఃపాతాళానికి దిగజారుతున్నారు!’’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు దీనిపై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ ఆడియో టేప్ ప్రసారం చేసిన చానెల్ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ ఆడియోలు ఇలాగే వదులుతారన్న విజయసాయిరెడ్డి దమ్ముంటే ఆ ఆడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని సవాల్ విసిరారు. మొత్తంగా అటు లక్ష్మీపార్వతి వ్యవహారం, ఇటు విజయసాయిరెడ్డిగా చెబుతున్న ఆడియో టేప్.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Tags : allegationschandrababukotilakshmi paravathitapeTDPvijaya sai reddyys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu