02/8/19 7:49 PM

జనాలను కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నారు : ఆ విషయంలో పోటీలు పడుతున్న చంద్రబాబు, జగన్

Social Welfare Schemes To Decide AP CM

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడటంతో అధికార, ప్రతిపక్షాలు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా నాయకులు పావులు కదుపుతున్నారు. ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు వరాల జల్లు కురిపిస్తున్నారు. కొత్తకొత్త సంక్షేమ పథకాలతో జనాలను ముంచెత్తుతున్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ పోటీలు పడుతున్నారు.

 

అయితే ప్రతిపక్ష నేత ఊహించని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. వెయ్యి రూపాయలుగా ఉన్న పెన్షన్‌ను 2వేలు చేశారు. నిరుద్యోగ భృతిని సైతం 2వేలకు పెంచారు. ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.

 

చంద్రన్నబాట కింద రాష్ట్రంలో 25 వేల కి.మీ మేర సీసీ రోడ్లు వేశామని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ క్యాంటిన్ల ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నామని గుర్తు చేశారు. కిడ్నీ బాధితుల పెన్షన్ల రూ.2,500 నుంచి రూ.3,500కు పెంచామని, డయాలసిస్‌ కేంద్రాలను పెంచామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, కాపులకు తాను ఇచ్చిన హామీలను తూచ తప్పుకుండా అమలు చేసినట్లు తెలిపారు. కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చెయ్యడంతోపాటు 5శాతం రిజర్వేషన్ల ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తోపాటు బీసీ, ఇతర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మాటలతో మభ్యపెట్టే నాయకులు కాలగర్భంలో కలిసిపోతారని చేతల్లో చూపెట్టే నేతలు చరిత్రలో నిలిచిపోతారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉండాలన్నదే తన విజన్ అని, 2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

 

రాష్ట్రంలో 95లక్షల మంది చెల్లెమ్మలకు పసుపు-కుంకుమ పథకం ద్వారా రూ.20వేలు చెల్లించిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని చంద్రబాబు అన్నారు. వృద్ధులకు పెద్ద కొడుకుగా ఉంటానని తాను హామీ ఇచ్చానని ఇచ్చినట్లుగానే రూ.200 నుంచి రూ.2వేల వరకు పింఛన్ ఇస్తున్న ఘనత తమదే అన్నార. పింఛన్ల వల్ల రూ.14వేల కోట్లు భారం అవుతున్నా ప్రభుత్వం వెనుకడుగు వెయ్యడం లేదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి రూ.44వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. శ్రీశైలం జలాలను రాయలసీమకు తరలించామన్నారు. రాయలసీమను సశ్యశ్యామలం చేసిన ఘనత తమదేనన్నారు.

 

చంద్రబాబుకి ధీటుగా జగన్ కూడా హామీల వర్షం కురిపిస్తున్నారు. భారీగా తాయిలాలు ప్రకటిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ముసలోళ్లకు 3వేల రూపాయల పింఛన్ ఇస్తానని ప్రకటించారు. నవరత్నాల పేరుతో ఓటర్లను ఊరిస్తున్నారు. ఇలా పథకాల విషయంలో టీడీపీ, వైసీపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరి ప్రజలు ఏ పథకానికి జై కొట్టి ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

Tags : ap electionscm chandrababudevelopmentPensionssocial welfare schemesTDPys jaganysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu