02/23/18 3:57 PM

సీఎం చంద్రబాబుపై సోము సంచలన వ్యాఖ్యలు..!

Untitled-1 copy

ఏపీలో మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రత్యేక హోదా విషయంలో పరస్పర దూషణలకు దిగుతున్నారు. తాజాగా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ఆనాడు చంద్రబాబు చెప్పిన మాటలనే తానిప్పుడు చెబుతున్నానని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు, ఆ మాటెత్తితే జైలుకు పంపుతానని అనలేదా? అని ఆయన ప్రశ్నించారు. నాడు విపక్షాలను బెదిరించిన చంద్రబాబు, ఇప్పుడు మిత్రపక్షాన్ని బెదిరిస్తున్నారని సోమువీర్రాజు మండిపడ్డారు.

 

ఈ ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన సోము, హోదా వస్తే రూ. 3 వేల కోట్ల మేరకు మాత్రమే లబ్ధి కలుగుతుందని చంద్రబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అప్పట్లో హోదా ఉన్న రాష్ట్రాలకన్నా ఏపీకే ఎక్కువ వచ్చాయని కూడా చంద్రబాబు అన్నారని, ఇప్పుడు తాను అవే మాటలు చెబుతుంటే విమర్శిస్తున్నారని దెప్పిపొడిచారు. ఎందుకు మాట మారుస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించలేని తెలుగుదేశం నేతలు, ఇప్పుడు తనపై విరుచుకుపడుతున్నారని సోమువీర్రాజు విమర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ సకాలంలోనే వచ్చాయని, వస్తున్నాయని, అయినా ఇప్పుడు కావాలనే బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

 

ఏపీలో ధర్మయుద్ధం జరుగుతోందని సోమువీర్రాజు పెద్ద పెద్ద మాటలు అన్నారు. హోదాతో ఒరిగేదేం లేదని, మనమే ఎక్కువ సాధించామని, ఏ రాష్ట్రానికైనా ఎక్కువ వచ్చాయా? అని చంద్రబాబు అన్నారని… ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని సోమువీర్రాజు ప్రశ్నించారు. ఒక్కసారిగా చంద్రబాబు వైఖరిలో ఎందుకింత మార్పు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని స్వయంగా చంద్రబాబే అసెంబ్లీలో, బయటా మాట్లాడారు.. అని పలు విషయాలను ఆధారాలతో సహా సోము వీర్రాజు మీడియా ముందు పెట్టారు.

 

ఓ వైపు సమన్యాయం, మరోవైపు సమైక్యవాదం అంటూ చంద్రబాబు ఏపీ ప్రజలను తీవ్రంగా మోసం చేశారని, అసలు రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం ఆయనేనని సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. నాడు విభజనకు తాను అనుకూలమేనని కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖను చూపించి సోమువీర్రాజు విమర్శలు గుప్పించారు. అప్పట్లో బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారే తప్ప, ఏపీలో ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారాయన. ‘హోదాకు బదులు ప్యాకేజీ మూడు వేల కోట్లు చాలన్నారు. ఇప్పుడీ విధంగా ఎందుకు చేస్తున్నారు?” అని వీర్రాజు ప్రశ్నించారు.

Tags : andhra pradeshap cm chandrababu naiduBJPbjp mlcsomu veerrajuspecial statusTDP

Also read

Use Facebook to Comment on this PostMenu