09/12/19 9:28 PM

రాజధాని రగడ : అసలు జగన్ మనసులో ఏముంది..?

Still Confusion On AP Capital

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చి అప్పుడే 100 రోజులు దాటింది. ఇంకా అనేక అంశాలపై క్లారిటీ లేదు. పాలనాపరంగా సీఎం జగన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నా.. కొన్ని విషయాల్లో స్పష్టత లోపించింది. ముఖ్యంగా రాజధానిపై అస్సలు క్లారిటీ లేదు. ఏపీ రాజధాని ఏది? అనే సందేహం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. మంత్రులు, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అందుకు సంకేతం. ఇక రాజధాని అమరావతిలో ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణ పనులు చేయలేదు ప్రభుత్వం. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. రాజధాని మారబోతోంది అనే వాదనలకు బలం చేకూరింది.

 

ఒకాయన ఏమో రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదంటాడు. మరొకాయన.. అమరావతే రాజధాని అంటూ గత ప్రభుత్వం అసలు గెజిట్ నోటిఫికేషనే విడుదల చెయ్యలేదు అంటాడు. ఇంకొకాయన ఏకంగా.. అమరావతి నిర్మాణానికి నిధులే లేవంటాడు.. ఇదీ అధికార పార్టీ నేతల వరుస. దీంతో రాజధానిపై కన్ ఫ్యూజన్ పెరిగిపోతోంది. కొంతకాలంగా రాజధాని గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. మున్సిపల్ శాఖ మంత్రి, సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ తో దుమారం రేగింది. రాజధానిగా అమరావతి ప్రాంతం సేఫ్ కాదని బొత్స అనడం కలకలం రేపింది. అప్పటి నుంచి రాజధాని మార్పు గురించి చర్చ జరుగుతోంది. తాజాగా మంత్రులు బొత్స, బుగ్గన చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. అమరావతి రాజధానిగా గుర్తిస్తూ టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదని బొత్స అన్నారు. అంటే అధికారికంగా ప్రకటన చెయ్యనట్లే అన్నారు. అసలు గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చెయ్యలేదు అని చంద్రబాబుని ఆయన నిలదీశారు. చంద్రబాబు వైఖరి కారణంగానే రాజధానికి అడ్రస్ లేకుండా పోయిందని మండిపడ్డారు. మరోవైపు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాంబు పేల్చారు. ఏకంగా విదేశంలో అమరావతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు లేవని ఆయన అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయాలనుకోవడం సరికాదన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించినట్టు తెలిపారు. భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు ఏపీ తరపున హాజరైన ఆయన అక్కడ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

గెజిట్ నోటిఫికేషన్ లేదనే లాజిక్ తో బొత్స.. నిధులే లేవు అని మరో మంత్రి బుగ్గన… రోజుల వ్యవధిలో అధికార పార్టీకి చెందని ఇద్దరు కీలక ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. చూస్తుంటే.. రాజధానిగా అమరావతిని కొనసాగించడం జగన్ కు ఇష్టం లేదేమో అనే ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ తప్ప…. ఆయన మంత్రులంతా మాట్లాడుతున్నారు. దీంతో రాజధాని నిర్మాణంపై ప్రజల్లో అనుమానాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కాగా, ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి రాష్ట్ర రాజధాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. అమరావతి నిర్మాణానికి నిధుల్లేవని చెప్పడం సమంజసం కాదన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు.

 

రాజధానిపై మంత్రి వ్యాఖ్యలతో జగన్ సర్కార్ తన వైఖరి స్పష్టం చేసిందని టీడీపీ నేతలు అంటున్నారు. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు రుణాలు పోయేలా చేసి.. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నిధులు లేవని చేతులెత్తేయడం సమంజసం కాదన్నారు. ఇది ప్రభుత్వ దివాళాకోరుతునానికి నిదర్శనం అన్నారు. రాజధాని విషయంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారని, టీడీపీ హయాంలో చేసింది కూడా అభివృద్ధి వికేంద్రీకరణేనన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలనూ సమానంగా అభివృద్ధి చేశామని ఎదురు దాడికి దిగారు. జగన్ 6 నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానని చెప్పారు కానీ వంద రోజుల్లోనే ఇంతకన్నా చెడ్డ సీఎం లేరని నిరూపించుకున్నారు అని ఎద్దేవా చేశారు.

 

ఇంత జరుగుతున్నా.. మంత్రులు పూటకో మాట మాట్లాడుతున్నా సీఎం జగన్ మాత్రం స్పందించడం లేదు. పొరపాటున కూడా నోరు విప్పడం లేదు. రాజధాని గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా.. కీలక నేతలు, మంత్రులు.. రాజధాని గురించి మాట్లాడటం వెనుక సీఎం జగన్ ఆదేశాలు లేకపోలేదు అనే వాదనలూ ఉన్నాయి. సీఎం జగన్ సూచనల మేరకే వాళ్లు అలా మాట్లాడుతున్నారని టీడీపీ అంటోంది. జగన్ కి తెలియకుండా మాట్లాడే ధైర్యం వారికి లేదని చెబుతోంది. సో.. ఇదంతా సీఎం జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందనేది వారి వాదన. మొత్తంగా రాజధానిపై మరోసారి కన్ ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయ్యింది. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే.. సీఎం జగన్ స్పందించాల్సిందే. ఆయన నోరు విప్పితే కానీ.. ఓ క్లారిటీ రాదు.

Tags : amaravatiandhra pradeshbotsabugganacapitalchandrababucm jaganfundsTDP

Also read

Use Facebook to Comment on this PostMenu