07/15/19 12:17 PM

చంద్రబాబు కళ్లు తెరిపించిన మాజీ తమ్ముడు

Sujana Chowdary Sensational Comments On Chandrababu

నాడు.. టీడీపీది ధర్మ పోరాటం అన్నారు, హోదా కోసం తుది శ్వాస వరకు పోరాడతా అన్నారు.. ఏపీకి బీజేపీ మోసం చేసిందన్నారు.. కట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీ చేసింది అధర్మ పోరాటం అంటున్నారు.. హోదా ముగిసిన అధ్యాయం అంటున్నారు.. ఏపీ అభివృద్ది బీజేపీతోనే సాధ్యం అంటున్నారు.. ఇంతలోనే ఎంత మార్పు.. ఆయనే సుజనా చౌదరి. రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సుజనా చౌదరి చానా మారిపోయారు. బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత తొలిసారి ఏపీకి వచ్చిన ఆయన బీజేపీ నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబుకి హితబోధ చేశారు. చంద్రబాబు కళ్లు తెరిపించేలా మాట్లాడారు.

 

బీజేపీ ప్రభుత్వంపై టీడీపీ చేసింది ధర్మపోరాటం కాదని.. అధర్మపోరాటమని సుజనా చౌదరి విమర్శించారు. అంతేకాదు.. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే అన్నారు. ఇదే విషయాన్ని తాను టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకి చెప్పినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, అందుకే చాలామంది నేతలు చేరేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. తాను ఇప్పటివరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్నానని, బీజేపీలో చేరికతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారని సుజనా చౌదరి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదాకు బదులు కేంద్ర ప్యాకేజీ ఇచ్చిందని, దాన్ని అంగీకరిస్తేనే రాష్ట్రం భివృద్ధి చెందుతుందని సుజనా చౌదరి సలహా ఇచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కూడా విభజన చట్టంలో లేనే లేదన్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేతలు స్వయంగా పార్టీలో చేరేందుకు వస్తున్నారని సుజనా చౌదరి అన్నారు.

 

అంతేకాదు..ఏపీ వ్యాప్తంగా త్వరలో పర్యటిస్తానని.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో ఉన్నామని, అందుకు తగిన ప్రణాళికలతో ముందుకెళతామని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పడం విశేషం. అందులో భాగంగానే ఏపీలోనూ అడుగులు వేస్తున్నామని, పార్టీని బలోపేతం చేయాలని అధిష్ఠానం ఆదేశించిందని అన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయాలు చూస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో పోరాడితే అభివృద్ధి విషయంలో రాష్ట్రం వెనుకబడుతుందని, బీజేపీతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యమని సుజనా అభిప్రాయపడ్డారు. కావాలని ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో కేంద్రం పని చేయదని స్పష్టం చేశారు.

 

ఎవరేం చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని, అది ముగిసిన అధ్యాయం అని సుజనా అన్నారు. ప్రధానమంత్రి సీట్లో జగన్, చంద్రబాబు కూర్చున్నా ఏపీకి ఈ ‘హోదా’ రాదని తేల్చి చెప్పారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేయలేదని బల్లగుద్ది చెప్పగలనని అన్నారు. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేయని సాయం బీజేపీ ప్రభుత్వం చేసిందని గొప్పగా చెప్పారు. చరిత్రలు తవ్వి గత ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టడం జగన్ కు మంచిది కాదని హితవు పలికారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న ఫిర్యాదులు కనుక ఉంటే వాటిపై విచారణ జరపవచ్చని సూచించారు.

 

గతంలో టీడీపీతో కలవడం వల్లే ఏపీలో బీజేపీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. బీజేపీకి రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలేనని అన్నారు. తనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్ చిత్రాన్ని ఉంచడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. కాగా, గుంటూరులో బీజేపీ పదాధికారుల సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనే నిమిత్తం సుజనా చౌదరి ఇక్కడికి వచ్చారు.

 

చంద్రబాబు చేసింది ధర్మ పోరాటం కాదు.. అధర్మ పోరాటం అని.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని.. ఏపీలో బీజేపీ బలపడుతుందని.. సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిన్నటి వరకు బీజేపీని తిట్టిపోసిన సుజనా.. ఇవాళ ఇలా మాట్లాడటం చూసి అంతా షాక్ అవుతున్నారు. చంద్రబాబుకి జ్ఞానోదయం చేశారని, ఆయన కళ్లు తెరిపించారని, మీరు గ్రేట్ అని.. టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. నాడు టీడీపీలో ఉన్నప్పుడు కనిపించని తప్పులు.. పార్టీ మారగానే.. అవన్నీ తప్పుల్లా కనిపిస్తున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.

Tags : BJPchandrababudharma poratammodispecial statussujana chowdaryTDP

Also read

Use Facebook to Comment on this PostMenu