05/2/19 11:17 AM

ఈవీఎంల హ్యాకింగ్‌కు భారీ కుట్ర : మరో బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి

TDP Conspiracy For EVMS Hacking

ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు. అధికార, ప్రతిపక్షాల మధ్య ఏదో ఒక అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది. అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపించడం, కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే వారిపై వేటు వెయ్యడం తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబ సమీక్షలపై ఈసీకి కంప్లయింట్ చెయ్యడం.. ఆ వెంటనే.. చంద్రబాబు సమీక్షలపై ఈసీ నిషేధం విధించడం జరిగింది. ఏపీలో కౌంటింగ్ రోజున అల్లర్లు జరిగే అవకాశం ఉందని, దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడాయన మరో బాంబు పేల్చారు. ఈవీఎంల హ్యాకింగ్ కు టీడీపీ కుట్రం చేస్తోందని ఆరోపించారు.

 

ఏపీలో ఈవీఎంల హ్యాకింగ్ కు కుట్ర జరుగుతోందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్.. 20మంది హ్యాకర్లతో సమావేశం అయ్యారని, ఈవీఎంలను ఎలా హ్యాక్ చెయ్యాలి, కౌంటింగ్ రోజున ఏ విధంగా చేస్తే ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వస్తాయి అనే దానిపై హ్యాకర్లతో అశోక్ చర్చలు జరిపాడని.. దీనికి సంబంధించి తమ దగ్గర పక్కా సమాచారం ఉందని విజయసాయి రెడ్డి చెప్పారు. డేటా చోరీ కేసులో అశోక్ ను పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేకపోవడం దారుణం అన్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్.. ఈవీఎం హ్యాకింగ్ కు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

 

ఈవీఎంల హ్యాకింగ్ కు టీడీపీ కుట్ర చేస్తోందని విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా, విజయసాయి ఆరోపణలకు సీఎం చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు. ఈవీఎంలను హ్యాక్ చేసింది వైసీపీ నేతలే అని ఎదురుదాడి చేశారు. మీరు తప్పులు చేసి మాపైకి నెడతారా అని నిలదీశారు.

 

ఈవీఎంలను హ్యాక్ చెయ్యడం అసాధ్యమని ఓవైపు ఈసీ వాదిస్తోంది. వైసీపీ కూడా ఈసీ వాదనను సమర్థించింది. ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణలు కొట్టిపారేసింది. ఓటమి భయంతోనే చంద్రబాబు.. ఈవీఎంల గురించి రాద్దాంతం చేస్తున్నారని వైసీపీ నాయకులు అన్నారు. అలాంటి నాయకులు ఇప్పుడు ఈవీఎంల హ్యాకింగ్ గురించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా? అని టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోతామని తెలిసిపోయిందని, ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేందుకు వైసీపీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కౌంటింగ్ రోజున అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ఈవీఎంల హ్యాకింగ్ కు కుట్ర జరిగిందని.. విజయసాయి రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు.. సందేహాలకు తావిస్తున్నాయని చెబుతున్నారు. రేపు ఎన్నికల్లో ఓడిపోయినా.. ఆ నెపాన్ని ఇలా టీడీపీపై మోపేందుకే విజయసాయిరెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో అనేది టీడీపీ శ్రేణుల వాదన. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. అంతిమ ఫలితం మే 23న వెలువడనుంది.

Tags : chandrababuconspiracyevms hackingit grids ashokTDPvijayasai reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu