09/5/19 8:13 PM

మళ్లీ పొత్తు ? వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ…?

TDP, Janasena, BJP Alliance To Defeat Jagan

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అనేకసార్లు ప్రూవ్ అయ్యింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేకసార్లు నిరూపితమైంది. రానున్న కాలంలో ఇది మరోసారి నిజమయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబు, పవన్, మోడీ మళ్లీ చేతులు కలపొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైఎస్ జగన్ ను ఢీకొట్టాలంటే.. మళ్లీ ముగ్గురు జత కట్టాల్సిందే అనే అభిప్రాయానికి వచ్చారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత, మాజీ మంత్రి అందునా చంద్రబాబు సన్నిహితుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడీ చర్చకు తెరలేపాయి.

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఏకమై అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు చేతులు కలపనున్నాయానే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 2022 లో జ‌మిలీ ఎన్నికలు జరిగినా… లేదా 2024లో ఎన్నికలు జరిగినా బద్ధ శత్రువులైన ఈ పార్టీలన్నీ ఒక్కటై వైసీపీని ఓడించేందుకు పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తాయా ? అన్న డౌట్లు ఇప్ప‌టికే ఉన్నాయి.

 

రాజకీయాల్లో పొత్తుల విషయంపై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతాయని అయ్యన్న జోస్యం చెప్పారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. జమిలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తి చూపిస్తున్నారన్న ఆయన.. ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయన్నారు.

 

ఇక ఈ వ్యాఖ్యలు బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ దోస్తీ కొనసాగిస్తోందన్న ఆరోపణలకు బలం చేకూర్చాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీతో దోస్తీ కొనసాగించారనే వార్తలు జోరుగా వినిపించాయి. మరోవైపు ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలోకి చేరారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును కాపాడేందుకే వీరు బీజేపీలో చేరారన్న విమర్శలూ వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 

తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా అయ్య‌న్న‌ చేసిన వ్యాఖ్యలను బ‌ల‌ప‌రిచేలా ఉన్నాయి. మూడు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేసి వైసీపీ చేతిలో ఘోరంగా దెబ్బతిన్నాయి. వైసీపీ రికార్డులు క్రియేట్ చేస్తూ ఏకంగా 151 సీట్లతో తిరుగులేని రీతిలో అధికారం సొంతం చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ బలమైన శక్తిగా ఉంది. వైసీపీని ఒంటరిగా ఓడించ‌డం టీడీపీకి, బీజేపీ, జనసేనకు సాధ్యమయ్యే పని కాదని చర్చలు కూడా నడుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీని ఓడించాయి.

 

మరోసారి ఈ మూడు పార్టీలు జతకడితే తప్ప వైసీపీని ఓడించలేము అనే నిర్ణయానికి వచ్చాయని సమాచారం. మూడు పార్టీల కూట‌మి వైసీపీని ఓడిస్తుంద‌ని అయ్య‌న్న చెప్ప‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ఇప్ప‌టికే ఈ మూడు పార్టీల నేత‌లు వేర్వేరుగా వైసీపీని టార్గెట్‌గా చేసుకుంటున్నాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా చంద్రబాబుకు ల‌బ్ధి క‌లిగేలా ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ‌ధానిని తరలిస్తే పోరాటం చేస్తాన‌ని ప‌వ‌న్ హెచ్చరించారు. బీజేపీ నేత‌ల మాట‌లు కూడా అలాగే ఉన్నాయి. రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లించ‌డం క‌రెక్ట్ కాద‌ని చెపుతున్నారు. ఇటీవ‌ల న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరింది కూడా టీడీపీని, చంద్రబాబుని కాపాడి, రానున్న ఎన్నిక‌ల్లో పొత్తులు కుదిర్చేందుకే అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అయ్య‌న్న పాత్రుడు చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే ఈ మూడు పార్టీలో నేడు కాక‌పోయినా… రేపు అయినా కల‌వ‌డం ఖాయమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

అయితే బాగా రచ్చ జరిగిన తర్వాత.. అయ్యన్న స్పందించారు. మూడు పార్టీలు కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి, కలిసి పోటీ చేస్తాయని తాను అనలేదు అన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని మాత్రమే అన్నాను అని వివరించారు. ఏది ఏమైనా అయ్యన్న సీనియర్ నేత. పైగా చంద్రబాబుకి సన్నిహితుడు. సో.. నోటికొచ్చినట్టు వాగడానికి అయ్యన్నేమీ లోకల్ లీడర్ కాదు. ఆయన మాటలను తీసిపారేయడానికి అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి అయన్న చెప్పింది ఎంతవరకు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags : ALLIANCEBJPchandrababucm ys jagan mohan reddyjanasenamodipawan kalyanTDPysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu