10/14/18 11:28 AM

ఐటీ అదికారులపై సీఎం రమేష్ సంచలన ఆరోపణలు

cm ramesh

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఐటీ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఐటీ దాడుల గురించి మీడియాతో మాట్లాడిన సీఎం రమేష్.. సోదాలకు వచ్చిన ఐటీ అధికారులు బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారు? అని తనను ప్రశ్నించారని చెప్పారు. పరోక్షంగా తనను బీజేపీలోకి రమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నారని సిఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. మేము కరడుగట్టిన తెలుగుదేశం వాదులం.. దాడులకు బెదిరేది లేదని అని వారికి తేల్చిచెప్పానని సీఎం రమేష్ అన్నారు.

 

తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, విభజన హామీల అమలు దిశగా ఒత్తిడి తెస్తున్నందునే తనపై ఐటీ అధికారులతో దాడులు చేయించారని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఐటీ అధికారులు పంచనామా కాపీని తనకు అందించి, సోదాలు ముగిసినట్టు తెలిపి, వెళ్లిపోయిన తరువాత ఆయన అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు.

 

“నేను కరుడుగట్టిన టీడీపీవాదినని అందరికీ తెలుసు. నన్ను బీజేపీలోకి రావాలని అడిగారు. సోదాలు చేసేందుకు వచ్చిన అధికారులు కూడా, బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారని నన్ను ప్రశ్నించారు. నాపై నెల రోజుల క్రితం జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. భయానికి గురిచేసేందుకే నాపై బీజేపీ దాడులు చేయిస్తోంది. నేను ఎలాంటి బెదిరింపులకూ భయపడను’’ అని సీఎం రమేష్‌ స్పష్టం చేశారు.

 

అధికారులు సహకరిస్తే తన ఇంట్లో జరుగుతున్న సోదాలను వీడియో తీసి మీడియాకు పంపిస్తానన్నారు. ఐటీ అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తన భార్య పేరిట నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. ఢిల్లీకి డబ్బులు తరలించాననడం అవాస్తవమని, నాలుగేళ్లలో రూ.200 కోట్ల వరకు పన్ను చెల్లించానని సిఎం రమేష్ చెప్పారు.

 

శుక్రవారం ఉదయం నుంచి శనివారం అర్ధరాత్రి వరకూ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన స్వగ్రామం కడప జిల్లా పోట్లదుర్తిలో ఐటీ సోదాలు శుక్రవారమే ముగియగా, హైదరాబాద్‌లో మాత్రం శనివారం అర్ధరాత్రి వరకూ సాగాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.3.53 లక్షల నగదు, సీఎం రమేష్‌, కుటుంబసభ్యుల పేరిట ఉన్న 14 బ్యాంకు ఖాతాలను వారు గుర్తించారు. అలాగే ఇంట్లో ఓ లాకర్‌ను గుర్తించిన అధికారులు అది రమేష్‌ వేలిముద్రల ద్వారా మాత్రమే తెరుచుకుంటుందని తెలుసుకుని డిల్లీలో ఉన్న ఆయనను పిలిపించారు. రమేష్‌కు చెందిన సంస్థల్లో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు, కొన్ని హార్డుడిస్కులు స్వాధీనం చేసుకున్నారు.

 

బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు చేస్తున్న ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని సీఎం రమేష్ ప్రకటించారు. సమయం చెబితే ఆదివారమే చర్చకు వస్తానని పేర్కొన్నారు. రిత్విక్‌ సంస్థలో సోదాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, అధికారుల దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారాయన.

Tags : BJPcm rameshit raids on cm ramesh homesofficestax raidstdp law makers homes officestdp mp ramesh

Also read

Use Facebook to Comment on this Post



Menu