06/28/19 8:23 PM

అక్రమకట్టడాల వివాదం : సీఎం జగన్ కి టీడీపీ సూటి ప్రశ్న

TDP Question YS Jagan On Illegal Constructions

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసానికి సీఆర్డీఏ అధికారులు కూల్చివేత నోటీసులు అంటించడం.. కృష్ణానదికి 100 మీటర్ల సమీపంలో ఈ భవనం కట్టడంపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడం రాజకీయం దుమారం రేపింది. దీనిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యే అని వారు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల ఆత్రుత చూస్తుంటే చంద్రబాబు మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలన్న ఆలోచనలోనే వారు ఉన్నారనిపిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రూల్స్ గురించి మాట్లాడారు. జగన్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

 

ఈ వ్యవహారంలో లీగల్ అంశాలను కూడా పరిశీలించలేదని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. లింగమనేని గెస్ట్ హౌస్ ను పంచాయతీ పర్మిషన్ తో కట్టారని చెప్పారు. అమరావతి అన్నది పంచాయతీ ఏరియా అని గుర్తు చేశారు. అక్కడ రాజధాని వచ్చాక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓ పిల్ వేశారని… అక్రమ కట్టడాలను కూల్చేయాలని పిటిషన్ వేశారని… దానిపై ఇంకా తీర్పు రాలేదని చెప్పారు. ఇలా కోర్టులో కేసు ఉన్నప్పుడు బిల్డింగ్ కూల్చివేతకు నోటీసులు ఎలా ఇస్తారు? లింగమనేని బిల్డింగ్ కట్టినప్పుడు సీఆర్డీఏనే లేదని యనమల స్పష్టం చేశారు.

 

అంతేకాదు ఈ భవనం నిర్మించినప్పడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఇది అక్రమ నిర్మాణమైతే…ఆ రోజు వైఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలకు అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందో చెప్పాలని యనమల ప్రశ్నించారు. వైఎస్ పేరుతో ఉన్న పార్టీని కొడుకు జగన్ నడుపుతున్నారు..వైఎస్ బొమ్మ పెట్టుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వైఎస్ కాలంనాటివి అక్రమ కట్టడాలైతే వాటికి జగన్ బాధ్యత వహించాలి. తండ్రి అనుమతి ఇచ్చిన నిర్మాణాలకు కొడుకు నోటీసులు పంపడమా..? అవన్నీ అక్రమ నిర్మాణాలైతే బాధ్యత వహించాల్సింది జగనే అని యనమల లాజిక్ గా మాట్లాడారు.

 

చంద్రబాబు నివాస భవనం నిర్మించే సమయానికి సీఆర్డీఏనే లేదన్నారు. అప్పటికి అమరావతి రాజధాని ప్రతిపాదన లేదని యనమల గుర్తుచేశారు. ఈ భవనానికి 2008లో గ్రామ పంచాయితీ అనుమతి ఇచ్చిందన్నారు. రివర్ కన్జర్వేటర్ 2012లో అనుమతి ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుపై కక్షతోనే నదికి 130మీ దూరంలో ఉన్న ప్రజావేదికను కూలగొట్టారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న నివాసానికే ఏకంగా నోటీసులు అంటించారని తప్పుబట్టారు. ఇది విధ్వంసక ప్రభుత్వంగా మారిందని యనమల ధ్వజమెత్తారు. భవనాలను నేలమట్టం చేస్తోంది, ఇళ్లకు నోటీసులిస్తోంది, పౌరులపై దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కూలగొట్టడం, విధ్వంసం చేయడం, భయోత్పాతం సృష్టించడమే జగన్ దినచర్యగా మారిందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం పై ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. బెదిరించడం, దాడులు చేయడం, దౌర్జన్యాలు జరిపించడం జగన్ నిత్యకృత్యాలని ఆరోపించారు. చంద్రబాబు నిర్మాణానికి కృషి చేస్తే, జగన్ విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని యనమల పిలుపునిచ్చారు.

Tags : ap cm ys jaganchandrababu houseCRDAillegalkarakattaTDPys rajasekhara reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu