10/7/19 12:13 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మెకి పరిష్కారం అదొక్కటేనా..?

CM KCR Sensational Decision On TSRTC Strike

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సమ్మెపై ముందు నుంచి సీరియస్ గా ఉన్న సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించారు. ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని డిసైడ్ అయ్యారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం దుమారం రేపుతోంది. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు తప్పు పడుతున్నారు.

 

సమ్మె చట్ట విరుద్దమని చెబుతూ..సమ్మెలోకి వెళ్లిన ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరటానికి డెడ్ లైన్ విధించారు సీఎం కేసీఆర్. కొంతమంది ఉద్యోగులు విధుల్లో చేరారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేసిన ఉద్యోగుల పై వేటు వేస్తున్నట్లుగా సీఎం సంచలన ప్రకటన చేశారు. దీని ద్వారా ఇక..తమ మాట విని విధుల్లో ఉన్న సిబ్బంది 1200 మంది మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా కొనసాగుతారని స్పష్టం చేశారు. జేఏసీ నేతలతో చర్చల ప్రసక్తే లేదని..అదే విధంగా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. త్వరలో ఆర్టీసీలో కొత్త విధానం అమలవుతుందని స్పష్టం చేశారు.

 

ఆర్టీసీ సమ్మెపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విధించిన గడువు లోపల విధులకు హాజరుకాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది సిబ్బంది మాత్రమే మిగిలి ఉన్నారని ప్రకటించారు సీఎం. అంటే..48వేల 800 ఉద్యోగాలు పోయినట్టే. కొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమించాలని, నియామక ప్రక్రియ అతిత్వరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు.. కొత్తగా చేర్చుకునే సిబ్బంది యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయాలని కండీషన్ కూడా పెట్టారు. కొత్త సిబ్బంది షరతులతో కూడిన నియామకం అవుతుందని, ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుందని కేసీఆర్ స్పష్టంచేశారు. అంతేకాదు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

 

”ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదు. చాలా రాష్ట్రాల్లో నామ మాత్రంగా ఉంది. కర్నాటక తర్వాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే సమ్మెకు దిగడం అవసరమా? సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసారా? కేరళలో చేసారా? బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎక్కడైనా విలీనం చేశారా? కాంగ్రెస్స్ పార్టీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలోనైనా చేశాయా? అందుకే వాళ్లకు అడిగే హక్కు లేదు. అఖిలపక్ష సమావేశం డిమాండ్ అసంబద్ధం” అని కేసీఆర్ అన్నారు.

 

ఇకపై ఆర్టీసీ బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులుంటాయని, మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివని సీఎం కేసీఆర్ చెప్పారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో చర్యలు చేపడితే బస్సులు బాగా నడుస్తాయని అభిప్రాయపడ్డారు. రెండు-మూడేళ్లలో సంస్థ నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వస్తుందని కేసీఆర్ అన్నారు. తక్షణ చర్యగా 2వేల 500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 4వేల 114 ప్రైవేట్ బస్సులు ఇంకా వున్నాయని.. స్టేజ్ కారేజ్‌గా చేస్తే వాళ్ళు కూడా ఆర్టీసీలోకి వస్తారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్నీ కూలంకషంగా చర్చించి, ఒక నివేదిక సమర్పించడానికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

 

ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలని, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని కఠిన చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ అన్నారు. ఏడాదికి రూ.1200 కోట్ల నష్టంతో, రూ. 5వేల కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు దిగడం తీవ్రమైన తప్పు అని కేసీఆర్ అన్నారు. ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. యూనియన్ల బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.

 

ఉద్యోగుల తొలగింపు నిర్ణయం దుమారం రేపుతోంది. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం కరెక్టే అని కొందరు అంటుంటే.. ఇది తప్పు అని మరికొందరు అంటున్నారు. సీఎం కేసీఆర్..నియంతను తలపిస్తున్నారని, రాజ్యాధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. దసరా, బతుకమ్మ పండుగల వేళ ప్రజలని నానా ఇబ్బడులకి గురి చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగడం ముమ్మాటికీ తప్పు అనే వాళ్లూ లేకపోలేదు. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకి దేశంలోనే అత్యధిక జీతభత్యాలు ఆర్టీసీ చెల్లిస్తోందని గుర్తు చేస్తున్నారు. ప్రైవేట్ నుండి పోటీ ఉండడం వల్ల, నష్టాలు వస్తే సంస్థ మనుగడకే ముప్పు వస్తుందనే భయంతో ఇప్పుడు చాలామంది సిబ్బంది ప్రయాణీకులతో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. ఒక్కసారి ప్రభుత్వంలో విలీనం అయితే కండక్టర్ కూడా కలెక్టర్ గా ఫోజు కొట్టే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఏమాత్రం జవాబుదారీ ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులకి ప్రైవేట్ వాహనాలే దిక్కు అవుతాయని భయపడుతున్నారు. కాబట్టి టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని మేధావులు గట్టిగా చెబుతున్నారు. విలీనం డిమాండ్ తప్పించి మిగతా వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కాబట్టి వెంటనే సమ్మె విరమించి కార్మికులు విధుల్లో చేరాలని సూచించారు. లేదంటే ఉద్యోగాల నుంచి తొలగించడమే ఉత్తమ మార్గం అని అభిప్రాయపడుతున్నారు.

 

అయితే…ఇలా మూకుమ్మడిగా ఉద్యోగాలు తొలగిస్తే అది చెల్లుతుందా లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అలా కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం సరికాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రకారం అది చట్టబద్ధమే అనే వాళ్లూ ఉన్నారు. కానీ, 2003లో సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది టీచర్లను అప్పటి సీఎం జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు… ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు నిర్దేశించింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి.

 

ఇకపోతే.. ఏపీ అప్పుల రాష్ట్రం అయినా.. సీఎం జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.. మరి..ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణ ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది, ఎందుకు విలీనం చెయ్యలేకపోతున్నారు అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలు కూడా కాస్త తక్కువగానే ఉన్నాయని, అయినప్పటికీ నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడానికి చర్యలు తీసుకోకుండా, సీఎం కేసీఆర్ ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పడుతున్నారు. పక్క రాష్ట్రం ఏపీతో పోల్చి చూస్తే అన్ని విషయాలలోనూ మెరుగ్గానే ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల చిన్న చూపు చూడడం సమంజసం కాదని ఆర్టీసీ కార్మిక వర్గాలు అంటున్నాయి. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు.

Tags : cm kcrlose jobsmergingrtc employeesTSRTC strike

Also read

Use Facebook to Comment on this PostMenu