04/24/19 7:39 PM

16మంది విద్యార్థులు చనిపోయినా చీమ కుట్టినట్టు కూడా లేదా?

Telangana Intermediate Results Controversy

తెలంగాణలో కొన్ని రోజులుగా ఒకటే ఇష్యూ. రాష్ట్రం మొత్తాన్ని కుదిపేస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.  న్యాయం కోసం ఆందోళన బాట పట్టారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న 16మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 3 లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ గందరగోళంగా తయారైంది. 4 రోజులుగా రాష్ట్రం మొత్తం ఆందోళనలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా దేశంలోనే బెస్ట్ సీఎంగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయన ఏమీ పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారని విపక్షాలు, జనాలు మండిపడుతున్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన పొరపాట్లు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. పాస్ కావాల్సిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు, జిల్లా టాపర్లకు సున్నా మార్కులు వచ్చాయి, ఒక సబ్జెక్ట్ కి పరీక్ష రాస్తే మరో సబ్జెక్ట్ కి ఫలితాలు ఇచ్చారు. 21వేల మంది విద్యార్థులు జవాబు పత్రాలు మిస్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటర్ బోర్డు అధికారుల లీలలకు అంతే లేదు. తప్పుల తడకలుగా మార్కులను ప్రకటించిన విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన ఇంటర్ బోర్డు అధికారులపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. అస్సలు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

 

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు.. ప్రభుత్వం.. అనేది స్పష్టంగా తెలుస్తోంది. పేపర్లు దిద్దిన వాళ్లో, మార్కులని కూడిన వాళ్లో, ఆ మార్కులని కంప్యూటరైజ్ చేసిన వాళ్లో దారుణమైన పొరపాట్లు చేయడం వల్ల 3లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడింది. దీన్ని చక్కదిద్దే చర్యలు తీసుకోవడంలో అటు ఇంటర్ బోర్డు, ఇటు ప్రభుత్వం ఇద్దరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యాము (ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ చేశారో తెలియదు)అనే మనస్తాపంతో 16మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం. నిజంగా తప్పు ఎవరిది? ఫెయిల్ అయింది ఎవరు? అనేది పరీక్షిస్తే.. ఇటు ఇంటర్ బోర్డు అధికారులది.. అటు ప్రభుత్వానిది తప్పు అని తెలుస్తుంది.

 

తెలంగాణ ఇంటర్ ఫలితాలను హడావుడిగా ప్రకటించారు. రాత్రికి రాత్రి పేపర్లను దిద్దేశారు. ఉదయాన్నే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. పేపర్ల వాల్యుయేషేన్ దగ్గర నుంచి ఫలితాల వెల్లడి వరకు అన్నీ బ్లండర్ మిస్టేక్స్. ప్రభుత్వం కూడా తమకేమీ పట్టన్నట్టుగా వ్యవహరించింది. ఇంటర్ బోర్డులో ఇంత రచ్చ జరుగుతున్నా పాలకవర్గాలు స్పందించకపోవడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. చివరికి హైకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై కోర్టు తీవ్రంగా మండిపడింది. సాకులు చెప్పకుండా న్యాయం జరిగేలా చూడాలని అక్షింతలు వేసింది.

 

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోనే బెస్ట్ సీఎం అని టీఆర్ఎస్ నేతలు చెబుతారు. మరి అలాంటి ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంత ఘోరం జరిగినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారు? పొరపాటున కూడా నోరు విప్పలేదు. న్యాయం చేస్తామని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హామీ ఇవ్వేలేదు. ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చెయ్యలేదు. నేనున్నా అనే భరోసా ఇవ్వలేదు. తప్పుచేసిన వారి తాట తీస్తామని వార్నింగ్ ఇవ్వలేదు. కేసీఆర్ గారికి ఏమైంది? ఎందుకింత ఉదాసీనత? అనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 18న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది మొత్తం 9.5 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరవగా.. 3 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. రిజల్ట్స్ విడుదలైన రోజు నుంచి రచ్చ రచ్చ జరుగుతోంది.

 

తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా సుపరిపాలన అందించే దిశగా కృషి చేస్తానని కేసీఆర్ పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారని విపక్షాలు మండిపడ్డాయి. ఇదేనా సుపరిపాలన? ఇదేనా బంగారు తెలంగాణ? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలోని సమస్యనే చక్కదిద్దిలేని వ్యక్తి.. ఇక దేశంలోని సమస్యలను ఏం పరిష్కరిస్తారని విమర్శలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముందు.. తెలంగాణ పిల్లల బాగోగుల గురించి పట్టించుకోవాలని, ఆ తర్వాత దేశ వ్యవహారాల జోలికి వెళ్లాలని విపక్ష నేతలు హితవు పలుకుతున్నారు. ఇంత జరిగినా ఇంటర్ బోర్డు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? సమస్య పరిష్కారానికి ఎందుకు చొరవ చూపలేదు? అని కేసీఆర్ సార్ ని నిలదీస్తున్నారు.

Tags : failKCRmistakepassstudentstelangana intermediate resultstrs

Also read

Use Facebook to Comment on this Post



Menu