09/9/19 9:36 PM

టీఆర్ఎస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

Trs Senior Leader Fires On KCR

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ తర్వాత టీఆర్‌ఎస్ లో విభేదాలు బయటపడుతున్నాయి. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడంతో టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ కార్పొరేషన్ పదవి అక్కర్లేదన్నారు.

 

తనకు కార్పొరేషన్ ఛైర్మన్‌గా త్వరలో పదవి ఇవ్వబోతున్నారనే వార్తలపై నాయిని స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే ‘ముఠా గోపాల్ ను గెలిపించుకురా.. మంత్రిని చేస్తా’ అని కేసీఆర్ హామీ ఇచ్చారని నాయిని చెప్పారు. ఆ సమయంలో తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికైనా టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కానీ, అవేమీ జరగలేదని వాపోయారు. తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్ అది కూడా ఇవ్వలేదన్నారు.

 

‘నాకు ఏ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వద్దు. రాష్ట్ర హోంమంత్రిగా పని చేసిన నేను అలాంటి పదవులు ఎలా తీసుకుంటాను’ అని నాయిని అన్నారు. ‘టీఆర్ఎస్ పార్టీలో నేను కూడా ఓనర్‌నే. కేసీఆర్ మా ఇంటికి పెద్ద. కిరాయిదార్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదు’ అంటూ నాయిని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పార్టీ సీనియర్ నేత నాయినికి హోంమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు గులాబీ దళపతి. రెండోసారి అధికారంలోకి వచ్చాక నాయినిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కేబినెట్ విస్తరణలోనూ చోటు దక్కకపోవడంతో ఆయనలో అసంతృప్తి పెరిగింది. ప్రస్తుతం నాయిని ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై అటు మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా తనకు కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించిన నాయిని నర్సింహారెడ్డి… మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

నాయిని వ్యాఖ్యలు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇన్నాళ్లు కేసీఆర్ కి వ్యతిరేకంగా ఎవరూ గళం వినిపించిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు ఓపెన్ గా ఫైర్ అవుతున్నారు. అందున్నా.. కేసీఆర్ కి సన్నిహితులు, పార్టీలో సీనియర్లు, కీలక వ్యక్తులే ఇలాంటి కామెంట్స్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

Tags : cabinetexpansionharish raoktrnaini narasimha reddytelangana cm kcrtrs

Also read

Use Facebook to Comment on this Post



Menu