12/3/18 10:32 PM

కాబోయే ముఖ్యమంత్రి నేనే : కేసీఆర్

TRS Will Win Again

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ప్రజలు మరోసారి టీఆర్ఎస్‌కే పట్టం కడతారా? ప్రజాకూటమికి ఓ ఛాన్స్ ఇచ్చి చూస్తారా? వీటికి జవాబులు తెలియాలంటే డిసెంబర్ 11వరకు ఆగాల్సిందే. ఆ ఫలితాల విషయం పక్కన పెడితే.. ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరో అప్పుడే తెలిసిపోయింది అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని గులాబీ బాస్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ మనకే అనుకూలంగా వచ్చాయని… టీఆర్ఎస్ గెలుస్తుందని 12 జాతీయ స్థాయి సర్వేలు చెప్పాయని అన్నారు. మధిరలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలని చెప్పారు.

 

ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే దేశం మనదని కేసీఆర్ అన్నారు. తాను రాహుల్ గాంధీ ఏజెంట్‌నని మోదీ అన్నారని.. తాను ఎవరికీ ఏజెంట్‌ను కాదని… తెలంగాణ ప్రజలకే తాను ఏజెంట్‌నని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్లి హిందీలో బీజేపీ, కాంగ్రెస్ లను చీల్చి చెండాడుతానని కేసీఆర్ అన్నారు.

 

ఇది ఇలా ఉండగా.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని మరో సర్వే చెప్పింది. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) సర్వేలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. టీఆర్ఎస్‌కు 94-104 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ప్రజాకూటమికి 16 నుంచి 21 సీట్లే లభిస్తాయని, ఎంఐఎంకు 7 సీట్లు, బీజేపీకి 1 నుంచి 2 సీట్లు, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించే అవకాశాలున్నట్టు సీపీఎస్ సర్వే అంచనా వేసింది. ఓట్ల వాటా లెక్కల్లోకి వెళ్తే, గతంలో 34 శాతం సాధించిన టీఆర్ఎస్ ఈసారి 49.7 శాతం రాబట్టుకోవచ్చని, ప్రజాకూటమి పార్టీలకు 32.3 శాతం, బీజేపీకి 9.1, మజ్లిస్ 2.4 శాతం ఓట్లు, ఇతరులకు 6.5 శాతం ఓట్లు వస్తాయని అంచనా కట్టింది.తాము శాస్త్రీయంగా సర్వే చేశామని, ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నామని సీసీఎస్ వ్యవస్థాపకుడు వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. నవంబర్ 25 నుంచి 29 తేదీల మధ్య తెలంగాణలోని నియోజకవర్గాల్లో సీపీఎస్ శాంపిల్స్ సేకరించిందని, అభ్యర్థి, పార్టీని లెక్కలోకి తీసుకుని అభిప్రాయ సేకరణ చేశామని వెల్లడించారు. 2009 అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ సర్వేలు నిజమయ్యాయని ఆ సంస్థ పేర్కొంది.

 

కాగా, ఈ సర్వేపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి కేసీఆర్.. మీడియా సంస్థలతో అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.

Tags : Centre for Psephology StudiesCPSKCRprepollssurveystelangana electionstrstrs win

Also read

Use Facebook to Comment on this PostMenu