05/15/19 10:32 PM

సీఎం కేసీఆర్‌పై రవిప్రకాశ్ సంచలన ఆరోపణలు

tv 9 ravi prakash sensational allegations on cm kcr

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. టార్గెట్ చెయ్యడానికి కారణం ఏంటో కూడా చెప్పారు. పోలీసుల నోటీసులకు స్పందించకుండా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో, విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ టీవీ 9లో ఓ కథనాన్ని ప్రసారం చేశానని ఆయన తెలిపారు. ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని… అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

 

తనను టార్గెట్ చేయడం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ, వ్యాపార అజెండా ఉందని రవిప్రకాశ్ అన్నారు. వాస్తవానికి ఆ లైవ్ షోను ప్రసారం చేసే సమయంలో కూడా తాను ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదని, కేవలం వ్యవస్థ వైఫల్యం గురించే ప్రశ్నించానని చెప్పారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తామంతా ప్రశ్నించకుండా… చూసీచూడనట్టు వ్యవహరించాలా? అని రవిప్రకాశ్ మండిపడ్డారు.

 

మరోవైపు రవిప్రకాశ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌‌ను హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత పరిస్తితుల్లో దీన్ని పరిశీలించలేమని, అరెస్ట్ చేస్తారనుకుంటే మళ్లీ రావాలని సూచించింది. కొన్ని రోజులుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న రవిప్రకాశ్ పై ఫోర్జరీ, డేటా చోరీ తదితర ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.

 

సీఆర్ పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు పంపినా, గడువులోగా ఆయన స్పందించక పోవడంతో అరెస్ట్ తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన తరఫున హైకోర్టుకు హాజరైన న్యాయవాది ముందస్తు బెయిల్ ను ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఆయన సంఘంలో పేరున్న వ్యక్తని, బెయిల్ ఇవ్వాలని కోరగా, ధర్మాసనం తిరస్కరించింది. వెంటనే పోలీసుల ఎదుట హాజరు కావాలని సూచించింది.

 

అలంద మీడియా సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, డేటాచోరీ కేసులు నమోదయ్యాయి. తర్వాత ఆయన కనిపించకుండాపోయారు. తమ ముందు హాజరుకావాలని పోలీసులు రెండుసార్లు 160 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్‌పీసీ నోటీసు గడువు బుధవారంతో ముగుస్తుంది. దీంతో ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల ముందు రవిప్రకాశ్ విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన ప్రస్తుతం ఏపీలో ఉన్నారని కొందరు, ముంబైలో ఉన్నారని కొందరు చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడైన సినీనటుడు శివాజీ ఆచూకీ కూడా తెలియడం లేదు. టీవీ9 నిర్వహణను అడ్డుకోడానికి కరవిప్రకాశ్‌ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని అలంద సంస్థ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

 

టీవీ 9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రవిప్రకాశ్ కి వాటాల వివాదం ఉంది. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాశ్‌.. మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అలంద సంస్థ డైరెక్టర్‌ పి.కౌశిక్‌రావు పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు. వాటిపై పోలీసులు రవిప్రకాశ్‌తోపాటు సినీనటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిపై కేసులు నమోదుచేశారు. వీటి విచారణలో పోలీసులు ఇప్పటికే ఈ ముగ్గురికి 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేయగా రవిప్రకాశ్‌, శివాజీ స్పందించలేదు. దీంతో 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ ఇచ్చారు. ఏదైనా కేసులో వాంగ్మూలం అవసరమైతే పోలీసులు నిందితులనే కాకుండా సాక్ష్యులకూ 160 సీఆర్పీసీ నోటీసులిస్తారు. కానీ నిందితుడిగా పరిగణించదగ్గ ఆధారాలున్నాయని నిర్ధారించుకున్నాకే 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ ఇస్తారు. అంటే రవిప్రకాశ్‌ చుట్టూ ఉచ్చు బిగించేందుకు అవసరమైన ఆధారాల్ని పోలీసులు సేకరించి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ నోటీసులకూ రవిప్రకాశ్‌ స్పందించకపోతే అరెస్ట్‌ చేసే అవకాశముంటుంది. శివాజీ విషయంలోనూ ఇదేరీతిలో వ్యవహరించే అవకాశమున్నట్లు సమాచారం. మొత్తంగా రవిప్రకాశ్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది.

Tags : cm kcrinter students suicidesravi prakashTELANGANA GOVERNMENTtrstv-9

Also read

Use Facebook to Comment on this PostMenu