07/5/19 6:14 PM

బడ్జెట్ 2019-20 : తీవ్రంగా నిరాశపరిచిన మోడీ సర్కార్

Union Budget 2019-20.. Petrol, Gold Prices Increase

దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బడ్జెట్ 2019-20 వచ్చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రెండోసారి బంపర్ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు మోడీ ప్రభుత్వం భారీ బహుమానాలే ఇస్తారని దేశ ప్రజలు ఆశించారు. అయితే ప్రజలు ఊహించినట్టు అద్భుతాలు ఏమీ జరగలేదు. తాయిలాలు లేవు, ఊరట లేదు. పెద్దగా ప్రయోజనాలూ లేవు. బడ్జెట్ చాలా సాదాగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ప్రజల ఆశలపై మోడీ సర్కార్ నీళ్లు చల్లింది. వేతన జీవులను తీవ్రంగా నిరాశపరించింది. పైగా దేశ ప్రజలకు గట్టి షాక్ ఇచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. వారిపై పెట్రో బాంబ్ విసిరారు. బంగారం ధరలు పెరిగేలా చేశారు.

 

బంగారం వేసుకోలేము, పెట్రోల్ పోసుకోలేము అని పరిస్థితి కల్పించారు మోడీ గారు. బంపర్ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఈసారి పెద్దగా ప్రజలను పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎలాగూ ఎన్నికలు లేవు కనుక.. ప్రజలతో ఏం పని అనుకున్నారో మరో కారణమో కానీ.. ఈసారి బడ్జెట్ తీవ్రంగా నిరాశపరించింది అని అంతా అంటున్నారు. కాగా, ఒక మహిళ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఇది రెండోసారి. 49 ఏళ్లలో తొలిసారి. 1970లో ఇందిరాగాంధీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న ఆమె ఆర్థిక శాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్నారు.

 

 

సంక్షేమ పథకాలను కాస్త విస్తరించడం, పేర్లు మార్చడం వంటి ధోరణే ఈసారి బడ్జెట్ లో కనిపించింది. అంతకుమించి ప్రత్యేకత ఏమీ లేదు. వివిధ వస్తువుల ధరల జోలికి పోని మోడీ ప్రభుత్వం బంగారం ధరలను బాదేసింది. బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 12.50శాతానికి పెంచింది. దీంతో బంగారం, బంగారం నగల ధరలు పెరగనున్నాయి. బంగారంతోపాటు ప్లాటినం, వెండి వంటి ఖరీదైన లోహాలకూ ఈ పెంపు వర్తిస్తుంది. వీటిపై సుంకాలను తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా పెంచేసింది.

 

 

ఇక కీలకమైన ఇంధన ధరలను కూడా మోడీ సర్కార్ వదల్లేదు. డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.1 చొప్పున పెంచింది. అలాగే లీటర్ పై రోడ్డు సెస్ కింద మరో రూ.1 వడ్డించింది. ఈ లెక్కన డీజిల్ పెట్రోల్ ధరలు రూ. 2 చొప్పున పెరగనున్నాయి. ఇప్పటికే ధరల భారంతో అల్లాడుతున్న వాహనదారులు ఇకపై మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా లీటర్ కి అదనంగా రూపాయి చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇంధనంపై బడ్జెట్ బాదుడు ప్రభావం అప్పుడే కనిపించింది. హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కంపెనీ షేర్ల విలువ 5 నుంచి 6 శాతం పడిపోయాయి.

 

 

వేతన జీవుల ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్య తరగతి ఆదాయ వర్గాల ప్రజలు పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి కనీసం 3 లక్షలకు పెంచుతారాని ఆశలు పెట్టుకున్నారు. కానీ మరోసారి మొండిచేయే చూపించింది కేంద్రం…ఐదేళ్ల కిందట 2014-15లో వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపును 2 లక్షల నుంచి రెండున్నర లక్షలకు పెంచారు. అప్పటి నుంచి వేతనజీవులను ఊరిస్తూ వస్తున్న కేంద్రం మళ్లీ నిరాశే మిగిల్చింది. అయితే వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారు ఎలాంటి ఆదాయ పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. అలా అల్ప, మధ్య ఆదాయ వర్గాల వారికి కాస్త ఊరటనిచ్చారు. మొత్తంగా మోడీ గారు మాయ చేసి మోసం చేశారనే విమర్శలు వస్తున్నాయి.

Tags : dieselgoldmodinirmala sitharamanpetrolUnion Budget

Also read

Use Facebook to Comment on this PostMenu