05/1/19 1:18 PM

ఏపీలో కలకలం రేపుతున్న విజయసాయి రెడ్డి లేఖ

Vijayasai Reddy Sensatioanal Allegations On TDP

ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత విజయసాయి రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ సంచలనంగా మారింది. రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ఏపీలో కౌంటింగ్ రోజున అంటే మే 23వ తేదీన అల్లర్లు జరిగే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు.. టీడీపీ వాళ్లు పథకం ప్రకారం అల్లర్లకు పాల్పడతారని ఆరోపించారు. కాబట్టి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీకి చెందిన కౌంటింగ్‌ ఏజెంట్లు ఫోర్జరీ చేసిన 17–సి ఫామ్‌లు తెచ్చి, అక్కడి కౌంటింగ్‌ సూపర్‌వైజర్లతో చీటికీమాటికీ వాదనలకు దిగి లెక్కింపు ప్రక్రియను ఆలస్యమయ్యేలా చేసేందుకు ప్రయత్నం చేయొచ్చని విజయసాయి రెడ్డి అన్నారు. కాబట్టి 17-సి ఫోర్జరీ ఫామ్‌లను తెచ్చే ఏజెంట్లపై క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని ఎన్నికల కమిషన్‌ ప్రకటించాలన్నారు.

 

ఎన్నికల పరిశీలకులందరినీ వీలైనంత వరకూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే ఉండేలా చేయడమే కాకుండా.. ఇలాంటి వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు. వైసీపీ అభ్యర్థుల తరఫున కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండేవారిలో గందరగోళం, అయోమయం సృష్టించేందుకు వారిని స్క్రీనింగ్‌ చేయడం, అనుమతి ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయాలని చూస్తున్నారని చెప్పారు. తమ పార్టీ తరఫున నియమితులయ్యే ఏజెంట్లలో కొందరి నియామకాన్ని కావాలనే తిరస్కరించి, వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వ్యవధిని కూడా ఇవ్వకపోవచ్చన్నారు. చివరి క్షణంలో వచ్చే చిక్కులను అధిగమించడానికి ఏజెంట్ల అనుమతి ప్రక్రియను వేగవంతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఈసీని విజయసాయి రెడ్డి కోరారు.

 

కౌంటింగ్‌ ఏజెంట్లందరినీ క్షుణ్నంగా తనిఖీ చేయడంతోపాటు వారు సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, కత్తులు, కత్తెరలు, నీళ్ల బాటిళ్లు వంటివి తీసుకురాకుండా నిరోధించాలని ఈసీని కోరారు. లెక్కింపు కేంద్రాల దగ్గర శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా 144 సెక్షన్‌ను విధించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర విధులు నిర్వహించే రాష్ట్ర పోలీసు అధికారులు అధికార పార్టీ నుంచి వచ్చే ఒత్తిళ్లతో వారి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని.. వీలైనంత మేరకు కేంద్ర భద్రతా బలగాలను ఆయా కేంద్రాల వద్ద నియమించాలని ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి విన్నవించారు.

 

ఏపీలో కౌంటింగ్ రోజున టీడీపీ వాళ్లు అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఈసీకి విజయసాయి రెడ్డి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. అల్లర్లు చేయబోయేది వైసీపీ వాళ్లే అని, దాన్ని తమపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎదురుదాడికి దిగారు. అల్లర్లు, దాడులు, హత్యల సంస్కృతి టీడీపీది కాదన్నారు. విజయసాయి రెడ్డి తీరు చూస్తుంటే.. కౌంటింగ్ రోజున జగన్ పార్టీ వాళ్లు ఏదో పథకం రచించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టీడీపీ నాయకులు అంటున్నారు.

Tags : andhra pradeshchandrababucountingelection commissionresults dayTDPvijayasai reddyVIOLENCEYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this PostMenu