05/6/19 6:51 PM

పోలింగ్ తర్వాతి రోజు నుంచి కనిపించని రోజా : వైసీపీ ఫైర్ బ్రాండ్‌కి ఏమైంది?

Where is Roja, Why She Become Silent

ఆమె ఫైర్ బ్రాండ్. మాటలు తూటాల్లా పేలుస్తారు. మాటలతో మంటలు పుట్టిస్తారు. ప్రత్యర్థిన్ని ఉతికారేయడంలో దిట్ట. జగన్ ను ఒక్క మాట అన్నా ఊరుకోరు. జగన్ పై ఈగ కూడా వాలనివ్వరు. టీడీపీని, సీఎం చంద్రబాబుని ఏకిపారేయడంలో ముందుంటారు. ఆమే వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఏపీ రాజకీయాల్లో చెప్పుకోదగిన ప్రముఖుల్లో కచ్చితంగా రోజా ఒకరు. ఈ ఎన్నికల్లో జనాలు, పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి రోజా పోటీ బరిలో ఉన్నారు కనుక.

 

ఏపీ రాజకీయాల్లో మరోసారి రోజా హాట్ టాపిక్ అయ్యారు. రోజా గురించి అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. దీనికి కారణం రోజా వైఖరే. అవును.. ఏపీలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. ఆ తర్వాతి రోజు నుంచి రోజా నగరిలో కనిపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రోజాకి ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు మీడియా ముందుకి రావడం లేదు? కనీసం పార్టీ శ్రేణులతో కూడా ఎందుకు టచ్ లో లేరు? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి.

 

పోలింగ్ కు ముందు అన్ని పార్టీల నేతలు తెగ శ్రమించారు. నెలల పాటు అలుపెరగకుండా తిరిగారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడ్డారు. ప్రచారంలో బిజీగా గడిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అంతా రిలాక్స్ అయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి విహార యాత్రలకు వెళ్లిపోయారు. కొందరు పర్యాటక క్షేత్రాలకు, విదేశాలకు వెళ్లిపోయారు.

 

రోజా సైతం అదే దారిలో నడిచారని చెప్పుకుంటున్నారు. పోలింగ్ రోజున సాయంత్రం 4 గంటల తర్వాత ఇంటికి చేరుకున్న ఆమె, ఆ మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలో కనిపించలేదు. పోలింగ్ మరుసటి రోజు తన కుటుంబంతో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి వెళ్లిన ఆమె, అక్కడి నుంచి విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రోజా ఇంతవరకు నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదని చెబుతున్నారు.

 

2014 ఎన్నికల్లో టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుపై రోజా గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా నగరి నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలుస్తానన్న ధీమా రోజాకి ఉందని పార్టీ నేతలు. నియోజకవర్గ నాయకులు చెబుతున్నారు. మరోవైపుట టీడీపీ మాత్రం నగిరిలో రోజాను ఎలా అయినా ఓడించేందుకు వ్యూహాలు రచించింది. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన రోజాకు ఈసారి ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు చంద్రబాబు పక్కా ప్లాన్ వేసినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓటమి పాలైన దివంగత మాజీ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భాను ప్రకాష్‌ను ఈసారి ఎన్నికల బరిలోకి దింపింది.

 

రోజా కనిపించడం లేదు అంటూ ఎందుకు అనవసరంగా ప్రచారం చేస్తారని ఆమె మద్దతుదారులు మండిపడుతున్నారు. రోజా కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతున్నారని చెబుతున్నారు. అంతమాత్రానికే.. రోజా కనిపించడం లేదు అనే ప్రచారం చెయ్యడం కరెక్ట్ కాదని అంటున్నారు. అదే సమయంలో.. కనీసం పోలింగ్ సరళిపై కూడా రోజా వాకబు చేయలేదని తెలుస్తోంది. కార్యకర్తలు, అనుచరులతో ఆమె ఎలాంటి చర్చలు జరపకుండానే నగరి నుంచి వెళ్లిపోయారనే టాక్ వినిపిస్తోంది. రోజాకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆమె నియోజకవర్గంలో కనిపించడం లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. అంతేకాదు..ఈసారి వైసీపీ ఓటమి ఖాయం అని రోజాకి తెలిసిపోయిందని అందుకే సైలెంట్ అయ్యారని మరికొందరు అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా, రోజా గెలిచినా… జగన్.. ఆమెకి మంత్రి పదవి ఇవ్వరు అనే విషయం రోజాకి తెలిసిందని అందుకే ఆమె అసంతృప్తిగా ఉందని, నియోజకవర్గంలో కనిపించడం లేదనే టాక్ కూడా లేకపోలేదు. మొత్తంగా కారణం ఏదైనా.. ఎన్నికల ముందు వరకు పాలిటిక్స్ లో యాక్టివ్ గా కనిపించిన రోజా.. సడెన్ గా సైలెంట్ అవడం హాట్ టాపిక్ గా మారింది.

Tags : ap electionschandrababu naidumla rojanagarisilentTDPYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this PostMenu