07/16/19 11:46 AM

మళ్లీ అదే ముచ్చట : ఆ ఘనత వైఎస్‌దా? చంద్రబాబుదా?

Who Brought Kia To AP

కియా మోటార్స్.. సౌత్ కొరియాకి చెందిన అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ. మన భారత దేశంలో అందులోనూ ఏపీలో కియా మోటార్స్ తన తొలి ప్లాంట్ ని నెలకొల్పింది. కరువు జిల్లా అనంతపురంలోని పెనుకొండలో కియా మోటార్స్ ప్లాంట్ ని స్థాపించారు. కరువు సీమలో ఉపాధి కోసం, నాలుగు మెతుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కియా మోటార్స్ ఓ వరం. వేలాది మందికి ఉపాధి అవకాశం లభించింది. కియో మోటార్స్ రాకతో కొంతలో కొంతైనా మేలు జరిగింది.

 

ఇకపోతే.. కియా మోటార్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కియా గురించి పెద్ద గొడవే జరుగుతోంది. కియా తీసుకొచ్చిన క్రెడిట్ కోసం అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు పోటీలు పడుతున్నారు. కియా తీసుకొచ్చిన ఘనత మాదే అంటే కాదు మాదే అని పోట్లాడుకుంటున్నారు. దీంతో అసలు ఏపీకి కియా తీసుకొచ్చింది ఎవరు? అనే చర్చ మళ్లీ మొదలైంది.

 

కియా మోటార్స్ ఏపీకి రావడానికి కారణం చంద్రబాబు కాదు వైఎస్ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అంటే.. 2007లోనే.. కియా మోటార్స్ ఏపీలో ప్లాంట్ నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంతేకాదు.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కియా సీఈవో… ఏపీ సీఎం జగన్ కి ఓ లేఖ కూడా రాశారని చెప్పారు. ఆ లేఖను ఆయన సభలో చదివి వినిపించారు. వైఎస్ వల్ల కియా వస్తే.. చంద్రబాబు వల్ల వచ్చిందని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

 

వైసీపీ నేతల వ్యాఖ్యలు విని టీడీపీ నేతలు ఊరుకోలేదు. వెంటనే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వల్లే కియా ఏపీకి వచ్చిందన్నారు. చంద్రబాబు జరిపిన చర్చలు ఫలించి.. ఏపీలో కియా ప్లాంట్ పెట్టడానికి ఆ సంస్థ వారు అంగీకరించారని చెప్పారు. కియా ఏపీకి రావడానికి ముమ్మాటికి చంద్రబాబు కారణం అన్నారు. కియాని ఏపీకి తీసుకొచ్చింది వైఎస్ అని వైసీపీ నేతలు చెప్పుకోవడం దారుణం అని టీడీపీ నేతలు విమర్శించారు.

 

ఇక కియా సీఈవో ఏపీ సీఎం జగన్ కి రాసిన లేఖ విషయంపైనా టీడీపీ నేతలు స్పందించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి కొత్త సీఎం వచ్చినప్పుడు.. గౌరవప్రదంగా.. కంపెనీల సీఈవోలు లేఖలు రాయడం సర్వసాధారణం అన్నారు. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేసినట్టే.. చంద్రబాబే నిర్మించారనే అనుమానంతో కియాని కూడా కూల్చేస్తారేమో అని భయపడి ఉంటారని, అందుకే జగన్ ని కీర్తిస్తూ లేఖ రాసి ఉంటారని టీడీపీ నేతలు సెటైర్లు వేశారు. కియా ఎవరి వల్ల వచ్చినా.. మంచే జరిగిందని, వేలాది మందికి ఉపాధి లభించిందని.. దాన్ని ప్రశంసించడం మాని.. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని టీడీపీ నేతలు.. వైసీపీకి హితవు పలికారు.

 

మొత్తంగా కియా గొడవ మళ్లీ మొదటికి వచ్చింది. కియా సంస్థ ప్రారంభోత్సవం సమయంలోనూ ఇలాంటి వివాదమే నడిచింది. అప్పుడు బీజేపీ నేతలు కూడా హడావుడి చేశారు. కియా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది కాదు.. ప్రధాని నరేంద్ర మోడీది అని కమలం పార్టీ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు కాదు వైఎస్ అని వైసీపీ నేతలు అంటున్నారు.

Tags : anantapuramchandrababukia motorspenukondaTDPys jaganys rajasekhara reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu