05/20/19 9:14 PM

ఏపీలో ఎగ్జిట్ ఎవరికి? వీడని సస్పెన్స్

Who Is AP CM, Exit Polls Remain Confuse

ఏపీలో గెలుపు ఎవరిది? కాబోయే సీఎం ఎవరు? టీడీపీ మరోసారి అధికారం చేజిక్కించుకుంటుందా? వైసీపీ సత్తా చాటుతుందా? ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా ఈ సస్పెన్స్ కి తెరపడలేదు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాజకీయ నాయకులు, ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. అయినా ఏపీలో గెలుపెవరిది అన్నదానిపై క్లారిటీ లేదు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జగన్ గెలుస్తాడని చెప్పినా.. టీడీపీ కూడా విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు అంటున్నాయి. దీంతో ఏపీలో గెలుపు ఎవరిది అన్న సస్పెన్స్‌కు తెరపడలేదు. దీంతో ఇరు వర్గాల్లోనూ గెలుపుపై ధీమా పెరిగినప్పటికీ.. అసలు ఎవరి సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలన్నది ఇప్పుడు వారికే అంతుచిక్కడం లేదు.

 

ఆంధ్రా ఆక్టోపస్‌, సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ మాత్రమే ఏపీలో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అంటున్నారు. ఆయన సర్వేలో టీడీపీకి 90 నుంచి 110, వైసీపీకి 65 నుంచి 79, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు వస్తాయని తేల్చారు. అలాగే లోక్‌సభ స్థానాల విషయానికొస్తే.. టీడీపీకి 15, వైసీపీకి 10 వరకు రావచ్చని అంచనా వేశారు. అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల శాతం వివరాలు చూస్తే టీడీపీకి 43-45%, వైసీపీకి 40-42%, జనసేనకి 10-12శాతంగా అంచనా వేశారు. పార్లమెంట్ స్థానాల్లో పార్టీలకు లభించే ఓట్ల శాతం చూస్తే.. టీడీపీకి 43-45%, వైసీపీకి 40.5 % – 42.5 %, జనసేనకి 10-12శాతంగా లెక్కకట్టారు.

 

ఇండియా టుడే సర్వే మాత్రం ఏపీలో వైసీపీదే అధికారం అని అంచనా వేసింది. వైసీపీ 130 నుంచి 135 స్థానాలతో భారీ మెజారిటీ అందుకోబోతుందని.. టీడీపీ మాత్రం 37 నుంచి 40 స్థానాలకు మించి గెలవలేదని లెక్క కట్టింది. లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 4 నుంచి 6, వైసీపీ 18 నుంచి 20 గెలవచ్చని అంచనా వేసింది. ఇక సీపీఎస్ సర్వే (అసెంబ్లీ) టీడీపీ 43 నుంచి 44, వైసీపీ 130 నుంచి 133 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. ఇలా దాదాపు అన్ని జాతీయ సర్వేలు జగన్ పార్టీకే పట్టం కట్టాయి.

 

ఏపీలో ఈసారి వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే చెబుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 112 సీట్లలో వైసీపీ విజయం సాధించవచ్చని, అధికార టీడీపీ 59 స్థానాలతో సరిపెట్టుకుంటుందని ఆ సర్వే తెలిపింది. జనసేన పార్టీ 4 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టు లెక్క కట్టింది. లోక్ సభ స్థానాల విషయానికొస్తే వైసీపీకి 18 నుంచి 21 స్థానాలు, టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు లభిస్తాయని తెలిపింది. మరో సర్వే సంస్థ ‘ఐ పల్స్’ అంచనా ప్రకారం..వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు, టీడీపీకి 56-62, జనసేన పార్టీ 0-3 స్థానాలు లభించే అవకాశం ఉంది. ‘ఆరా’ సర్వేలో వైసీపీకి 126 స్థానాలు, టీడీపీకి 47 స్థానాలు, జనసేన పార్టీకి 0-2 స్థానాలు లభిస్తాయని తెలిపింది. ‘న్యూస్ ఎక్స్’, ‘టైమ్స్ నౌ’ సర్వేల్లో సైతం వైసీపీకి అత్యధిక లోక్ సభ స్థానాలు లభిస్తాయని తేలింది. ‘టుడేస్ చాణక్య’ సర్వే సంస్థ మాత్రం టీడీపీకి ఎక్కువ స్థానాలు లభిస్తాయని పేర్కొంది.

 

‘న్యూస్ ఎక్స్’ : వైసీపీ- 20, టీడీపీ- 5 స్థానాలు
‘టైమ్స్ నౌ’ : వైసీపీ- 18, టీడీపీ- 7
‘టుడేస్ చాణక్య’ : టీడీపీ-14 నుంచి 20, వైసీపీ- 5 నుంచి 11 స్థానాలు

 

కొన్ని సర్వేలు మాత్రం టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో ఎవరి సర్వేను నమ్మాలో తెలియక జనాలే కాదు నాయకులు సైతం తలలు పట్టుకున్నారు. ఎవరి సర్వే నిజం అనేది తెలియాలంటే.. ఈ నెల 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

Tags : ap cm chandrababuexit pollsLagadapati rajagopalsurveyys jagan mohanreddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu