Ad

03/15/18 12:40 PM

పవన్ వెనక ఉన్నది ఎవరంటే?

PAWAN KALYAN

నాలుగేళ్ల తర్వాత సడెన్ గా రూటు మార్చిన పవన్, తెదేపా పై విరుచుకు పడటానికి కారణం ఏంటి? పవన్ వ్యూహం ఏంటి? ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ప్రకటిస్తాడు అనుకుంటే, తెదేపా తో తెగతెంపులకి ఎందుకు సిద్ధపడ్డారు? అసలు పవన్ వెనుక ఎవరున్నారు? ఇదే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఇంతకీ, పవన్ వెనక ఎవరున్నారంటే..

బిజెపి ఉందా?

పవన్ తన ప్రసంగంలో ఎక్కడా మోది పేరు ప్రస్తావించలేదు. పైగా మన బంగారం మంచిది కాకపోవడం (చంద్రబాబు) వల్లే మోది అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అని మోది కి సమర్థనగా మాట్లాడారు. కాబట్టి, ఒకపక్క జగన్ ని మరోపక్క పవన్ ని బిజెపి చంద్రబాబు పైకి ఉసి గొలుపుతోంది అన్నది తెదేపా శ్రేణుల వాదన. ఇదే నిజమైతే పవన్ లెఫ్ట్ పార్టీలతో కలిసేవారు కాదు కదా. ఒంటరిగా పోరాటం చేస్తాను అని ప్రకటించేవారు. లెఫ్ట్ పార్టీలతో కలుపుకుని ఉద్యమం చేస్తానని చెప్పిన పవన్ ప్రకటించారు కాబట్టి పవన్ వెనుక బిజెపి ఉందని అనుకోలేం.

చంద్రబాబే ఉన్నారా?

తెదేపా తొత్తు అని పవన్ పై ఉన్న ముద్ర పోతే గాని, జనసేనకి ఓట్లు రావు. నిన్నటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైకాపాకి మాత్రమే వెళ్ళే అవకాశం ఉండేది. తెదేపా ని ఘాటుగా విమర్శించడం ద్వారా జనసేన కూడా కొన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తెచ్చుకుంటే ఆమేరకు వైకాపా కు మైనస్ అవుతుంది. ముక్కోణపు పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే తెదేపా ఈజీగా గెలవచ్చు అనే కోణంలో చంద్రబాబే పవన్ ని తనకి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పారని వైకాపా శ్రేణుల అభిప్రాయం. మిత్రుడిగా  ఉన్న వ్యక్తి ఇంత తీవ్ర విమర్శలు చేస్తే జనం నిజమని నమ్మే అవకాశం ఉంది. అది తెదేపా కి నష్టం. కాబట్టి చంద్రబాబు ఇలాంటి రిస్క్ తీసుకుంటారని అనుకోలేం.

వైకాపా ఉందా?

“పవన్ తో పొత్తు పెట్టుకుంటే మనం గెలవడం పక్కా” అని ప్రశాంత్ కిషోర్ జగన్ కి పదే పదే చెబుతున్నారట. పవన్ ని కలిసేందుకు కూడా ప్రశాంత్ కిషోర్  ప్రయత్నాలు చేసారట. పవన్ ని  ప్రశాంత్ కిషోర్ కలిసారా? కలిసాకే పవన్ రూటు మార్చారా అనే అనుమానాలు ఉన్నాయి.  ఈ సభకి మూడు రోజుల ముందు కత్తి మహేష్ కూడా, ప్రత్యేక హోదా కోసం  వైకాపా జనసేన కలిసి పోరాడతాయి చూడండి అని ట్వీట్ చేసారు. కాబట్టి పవన్ స్పీచ్ వెనుక ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందా అనే అనుమానాలు  కొట్టి పారేయలేం.  అయితే పవన్ అంట తేలికగా జగన్ ట్రాప్ లో పడతారా?

పవన్ సొంత ఆలోచనేనా?

రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పవన్ కి అసంతృప్తి ఉన్న మాట నిజం. తెదేపా పాలనలో అవినీతి జరుగుతోంది అని పవన్ గతంలో కూడా చూచాయగా ప్రస్తావించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ మెత్తగా ఉంటే లాభం లేదని, తాడో పేడో తేల్చుకుందామని పవన్ నిర్ణయించుకుని ఉండొచ్చు. పార్టీ ఎదగాలన్నా, ఎన్నికల్లో ప్రభావం చూపాలన్నా తెదేపా ని విమర్శించక తప్పదు కాబట్టే పవన్ నిన్న రూటు మార్చి ఉండొచ్చు.

 

మొత్తంగా చూస్తే, నిన్న పవన్ స్పీచ్ తన సొంత వ్యూహంలో భాగమే అని అనుకోవచ్చు.  పవన్ ఇదే ట్రాక్ పై ఎన్నాళ్ళు ఉంటారు, పార్టీ కోసం ఎంత సమయం కేటాయిస్తారు అనే దానిపై ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది ఆధారపడిఉంటుంది.

 

Tags : PAWAN ATTACKS TDPWHO IS BEHIND PAWAN KALYAN ? JANASENA

Use Facebook to Comment on this PostMenu