10/12/19 11:49 AM

బాబుగారూ.. పోతూ..పోతూ రాష్ట్రాన్ని ముంచేశారా..?

Who Is Responsible For AP Debts

ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక అన్నీ వివాదాలే. అదీ ఇదీ అని కాదు.. అన్నీ గొడవలే. రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. ఇప్పుడు తాజాగా ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది. ఏకంగా 3 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. రూ.42వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడీ టాపిక్ వైసీపీ, టీడీపీ మధ్య వివాదానికి దారితీసింది. ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారడానికి జగనే కారణం అని టీడీపీ నేతలు అంటుంటే.. వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీని ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచిందని, అప్పుల్లో ముంచెత్తిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రూ.42వేల కోట్ల అప్పులను తమ ప్రభుత్వానికి అప్పగించిందని చెబుతున్నారు.

 

వివరాల్లోకి వెళితే.. ఏపీ ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించి కొత్త ప్రభుత్వానికి వేల కోట్ల రుపాయల అప్పులు మిగిల్చిపోయారని ఆయన విమర్శించారు.

 

ఏపీలో నెలకోన్న ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ చేస్తున్న విమర్శల నేపథ్యంలో అధికార పార్టీ స్పందించింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన టీడీపీ విమర్శలను తిప్పికొట్టారు. వేల కోట్ల రూపాయల అప్పులు చేసిన గత ప్రభుత్వం మా గురించి మాట్లాడుతుందా అని మండిపడ్డారు. వేల కోట్ల అప్పులు 3 నెలల్లో తీర్చుతామా అని ప్రశ్నించారు. సాధారణంగా కొత్త ప్రభుత్వానికి 5 నుండి 10వేల కోట్లు మాత్రమే ఇస్తుందని కానీ గత ప్రభుత్వం మాత్రం రూ.42వేల కోట్ల అప్పులను అప్పగించిందని బుగ్గన వాపోయారు.

 

చంద్రబాబు ప్రభుత్వం తమకు సంబంధించిన కాంట్రాక్టర్లకు మాత్రమే వేల కోట్ల రూపాయలు చెల్లించిందని.. ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం చెల్లించలేదని మంత్రి ఆరోపించారు. గతంలో తెచ్చిన అప్పులను ఇతర రంగాలకు బదీలీ చేసి రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆయన విమర్శలు చేశారు. విద్యుత్ రేట్లు తగ్గుతున్నాయని తెలిసినా, ఎక్కువ ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసి, డిస్కంలకు ప్రభుత్వ ధనాన్ని కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. 8మంది కాంట్రాక్టర్లకు వెయ్యి కోట్ల రూపాయలను చెల్లించారని చెప్పారు. ఒక్క రోజే రూ.5వేల కోట్లు అప్పు చేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవా రంగం అభివృద్ది తగ్గి, వ్యవసాయ రంగంపై అధారపడేవారి శాతం పెరిగిందని మంత్రి అన్నారు.

 

మధ్యాహ్న భోజన పథకం, డైట్‌ ఛార్జీలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, స్థానిక సంస్థలు, ఆస్పత్రుల్లో ఔషధాలు.. చివరకు దూది వంటి వాటికి కూడా గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా మొత్తం రూ.42 వేల కోట్లు బకాయి పడిందని మంత్రి బుగ్గన వివరించారు. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా 9 నెలల నుంచి 12 నెలల పాటు వేతనాలు చెల్లించలేదని తెలిపారు. వీటితో పాటు వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న అప్పులను కూడా దారి మళ్లించారని, ఆ విధంగా అన్నీ కలుపుకుంటే గత టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.65 వేల కోట్ల బిల్లులు (చెల్లించాల్సిన మొత్తం) పెండింగ్‌లో పెట్టిందని తెలిపారు. వాస్తవానికి ఏ ప్రభుత్వం అయినా దిగిపోయే ముందు రూ.5 వేల కోట్లకు మించి బిల్లులు పెండింగ్‌లో ఉంచదని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఆ అవకతవకలన్నీ ఒక్కొక్కటిగా సరి చేస్తున్నామని అన్నారు.

 

రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.23 లక్షల కోట్ల అప్పులు ఉండగా, అది రూ.2.58 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. వివిధ శాఖలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం అప్పులు రూ.3.62 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఎన్నికల ముందు హడావిడిగా రూ.38 వేల కోట్ల సప్లిమెంట్‌ గ్రాంట్‌ తీసుకున్న టీడీపీ ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఖర్చు చేసిందన్నారు. అన్నీ ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వస్తున్నామని, వచ్చే డిసెంబర్ నాటికి వీలైనంత వరకు క్లియర్‌ చేస్తామని మంత్రి వివరించారు.

 

టీడీపీ హయాంలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. టీడీపీ పాలనలో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లు అప్పు తేలిందని తెలిపారు. రూ.42 వేల కోట్ల బిల్లులు చెల్లించకుండా వదిలేశారని ఆర్ధిక మంత్రి విమర్శించారు. 2014-19 వరకూ సబ్సీడీతో పాటు ఇతర బకాయిలను రూ.14,857 వేల కోట్లమేర పెండింగ్ పెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ నష్టాలు రూ.14 వేల కోట్లకు పెరిగాయని..విద్యుత్ యూనిట్ రేట్లు తగ్గుతాయని తెలిసినా 25 ఏళ్లకు ఒప్పందాలు చేసుకున్నారన్నారు.

Tags : andhrapradeshbuggna rajendra nath reddychandrababucm jagandebtsTDPysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu