05/16/19 5:09 PM

చంద్రబాబు.. మీడియా మొఘల్‌ని కలవడానికి కారణం అదేనా?

Why CM Chandrababu Meets Ramoji Rao

ఏపీలో ఎన్నికలు ముగిసినా పొలిటికల్ హాట్ మాత్రం అస్సలు తగ్గలేదు. రోజుకో కొత్త అంశం తెరమీదకు వస్తోంది. రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు, మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కలయిక హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు.. రామోజీ రావుని కలిశారా? ఎందుకు కలిశారు? ఏం మాట్లాడారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చంద్రబాబు.. రామోజీ రావుని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? అనేది చర్చకు దారితీసింది.

 

సీఎం చంద్రబాబు రామోజీ రావును కలిసినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం అమరావతి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు.. రామోజీ ఫిలిం సిటీలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం తర్వాత ఆయన రామోజీ రావుతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు.. కీలక టీడీపీ నేతలతో కలిసి రామోజీని కలిశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దీనిపై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు, రామోజీ కలయికపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ సలహా, సాయ కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి రామోజీని కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? అని నిలదీశారు. ‘ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ?’ అని విజయసాయి రెడ్డి విమర్శించారు.

 

చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్‌లో ఎదిగిన తీరు గమనిస్తే రవి ప్రకాష్‌ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారని విజయసాయి విమర్శించారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్‌ మెయిల్‌ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం అంటూ ఘాటు విమర్శలు చేశారు. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోందన్నారు. తను చేయించిన 4 సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని తేలినట్టు చెప్పిన చంద్రబాబు.. ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దనడం వింతగా ఉందన్నారు.

 

చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం కావడంతో పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గవర్నర్ జోక్యం చేసుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మాఫియాను నియత్రించాలని ఆయన కోరారు.

 

చంద్రబాబు, రామోజీ రావు ఏం చర్చించుకున్నారు అనేది ఆరా తీస్తే.. ప్రధానంగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. టీడీపీకి అనుకూలంగా ప్రజల తీర్పు ఉంటే రాష్ట్రం, పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది. అదే వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది..? రాష్ట్రానికి సంబంధించి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. రాజధాని అమరావతికి సంబంధించి జగన్ ఆలోచన ఏంటి? వంటి అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు కాన్ఫిడెంట్‌గా రామోజీరావుకి చెప్పినట్లు తెలిసింది. అయితే… సిటీలు, పట్టణాల్లో టీడీపీకి అనుకూలంగా ఉందనీ, పల్లెల్లో మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉందని రామోజీరావు చెప్పినట్లుగా సమాచారం. క్షేత్రస్థాయిపై టీడీపీ మరింత ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని రామోజీరావు సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వీలైతే, చంద్రబాబు… రామోజీరావును కలవడం చాలా సందర్భాల్లో జరిగిందే. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన తర్వాత అప్పట్లోనే పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చంద్రబాబు, రామోజీరావుతో చర్చించేవారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. పదేళ్లుగా నేరుగా కలిసే సందర్భాలు తగ్గినా… వారిద్దరి మధ్య మంచి రిలేషన్ మాత్రం కంటిన్యూ అవుతోంది.

 

మొత్తంగా.. చంద్రబాబు, రామోజీ కలయిక వార్త ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు.. రామోజీని ఎందుకు కలిశారు? అని అంతా చర్చించుకుంటున్నారు? రాజకీయ కోణం ఏమైనా ఉందా? అని డిస్కస్ చేసుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో వారిద్దరూ కలిశారు అనే వార్త చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు, రామోజీ రావుకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారిద్దరి మధ్య బలమైన రిలేషన్ షిప్ ఉంది. పైగా ఒకే సామాజికవర్గం. గతంలోనూ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చంద్రబాబుకి.. రామోజీ రావు అండగా నిలిచారు. మీడియా పరంగా తన వంతు సాయం చేశారు. మీడియా మేనేజ్ మెంట్ విషయంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అనే విషయం అందరికి తెలిసిందే. ప్రతికూల పరిస్థితులను సైతం అనేకసార్లు మీడియా సాయంతో తనకు అనుకూలంగా మార్చుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే రీతిలో రామోజీ సాయం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది.

Tags : ap electionschandrababuKCRRamoji RaoRfcvijayasai reddyYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this PostMenu