04/15/19 12:55 PM

చంద్రబాబు వర్సెస్ ఈసీ : అసలు నిజం ఏమిటి

Why EC Fearing For Discussion With Hari Prasad On EVMs

ఈవీఎంలు సురక్షితమా కాదా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చా? ఈవీఎంల ద్వారా ఫలితాలను తారుమారు చేయొచ్చా? ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా? ఈవీఎంలో లోపాలు ఉన్నాయా? దేశవ్యాప్తంగా ఇప్పుడివి మిలియన్ డాలర్ల ప్రశ్నలు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు చూస్తూ ఎవరికైనా సందేహాలు కలగకమానవు. ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర పక్షాలను కూడగట్టుకుని ఢిల్లీలో ఆయన పోరాటం చేస్తున్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అని చంద్రబాబు అంటున్నారు. ఒక వేళ ఈవీఎంలను బ్యాన్ చెయ్యలేకపోతే వీవీ ప్యాట్ స్లిప్పులను కచ్చితంగా కౌంట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.

 

దేశంలో 18 రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఎక్కడా ఈవీఎంల సమస్యలు రాలేదు. కనీసం చిన్న కంప్లంట్ కూడా లేదు. కానీ ఏపీలో మాత్రం అన్నీ సమస్యలే. పోలింగ్ మొదలైన క్షణం నుంచి ఈవీఎంల సమస్యలే. ఈవీఎంల మొరాయించడం, పని చెయ్యకపోవడం, సాంకేతిక కారణాలు.. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఈవీఎంలు మొరాయించడంతో మూడు గంటల సేపు పోలింగ్ నిలిచిపోయిందంటే సమస్యను అర్థం చేసుకోవచ్చు. 12వ తేదీ తెల్లవారుజాము వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీలో మాత్రమే ఎందుకిలా జరిగింది? చంద్రబాబు చెబుతున్నట్టే ఈవీఎంల వెనుకు కుట్ర ఉందా? ఈవీఎంల రిపేర్ పేరుతో సాఫ్ట్ వేర్ మార్చేశారా? అసలేం జరిగింది? వీటన్నింటికి ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంది.

 

ఇది ఇలా ఉంటే.. ఈవీఎంల టెక్నికల్ టెస్ట్ కు ఏపీ తరుఫున ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ ను చంద్రబాబు ఈసీ దగ్గరికి పంపించారు. అయితే అనూహ్యంగా ఈసీ సంచలన ఆరోపణలు చేసింది. హరిప్రసాద్ 2010లో ఈవీఎం దొంగతనం కేసులో నిందితుడని, అతడితో చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసింది. ఈసీ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. హరిప్రసాద్ ఈవీఎం ఎక్స్ పర్ట్. ప్రపంచం మొత్తం ఆయనను గుర్తించింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ప్రూవ్ చేసిన ప్రతిభావంతుడు హరిప్రసాద్. ఈవీఎంల పనితీరు, లోపాలపై ఆయనకు సర్వం తెలుసు. దీంతో ఈసీకి భయం పట్టుకుందని, ఈవీఎం లోపాలను హరిప్రసాద్ బట్టబయలు చేస్తాడని భయపడి.. హరిప్రసాద్ తో చర్చలు జరపము అని ఈసీ అంటోందని టీడీపీ ఆరోపిస్తోంది. హరిప్రసాద్ లాంటి టెక్నికల్ ఎక్స్ పర్ట్ ముందు తాము అడ్డంగా దొరికిపోతామనే ఈసీ కుంటిసాకులు చెబుతోందని టీడీపీ నాయకులు అంటున్నారు.

 

ఈవీఎంలపై చర్చ నుంచి తప్పించుకునేందుకు ఈసీ కుంటిసాకులు చెబుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఎన్నికల కమిషన్ పలుసార్లు హరిప్రసాద్ ను స్వయంగా పిలిచి మరీ సలహాలు తీసుకుందని అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. ఎలాంటి ఈవీఎంలనైనా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారు హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఈవీఎం లోపాలపై కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించినట్టు ఆయన చెప్పారు. ఓటు వేయగానే వీవీ ప్యాట్‌లో అభ్యర్ధి పేరు సింబల్ కన్పించాలి.. కానీ అది కన్పించడం లేదన్నారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటు వేసిన తర్వాత 7 సెకన్ల పాటు వీవీ ప్యాట్ పేపర్ కన్పించి ఈవీఎంలో పడిపోవాలన్నారు. కానీ, మూడు సెకన్ల పాటు మాత్రమే కన్పిస్తోన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ మార్చిందా అనే విషయంలో సందేహం కలిగిందన్నారు. ఈవీఎంలపై అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని ఆయన తెలిపారు. సందేహాలు తీర్చకుండా పార్టీకి లేఖ రాయడం బాధాకరమన్నారు. గతంలో తన మీద కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా వీవీ ప్యాట్ విషయంలో ఎన్నోసార్లు ఈసీ పిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనపై కేసు ఉందనే పేరుతో ఈవీఎంలలో ఉన్న లోపాల గురించి మాట్లాడకుండా ఈసీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈవీఎంలో తప్పులు ఉన్నాయని అందుకే తనతో చర్చించేందుకు ఈసీ భయపడుతోందని హరిప్రసాద్ అన్నారు.

 

హరిప్రసాద్ ఈవీఎం చోరీ చేసి ఉండొచ్చు, ఆయనపై కేసులు ఉండి ఉంచొచ్చు.. కానీ ఆయన ఈవీఎం ఎక్స్ పర్ట్ అనేది కాదనలేని సత్యం. హరిప్రసాద్ తో చర్చించి, ఆయన డౌట్లపై వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం అధికారులకు ఉన్న సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఎలాంటి తప్పు చేయకపోతే..నిర్భయంగా హరిప్రసాద్ తో చర్చలకు ఆహ్వానించి, డౌట్లు పరిష్కరిస్తే సరిపోతుంది. ఈవీఎంలో ఎలాంటి లోపాలు వేవని క్లారిటీ ఇస్తే సరిపోతుంది. కానీ ఈసీ మాత్రం మరోలా వ్యవహరిస్తోంది. మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘం తీరు, చెబుతున్న సాకులు చూస్తుంటే.. నిజంగా ఈవీఎంలలో లోపాలు ఉన్నాయేమో అనే అనుమానాలు కలగకమానవు.

Tags : ap cm chandrababuevmevm hackerevm malfunction ecHari Prasadhari prasad vemuru

Also read

Use Facebook to Comment on this PostMenu