05/7/19 8:46 PM

వీవీ ప్యాట్ స్లిప్‌లు లెక్కించడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?

Why Election Commission Not Ready For VVPat Slips Counting

ఈవీఎంలపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు సారధ్యంలోని విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు వారికి షాక్ ఇచ్చింది. వీవీ ప్యాట్ స్లిప్ ల లెక్కింపు వ్యవహారంలో టీడీపీ, కాంగ్రెస్ సహా 21 విపక్ష పార్టీలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓట్ల లెక్కింపు సమయంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్ లు కచ్చితంగా లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు వేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీవీ ప్యాట్ వ్యవహారంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ఉద్దేశం తమకు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్ స్లిప్ లను ఈవీఎంలలో పోలైన ఓట్లతో లెక్కించాలని గతంలో సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఈ ఆదేశాలపై సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఈ సంఖ్యను 50శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ మరోసారి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, వారి పిటిషన్ ను కోర్టు తిరస్కరించడం జరిగాయి. విపక్షాల రివ్యూ పిటిషన్ పై కేవలం నిమిషంలో వాదనలు ముగించి కోర్టు తీర్పు ఇచ్చింది.

 

వీవీ ప్యాట్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కోర్టు తీర్పుని గౌరవిస్తామని అంటూనే వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా హెచ్చరించారు. ఈసీకి ప్రశ్నలు సంధించారు. కోర్టు తీర్పుని గౌరవిస్తూనే పోరాటం కొనసాగిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. వీవీ ప్యాట్ విషయమై మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని చెప్పారు. 50 శాతం వీవీ ప్యాట్లు లెక్కించాలని గట్టిగా పట్టుబడతామన్నారు. సమయం పట్టినా పారదర్శకత ముఖ్యమని చంద్రబాబు అన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించడంలో ఈసీకి ఉన్న అభ్యంతరాలేంటి అని ఆయన ప్రశ్నించారు. లెక్కింపు ఆలస్యం అవుతుందని ఈసీ చెప్పడం తప్పించుకోవడమే అని చంద్రబాబు ఆరోపించారు.

 

దేశవ్యాప్తంగా ఎన్నికలకు 75 రోజులు సమయం తీసుకోగా లేనిది.. స్లిప్పుల లెక్కింపునకు 6 రోజుల కేటాయిస్తే ఇబ్బంది ఏమిటి అని చంద్రబాబు ఈసీని ప్రశ్నించారు. ఈవీఎంలో పోలైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడాలు వస్తే 100శాతం లెక్కించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 

ఈవీఎంలపై పదేళ్లుగా పోరాటం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. 5 వీవీ ప్యాట్స్ స్లిప్పులు లెక్కించాక తేడా వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పులు సరిపోవాలని, అభ్యర్థులు కోరిన చోట మళ్లీ ఓట్లు లెక్కించాలని అన్నారు. పారదర్శకత ఉంటే వీవీ ప్యాట్స్ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags : ap cm chandrababuap electionselection commissionsupreme courtvv pat slips countingvvpat verification

Also read

Use Facebook to Comment on this Post



Menu