06/16/19 8:09 PM

చంద్రబాబు చేయలేనిది సీఎం జగన్ చేయగలరా? జగన్ కి ఆ సత్తా ఉందా?

Will AP CM YS Jagan Acheive Special Status Category

ప్రత్యేక హోదా.. మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? లేదా? బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇస్తుందా? లేదా? ఏపీ సీఎం జగన్ కి ప్రత్యేక హోదా సాధించే సత్తా ఉందా? లేదా? అనే డిస్కషన్ జరుగుతోంది. స్పెషల్ స్టేటస్ చర్చకు కారణం నీతి ఆయోగ్ సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రత్యేక హోదా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. మాటిచ్చారు నిలుపుకోండి అని తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రాణవాయువుతో సమానం అని చెప్పారు. దీంతో మరోసారి స్పెషల్ స్టేటస్ అంశం హాట్ టాపిక్ గా మారింది.

 

రాష్ట్ర విభజన సమయంలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేసేందుకు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కాంగ్రెస్ పాలకులు మాటిచ్చారు. కాంగ్రెస్ హామీకి అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సైతం మద్దతిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. కట్ చేస్తే.. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు కేంద్రంలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఇచ్చిన మాటను నిలుపుకుంటుందని, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ బీజేపీ.. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని చెబుతూ కాలయాపన చేసింది. ఇప్పుడు కేంద్రంలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మరోసారి మోడీ ప్రధాని అయ్యారు. ఏపీలో వైసీపీ పవర్ లోకి వచ్చింది. మోడీకి సన్నిహితుడిగా చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈసారి అయినా మోడీ సారు ఏపీని కరుణిస్తారో లేదో చూడాలి. జగన్ తో మంచి రిలేషన్ ఉన్నాయి కాబట్టి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేస్తారేమో అనే టాక్ వినిపిస్తోంది.

 

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు సీఎం జగన్‌. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో సీఎం జగన్ వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తే.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పరిశ్రమలు వస్తాయని, పెట్టుబడులు వెల్లువెత్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోడీకి వివరించారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా వినిపించారు జగన్‌. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వడంలో చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చని ఉందని గుర్తు చేశారు.

 

నాటి ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని, విపక్షంగా ఉన్న బీజేపీ సమర్ధించడాన్ని నీతి ఆయోగ్‌ సాక్షిగా మరోసారి జగన్ గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టాన్ని, హోదా ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా వివరించారు. ముఖ్యంగా అత్యంత ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్లడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని నీతి ఆయోగ్‌కు తెలిపారు. ఈ నష్టాన్ని పూడ్చడానికే ప్రత్యేక హోదా హామీని ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని జగన్ గుర్తు చేశారు.

 

రాష్ట్ర విభజన నాటికి రూ.97 వేల కోట్లుగా ఉన్న ఏపీ అప్పు నేటికి రూ.2.59 లక్షల కోట్లకు చేరిందని జగన్ చెప్పారు‌. ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదని తెలిపారు. విభజన తర్వాత ఏపీలో ఉపాధి కల్పన అవకాశాలు దారుణంగా పడిపోవడంతో యువత వలస వెళ్తున్నారని వాపోయారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని, ఆ కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నీతి ఆయోగ్‌ ముందు ఉంచారు జగన్. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా 2014 మార్చి 2న అప్పటి కేంద్ర కేబినెట్ ప్లానింగ్ కమిషన్‌కి సిఫార్సు చేస్తూ తీర్మానించిన లేఖను కూడా ఇందులో పొందుపరిచారు. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడే నాటి వరకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి లేదన్న విషయాన్ని కూడా జగన్ గుర్తు చేశారు.

 

ప్రధాని మోడీకి ఏపీ ప్రజల మనోభావాలు తాకేలా జగన్ మాట్లాడారు. 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ప్రస్తావన కూడా ఉందని నీతి ఆయోగ్‌లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుకుంటున్నానని జగన్ అన్నారు. మొత్తంగా ప్రత్యేక హోదా వాదాన్ని జగన్ మరోసారి గట్టిగానే వినిపించారు. మరి ప్రధాని మోడీ.. జగన్ వాదనతో ఏకీభవిస్తారా? జగన్ తనకు సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చేస్తారా? లేక.. నాన్చుడు ధోరణి కంటిన్యూ చేస్తారా? ఒక వేళ మోడీ నో అంటే.. జగన్ ఏం చేయనున్నారు? మోడీకి వ్యతిరేకంగా పోరుబాట పడతారా? లేక మంచిగానే ఉంటూ అనుకున్నది సాధిస్తారా? అసలు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే సత్తా జగన్ కి ఉందా? లేదా? ఇలాంటి ప్రశ్నలు అనేకం రాజకీయవర్గాలను, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చూద్దాం.. మోడీ సారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..

Tags : andhra pradeshBJPCONGRESSmodiNITI Aayogspecial statusYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu