03/13/19 12:31 PM

చంద్రబాబుకి కుప్పం, జగన్‌కి పులివెందుల మరి పవన్‌కి : ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక అయోమయం

Will Pawan Kalyan Win In Assembly Elections

ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పోలింగ్ కు పెద్దగా సమయం లేదు. ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికను ముమ్మరం చేశాయి. గెలుపు లక్ష్యంగా స్కెచ్ లు వేస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది వారికి ఫుల్ క్లారిటీ ఉంది. చంద్రబాబుకి కుప్పం, జగన్ కి పులివెందుల కంచుకోటలు. వారి అక్కడి నుంచి పోటీ చేసి ఈజీగా గెలుస్తారు. ఇప్పుడు అందరి చూపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనేది జనసేన వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది.

 

ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన స్తాపించారు. 2014 ఎన్నికలకు ముందే పార్టీ స్థాపించినా.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఏపీలో రాజకీయ మార్పు అనివార్యం అన్న నినాదంలో వామపక్షాలతో కలిసి ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్న జనసేనాని అభ్యర్థుల ఎంపిక కసరత్తులో మునిగిపోయారు. అయితే పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది.

 

పవన్‌ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, విశాఖ నగరంలోని గాజువాక స్థానాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పవన్ పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తారని.. ఆ రెండు స్థానాలు ఇవే అయి ఉంటాయంటూ మరో ప్రచారం జరుగుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒకస్థానం నుంచి పవన్ పోటీ చేయడం ఖాయమని పార్టీలు వర్గాలు చెబుతున్నాయి. గోదావరి జిల్లాల నుంచి ఓ స్థానం, ఉత్తరాంధ్ర నుంచి మరో స్థానంలో పవన్ పోటీ చేస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.

 

దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే విశాఖ జిల్లా గాజువాకలో లక్షకుపైగా జనసేన సభ్యత్వాలు నమోదయ్యాయి. పైగా కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అదీగాక ఈసారి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగుతుండటం.. గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో అక్కడ కార్మిక వర్గ ఓటు బ్యాంకు కూడా తమకు కలిసొస్తుందని పవన్ భావిస్తున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం జనసేన సభ్యత్వాల నమోదు విషయంలో రెండో స్థానంలో ఉంది. దీనికి తోడు కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తన బలం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు పవన్ భావిస్తున్నారు. పిఠాపురం ప్రజాపోరాట సభలో… పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఉందని పవన్ అన్న విషయం తెలిసిందే. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పవన్.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని నుంచి కన్ఫామ్ గా పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

 

గాజువాక నుంచి పోటీ చేస్తే ఉత్తరాంధ్రపై కూడా పార్టీ ప్రభావం చూపించగలదని జనసేనాని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ వైసీపీలే ఇక్కడ ప్రధానంగా పోటీ పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఇప్పుడు జనసేనాని గాజువాక నుంచి బరిలో దిగాలని చూస్తుండటంతో.. ఇక్కడ త్రిముఖ పోరు తప్పదనే చెప్పాలి. మొత్తం మీద అనంతపురం, ఇచ్చాపురం, కాకినాడ, ఏలూరు, పిఠాపురం వీటన్నింటిని పక్కనపెట్టి ఫైనల్‌గా పవన్ గాజువాకకు ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది.

 

టీడీపీ, వైసీపీ సంగతి పక్కన పెడితే.. ఈ ఎన్నికలు జనసేనకు చాలా కీలకం. కచ్చితంగా జనసేన సత్తా చాటాలి. దీంతో జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుంది? అనే చర్చ జరుగుతోంది. పైగా పవన్ కళ్యాణ్ తొలిసారి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు పవన్ సభలకు, స్పీచ్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనాలు భారీగా తరలివచ్చారు. మరి ఇదే క్రేజ్ ఓట్ల రూపంలో రాలుతుందో లేదో చూడాలి. జనసేన అభ్యర్థుల గెలుపు సంగతి ఎలా ఉన్నా.. పవన్ మాత్రం కచ్చితంగా గెలిచితీరాలి. రాజకీయాల్లో పరువు నిలబెట్టుకోవాలంటే గ్యారంటీగా గెలవాల్సిందే. లేదంటే పరువు పోతుంది. అందుకే తాను పోటీ చేసే స్థానం విషయంలో పవన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కచ్చితంగా గెలుస్తాము అని నమ్మకం ఉన్న చోటు నుంచే బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యారు. మరి పవన్ ప్యూచర్ ఏంటో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

Tags : ap electionseast godavarigajuwakajanasenapawan kalyanpawan kalyan contestpithapuramvisakhapatnam

Also read

Use Facebook to Comment on this PostMenu