08/1/19 12:42 PM

అన్న బాటలో తమ్ముడు : పార్టీని కలిపేస్తారా?

Will Pawan Merge Janasena In BJP

ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? జాతీయ పార్టీలో జనసేనని కలిపేయాలనే యోచనలో ఉన్నారా? బీజేపీలో జనసేనని విలీనం చేస్తారా? ఇప్పుడీ ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

 

తొలిసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. జనసేన ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. చివరికి జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. ఈ ఫలితాలు పవన్ సహా పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నింపాయి. భవిష్యత్తుని అంధకారం చేశాయి. ఈ పరిస్థితుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

రెండు రోజులుగా పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన ఓటమి, భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు. బీజేపీతో కలిసి పని చేసే అంశంపై పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో కలిస్తేనే పార్టీ బతుకుతుందనే వాదనను కీలక నేతల దగ్గర పరోక్షంగా పవన్ వినిపించారని తెలుస్తోంది. జగన్‌ను ఢీ కొట్టడానికి బీజేపీతో స్నేహమే సరైందని జనసేన నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల అమెరికాలో పవన్, రాంమాధవ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేనను బీజేపీలో విలీనం చేయాలని రాం మాధవ్ ప్రతిపాదించారని సమాచారం.

 

కాగా, ప్రజారాజ్యం అనుభవాల దృష్ట్యా.. బీజేపీలో పార్టీని విలీనం చేయడం కంటే ఆ పార్టీతో కలిసి పనిచేస్తేనే బాగుంటుందని కొందరు నేతలు పవన్‌కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో జనసేనకు బీజేపీ అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని, కాబట్టి ఆ పార్టీతో సఖ్యతగా ఉండడమే మేలని మరికొందరు నాయకులు పవన్‌కు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.

 

జనాల్లోకి వెళ్లకపోవడమే ఓటమికి ప్రధాన కారణంగా జనసేనాని భావిస్తున్నారు. అందుకే ఇకపై ప్రజాసమస్యలపై పోరాడాలని, నిత్యం జనాల్లో ఉండాలని పవన్ నిర్ణయించారు. జగన్ భారీ విజయం సాధించడానికి ఎనిమిదేళ్ల పాటు జనాల్లో ఉండటమే కారణమనే విషయం కూడా జనసేన నేతల చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. మీడియాలో వచ్చిన నెగిటివ్ పబ్లిసిటీ కూడా జగన్‌కు కలిసొచ్చిందని, ప్రజల్లో ఆయనకు విపరీతమైన సానుభూతి తెచ్చిపెట్టిందని, కానీ జనసేనకు అసలు మీడియా కవరేజ్ ఇవ్వలేదని పవన్ తెలిపారు. ఎన్నికల ముందు ప్రధాన మీడియా ఛానెళ్లతో గొడవ కారణంగా ఆ ఛానెళ్లను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో తాను మీడియాకు పూర్తిగా దూరమైపోయానని జనసేనాని భావిస్తున్నారు. అందుకే ఇకపై మీడియాతో సఖ్యతగా మెలిగేందుకు పార్టీ కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలని ఆదేశించారు. అన్ని మీడియా ఆఫీసులకు వెళ్లి యాజమాన్యాలతో మాట్లాడేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించారు.

 

జగన్ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని పార్టీలో కొందరు జనసేనాని దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో మనం జనాల్లోకి వెళ్లి ప్రజాసమస్యలపై తీవ్రంగా పోరాటం చేస్తే కచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని పవన్‌కు సలహా ఇఛ్చారు. అదే క్రమంలో పాదయాత్ర చేస్తే ఫలితం ఉంటుందని ఇంకో ముఖ్యనేత పవన్ కి సలహా ఇచ్చారట.

 

పాదయాత్ర చేయడం కచ్చితంగా మంచిదే కానీ, తాను రోడ్డు మీది కొస్తే ఫ్యాన్స్ హడావిడి చాలా ఎక్కువగా ఉంటుందని, వారిని కంట్రోల్ చేయడం కష్టమని పవన్ చెప్పారు. జగన్‌కు కూడా క్రేజ్ ఉందని, కానీ ఆయన వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఎక్కడా పెద్దగా ఇబ్బంది కలగలేదని నేతలు పవన్‌కు చెప్పారు. చంద్రబాబు కూడా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, పాదయాత్ర చేసిన వాళ్లంతా సీఎం అయిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. అప్పుడు రాజశేఖరరెడ్డి, తర్వాత చంద్రబాబు, ఇప్పుడు జగన్.. ఇలా పాదయాత్ర చేసిన వాళ్లంతా సీఎంలు అయ్యారని చెప్పారు. దీంతో తాను కూడా పాదయాత్ర చేసే దిశగా పవన్ యోచిస్తున్నారని సమాచారం.

 

మొత్తంగా ఫ్యూచర్ గురించి జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. ఏం చేస్తే పార్టీ బతుకుతుంది, బలపడుతుంది అనేదానిపై ఫోకస్ పెట్టారు. మరి.. పవన్ కళ్యాణ్ కూడా అన్న బాటలోనే పయనిస్తారా? జనసేనని బీజేపీలో విలీనం చేస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags : BJPchandrababuchiranjeevijanasenamergemodipadayatrapawan kalyanpraja rajyam party

Also read

Use Facebook to Comment on this PostMenu