05/18/19 9:24 AM

మిలియన్ డాలర్ల ప్రశ్న : జగన్ సపోర్ట్ ఎవరికి

Will YS Jagan Support Congress Or BJP

మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. మే 23వ తేదీన రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? అనేది తెలిసిపోనుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు? ప్రధాని అయ్యేది ఎవరు? అనే చర్చ జోరుగా నడుస్తోంది. బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ పవర్ లోకి వస్తుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో కేంద్రంలో ఏ పార్టీకి కూడా మెజార్టీ రాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. యూపీఏకి కానీ, ఎన్డీయేకి కానీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రావు అనే విశ్లేషణ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారాయి. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అటు సోనియా గాంధీ, ఇటు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ సపోర్ట్ ఎవరికి అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ కి మద్దతిస్తారా? బీజేపీ పక్షాన నిలుస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

 

ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టూర్లు వేస్తున్నారు. జగన్ కూడా తన వెంట ఉన్నారని ఆయన చెప్పకనే చెబుతున్నారు. టీఆర్ఎస్, వైసీపీ కలసి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉందని రెండు పార్టీల నేతలు లెక్కలు వేస్తున్నారు. వైసీపీకి కూడా పెద్ద ఎత్తున లోక్‌సభ సీట్లు వచ్చే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో జగన్ ఇంతవరకు ఎలాంటి స్టాండ్ తీసుకోనట్టే కనిపిస్తోంది.

 

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో, ఆ పార్టీకే వైసీపీ కూడా మద్దతిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 23వ తేదీన యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ నిర్వహించే సమావేశానికి సంబంధించి వైసీపీకి ఎలాంటి ఆహ్వానం ఇంతవరకు అందలేదని చెప్పారు. ఒకవేళ అందితే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయినా, యూపీఏ సమావేశానికి వెళ్లడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండబోదని చెప్పారు. కాబట్టి, వైసీపీ వేచి చూసే ధోరణిలో ఉందని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆహ్వానం లేదంటూనే వచ్చినా వెళ్లబోమని చెబుతున్నారు.

 

ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేకి పూర్తిస్థాయి మెజారిటీ రానిపక్షంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను యూపీఏ ముమ్మరం చేసింది. ఈనెల 23న ఎన్నికల ఫలితాల రోజున యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ విపక్షాలతో భేటీకి పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ కు ఆహ్వానాలు పంపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సోనియాగాంధీతో భేటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్‌ను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఓ ముఖ్యనేతకు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత యూపీఏకి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమైతే వైసీపీని యూపీఏ వైపు తీసుకొచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌‌కు అప్పగించినట్టు సమాచారం. కమల్ నాథ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల్లో ఒకరు. పార్టీ సీనియర్. ఓ రకంగా వైఎస్ జగన్ తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కమల్ నాథ్ పని ప్రారంభించారని, ఓ వైసీపీ ముఖ్యనేతకు ఫోన్ చేసినట్టు కూడా సమాచారం. 2004 నుంచి 2009 మధ్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కమల్ నాథ్ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్నారు.

 

మొత్తంగా యూపీఏలోకి ప్రాంతీయ పార్టీలను తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళుతోంది. జగన్ ని ఆకర్షించేందుకు ఏకంగా సీఎంను రంగంలోకి దింపింది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. జగన్ ఎవరికి మద్దతిస్తారో తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పక్షాన చేరతారో, బీజేపీ వైపు నిలబడతారో చూడాలి.

Tags : BJPCONGRESSelection resultsndasupportUPAYs jagan mohan reddy

Also read

Use Facebook to Comment on this Post



Menu