05/17/18 9:25 PM

ఉత్కంఠకు తెర..! చివరకు బీజేపీకే ఆ ఛాన్స్ దక్కింది..!

Untitled-1 copy

దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన కర్ణాటక రాజకీయాల్లో సస్పెన్స్ వీడింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీయే అధికార పగ్గాలు చేపట్టింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ కమలనాథులకే దక్కింది. కర్ణాటక 23వ సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం రాజ్‌ భవన్‌ లో యడ్యూరప్పతో గవర్నర్ వజుభాయ్‌ వాలా ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటక సీఎంగా మూడోసారి యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. బలనిరూపణ తర్వాతే కేబినెట్‌ విస్తరణ జరగనుంది. 15 రోజుల్లో యడ్యూరప్ప సర్కార్ బలపరీక్షను ఎదుర్కోనుంది.

 

నిన్న బీజేఎల్పీనేతగా యడ్యూరప్పను ఎన్నుకున్న తరువాత జరిగిన పరిణామాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుభాయ్‌ వాల్ బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగిన యడ్యూరప్ప కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

అర్ధరాత్రి హైడ్రామా తరువాత యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. గవర్నర్ నిర్ణయాధికారంలో జోక్యం చేసుకోబోమని కోర్టు తేల్చిచెప్పింది. దాంతో గురువారం ఉదయం సరిగ్గా 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

 

కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. లక్ష రూపాయల వరకూ ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. ఇప్పటికే రైతు రుణ మాఫీ ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. తాను రైతులకిచ్చిన హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు.

 

కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో విధానసభ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌, మల్లికార్జున్‌ ఖర్గే, వేణుగోపాల్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అనైతిక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. 116 మంది సభ్యుల బలమున్న తమను కాదని, 104 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ పిలవడమేంటని నిలదీశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనైతిక చర్యలకు పాల్పడుతోన్న బీజేపీకి, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని సిద్ధ రామయ్య అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

 

ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్, ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, కాంగ్రెస్ వాదనలతో ఏకీభవించని సర్వోన్నత న్యాయస్థానం, అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా ఆపలేమని స్పష్టంచేసింది. కానీ, కాంగ్రెస్- జేడీఎస్‌ ల పిటిషన్‌ ను డిస్మిస్‌ చేయకుండా శుక్రవారం ఉదయం మరోవారు వాదనలు వింటామని వెల్లడించింది.

 

బీజేపీ అధికారం చేపట్టడంపై జేడీఎస్ సీఎం అభ్యర్థి హెచ్‌ డీ కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. మెజారిటీ ఎమ్మేల్యేలంతా తమవైపే ఉండగా… మెజారిటీ లేకున్నా యడ్యూరప్ప సీఎంగా ఎలా ప్రమాణం చేశారని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానిది మూణ్ణాళ్ల ముచ్చటేనని అన్నారు. తమ ఎమ్మెల్యేపై ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్ (ఈడీ) దాడులుంటాయంటూ.. బీజేపీ నేతలు బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారని కుమారస్వామి ఆరోపించారు.

 

కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాషాయదళం 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 38 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. కానీ గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Tags : amit shahBJPCONGRESSjdsKarnataka cm yeddyurappaKarnataka govt formationmodi

Also read

Use Facebook to Comment on this PostMenu