02/7/19 8:57 PM

చంద్రబాబు ఓటమి ఖాయం : జగన్ నోట ఎన్టీ రామారావు మాట

YS Jagan Comments On NT Ramarao

వెంకన్న సాక్షిగా తిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించిన వైసీపీ అధినేత జగన్.. దూకుడు పెంచారు. ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌గా మాటల తూటాలు పేలుస్తున్నారు. పనిలో పనిగా ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. కడపలో గురువారం ఏర్పాటు చేసిన ‘సమర శంఖారావం’ బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

 

ఈ నాలుగున్నరేళ్ల కాలంలో సీఎం చంద్రబాబు పేదల కడుపు మాడ్చారని జగన్ మండిపడ్డారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జగన్ గతాన్ని గుర్తు చేశారు. జగన్ నోట దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు వినిపించింది. నాడు ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం అని చెబితే, అప్పుడు కాంగ్రెస్ సీఎం విజయభాస్కర రెడ్డి రూ.1.90 పైసలకే బియ్యం ఇచ్చారని, కానీ ప్రజలు మాత్రం ఆయనకు ఓటేయలేదని, ఎన్టీఆర్‌కే ఓటేసి గెలిపించారని జగన్ గుర్తు చేశారు. కారణం.. నాలుగున్నరేళ్ల పాటు పాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ సీఎంకు ప్రజలు బుద్ధి చెప్పారని జగన్ అన్నారు. ఇప్పుడు తన హామీలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని, కాబట్టి ఆయనకు కూడా ప్రజలే బుద్ధి చెబుతారని జగన్ అన్నారు. తల్లికి అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానని చెప్పినట్లుగా చంద్రబాబు తీరు ఉందని విమర్శించారు.

 

బీజేపీ, పవన్ కళ్యాణ్‌తో కలిసి నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని ముంచేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. పోలవరం కట్టకుండానే జాతికి అంకితం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు మూడు నెలలు, ఆరు నెలల ముందు సినిమాలు తీస్తారని, డైలాగులు చెబుతారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాటు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు ధర్మపోరాటం అంటూ నాటకాలు ఆడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు.

 

ప్రజలకు చంద్రబాబు సినిమాలు చూపించారని జగన్ అన్నారు. 2014లో మొదటి సినిమా మొదలు పెట్టారని.. ఆ సినిమాలో చాలా డైలాగులు (హామీలు) కొట్టారని గుర్తు చేశారు. అందులో ఒక్కటైనా చేశారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత మరో సినిమా చూపించారని.. అది రాష్ట్రాన్ని దోచుకోవంపై అంటూ ఎద్దేవా చేశారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలలకు ముందు మరో సినిమా మొదలు పెట్టారంటూ ధ్వజమెత్తారు. పెద్ద మనిషికి ప్రత్యేక హోదా గుర్తొచ్చిందన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసినప్పుడు ప్రత్యేక హోదా పేరెత్తితే అరెస్టులు చేయించిన పెద్ద మనిషి.. ఇప్పుడు నల్ల చొక్కాలతో బీజేపీపై పోరాటానికి బయల్దేరారని విమర్శలు చేశారు.

 

వైసీపీ ప్రకటించిన నవ రత్నాలను కాపీ కొడుతున్నారని జగన్ ఆరోపించారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను ఆదుకుంటామని నవ రత్నాల్లో ప్రకటించగానే.. చంద్రబాబు పసుపు-కుంకమ పేరుతో డ్రామా మొదలు పెట్టారని… నవ రత్నాల్లో రైతులకు సాయం అందిస్తామనగానే.. ఓట్ ఆన్ బడ్జెట్‌లో కొత్త పథకాన్ని పెట్టారని మండిపడ్డారు.

 

ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.. అన్నొస్తాడని.. పిల్లల్ని బడికి పంపిస్తే ఏడాదికి 15వేలు ఇస్తాడని… రైతులకు చెప్పండి.. అన్న సీఎం అయిన వెంటనే ప్రతి రైతు చేతిలో రూ.12,500 పెడతాడని.. జగన్ ముఖ్యమంత్రి అయితే 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి.. పొదుపు సంఘాలకు ఎన్నికలకు వరకు ఉన్న రుణాలు.. నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాం.. మీ చేతికే ఇస్తామని ప్రతి అక్కా, చెల్లికి చెప్పండి. ప్రతి అవ్వ, తాతకు చెప్పండి.. అన్న ముఖ్యమంత్రి అయితే పింఛన్ రూ.3వేలు ఇస్తాడని చెప్పండి. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని చెప్పండి’ అని జగన్ అన్నారు.

Tags : chandrababu copy schemescm chandrababucm jaganjagan public meetingJAGAN SPEECHkadapa samara sankharavamnavaratnaluys jaganysrcp

Also read

Use Facebook to Comment on this PostMenu