10/16/19 7:46 PM

జగన్ మైండ్ గేమ్ : మోడీ విషయంలో మారిన వ్యూహం

Ys Jagan Mind Game With Modi

రాజకీయం అంటేనే మైండ్ గేమ్. ప్రత్యర్థిని చిత్తు చేయాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. వ్యూహం రచించాలి. దెబ్బకు దెబ్బ తియ్యాలి. అదే సమయంలో అవసరమైతే కలిసిపోవాలి. సిటుయేషన్ డిమాండ్ చేస్తే కయ్యానికైనా, వియ్యానికైనా వెనుకాడకూడదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడే సక్సెస్ అవుతాడు. ఏపీలో ఇప్పుడు ఇలాంటి రాజకీయమే నడుస్తోంది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబులా కాకుండా.. సీఎం జగన్ తెలివిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులా తప్పుల మీద తప్పులు చేయకుండా.. మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో. ఓ వైపు బీజేపీ బలపడకుండా చూసుకుంటూనే.. ఆ పార్టీతో స్నేహగీతం ఆలపిస్తున్నారు. చంద్రబాబులా మొండిగా వెళ్లకుండా.. అవసరమైనప్పుడు తగ్గుతున్నారు. మోడీతో ఢీ అంటే ఢీ అనకుండా సాఫ్ట్ గా మ్యాటర్ ని హ్యాండిల్ చేస్తున్నారు. బీజేపీతో వైరం కారణంగా ఏపీ రాష్ట్రం నష్టపోవడమే కాదు.. పార్టీ పరంగా వ్యక్తిగతంగా బాబుగారు బాగానే లాస్ అయ్యారు. కానీ జగన్ మాత్రం అలా కాకుండా చూసుకుంటున్నారు.

 

మ్యాటర్ ఏంటంటే.. జగన్ వ్యూహం మామూలుగా లేదు. అటు బీజేపీకి ఇటు టీడీపీకి.. రెండింటికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు. నిన్న సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ ని ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ విషయంలో జగన్ వ్యవహరించిన తీరు చర్చకు దారితీసింది. జగన్ రాజకీయ చతురతను బయటపెట్టింది. ఈ స్కీమ్ విషయంలో సీఎం జగన్ మొండిగా వ్యవహరించలేదు. వైఎస్ఆర్ రైతు భరోసాకి పీఎం కిసాన్ అనే పేరుని కూడా జోడించారు. అంతేకాదు.. యాడ్స్ లో ప్రధాని మోడీ ఫొటోని హైలైట్ కూడా చేశారు.

రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 నగదు సాయం ఇస్తామని ప్రకటించిన జగన్ సర్కారు.. ఆ పథకం ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఆర్థిక సాయాన్ని రూ.13,500కి పెంచింది. మొదట నాలుగేళ్ల రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ.. దాన్ని ఐదేళ్లకు పొడిగించారు. ఇకపోతే పీఎం కిసాన్ యోజన ద్వారా కేంద్రం రూ.6 వేలు సాయం చేస్తుంది కాబట్టి.. ఈ పథకం పేరును ‘వై‌ఎస్‌ఆర్ రైతు భరోసా పీ‌ఎం కిసాన్ యోజన’గా మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి మోడీ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇటీవలే డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను ఉపయోగిస్తున్నారు.. కాబట్టి దీనికి మోడీ పేరు పెట్టాలని ఆయన సూచించారు. మరి బీజేపీ నేతల మాటలు ప్రభావం చూపాయో.. మోడీతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో కానీ.. జగన్ తెలివిగా వ్యవహరించారు. వైఎస్ఆర్ రైతు భరోసా కి పీఎం కిసాన్ అనే పేరుని జోడించారు. అంతేకాదు ప్రధాని మోడీ ఫొటోని కూడా పెట్టుకున్నారు. జగన్ తీరుతో సొంత పార్టీ నేతలు, టీడీపీ నేతలే కాదు.. బీజేపీ నాయకులు సైతం కంగుతిన్నారు. జగన్ నిర్ణయం వారందరికి షాక్ ఇచ్చింది. జగన్ ఇలా చేస్తారని కమలనాథులు అస్సలు ఊహించలేదు. ఆ విధంగా బీజేపీ నేతలు నోరెత్తకుండా చేశారు సీఎం జగన్.

 

గతంలో.. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబును స్టిక్కర్ సీఎం అని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్రం పైసలు పంపితే.. ఇక్కడ బాబు తన పేర్లతో పథకాలను జనంలోకి తీసుకెళ్లారని మోడీ సైతం విమర్శించారు. రైతు భరోసాకు వైఎస్ఆర్ పేరు పెట్టగానే బీజేపీ నేతలు జగన్ కూడా మరో స్టిక్కర్ సీఎం అవుతున్నారని విమర్శించారు. ఇలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

 

వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో పీఎం పేరు జత చేయడంతో.. ఇక పథకం గురించి బీజేపీ నేతలు నోరు మెదపడానికి అవకాశం లేనట్టే. ఇదొక్కట్టే కాదు.. తనకు, బాబుకు ఎంతో తేడా ఉందని.. పరోక్షంగా బీజేపీ పెద్దలకు జగన్ సంకేతాలు పంపాడని భావించొచ్చు అని అంటున్నారు. బీజేపీ విషయంలో మొండిగా వెళ్లి చంద్రబాబు చాలా నష్టపోయారు. ప్రధాని మోడీతో పెట్టుకోవడం వల్ల.. ఏపీకి తీరని నష్టం జరిగింది. పైగా టీడీపీకి, చంద్రబాబుకి కూడా డ్యామేజ్ జరిగింది. ఇబ్బందులు కూడా తప్పలేదు. చంద్రబాబు అనుభవాలను కళ్లారా చూసిన జగన్.. తాను అలాంటి పొరపాట్లు చేయాలని అనుకోవడం లేదు. అందుకే.. ఇలా తగ్గారని చెప్పుకుంటున్నారు. ప్రధాని పేరు జోడించడం ద్వారా.. వైసీపీకి కానీ జగన్ కి కానీ పెద్ద నష్టమేమీ లేదు. పైగా లాభం కూడా. జగన్ చర్యలు చూస్తుంటే.. మోడీతో శత్రుత్వం కన్నా.. మిత్రత్వం బెటర్ అన్న రీతిలో పావులు కదుపుతున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇకపోతే.. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. జగన్ చర్యలకు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏపీలో బీజేపీ బలపడాలంటే.. వైసీపీని బలహీనపరచాల్సిందే. జగన్ ఏమో.. బీజేపీతో కయ్యం కోరుకోవడం లేదు. దీంతో బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తంగా జగన్ మైండ్ గేమ్ ఆయనకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.

Tags : ap cmchandrababumodipm kisanrythu bharosa schemeys jagan

Also read

Use Facebook to Comment on this PostMenu