01/7/19 11:48 AM

చంద్రబాబులా అన్యాయం చేయలేను : పొత్తులపై జగన్ క్లారిటీ

YS Jagan Mohan Reddy Gives Clarity On Alliance

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహలు రచిస్తున్నాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. అవసరమైతే పొత్తులు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పొత్తుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీతో ఎవరు పెత్తు పెట్టుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ మాతో కలిసి రావాలని ఓవైపు చంద్రబాబు పదే పదే పిలుస్తున్నారు. మరోవైపు జగన్-పవన్ పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పొత్తు లేదు గిత్తు లేదు.. నేను సింగిల్‌గానే బరిలోకి దిగుతా అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. దీంతో పొత్తుల అంశం ఆసక్తికరంగా మారింది.

 

సింగిల్‌గానే బరిలోకి:
వైసీపీ అధినేత జగన్ పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోము అని తేల్చి చెప్పారు. చంద్రబాబులా తాను ఎవరిమీద ఆధారపడనని స్పష్టం చేశారు. తాను ప్రజలను, దేవుడిని నమ్ముకుంటానని చెప్పారు. వారే తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతరుల మీద ఆధారపడి గెలవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. చంద్రబాబులా ఓసారి బీజేపీతో మరోసారి కాంగ్రెస్‌తో కలవడం ఇష్టం లేదన్నారు. చంద్రబాబు ఇప్పుడు పవన్ వెంట కూడా పడుతున్నారని జగన్ గుర్తు చేశారు. ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్వశక్తితోనే గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని జగన్ అన్నారు.

 

చంద్రబాబులా దిగజారిపోను:
అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబులా దిగజారిపోయే అలవాటు తనకు లేదన్నారు. అన్ని పార్టీలతో సంసారం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసిన ఏకైక పార్టీ టీడీపీ అయితే.. ఆ రెండింటితో కలవని ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్ గొప్పగా చెప్పారు. నేను ఎవరిమీద ఆధారపడను, ఎవరినీ నమ్ముకోను.. ప్రజలను, దేవుడిని నమ్ముకుని పోటీ చేస్తాను, వారే నన్ను గెలిపిస్తారు అని జగన్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. పొత్తు పెట్టుకుని ఇన్నాళ్లు పార్టీ జెండా మోసిన వాళ్లకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదన్నారు. అలాంటి పని తాను చేయలేను అన్నారు. చంద్రబాబులా.. పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేయడం తన వల్ల కాదన్నారు. ఓ మీడియా ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

సింగిల్‌గానే బరిలోకి:
జగన్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. జగన్ మాటలను బట్టి చూస్తే జనసేనతో పొత్తు ఉండదు అనే విషయం స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ సింగిల్‌గా ఎన్నికల సంగ్రామంలోకి దిగుతారు అనేది స్పష్టమైంది.

Tags : ap electionschandrababujagan on alliancejanasena ysrcp alliancepawan kalyanTDPYs jagan mohan reddyysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu