12/3/18 9:11 PM
నాలుగేళ్లకోసారి భార్యను మార్చడం మగతనమా? పవన్‌పై జగన్ ఫైర్

కొన్ని రోజులుగా తనను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మగతనం లేదు, భయస్తుడు, పిరికివాడు అంటూ తన గురించి పవన్ చేసిన వ్యాఖ్యలకు జగన్ ఘాటుగా బదులిచ్చారు. మరోసారి పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించడమే కాకుండా నిత్యపెళ్లికొడుకు అంటూ పవన్‌పై నిప్పులు చెరిగారు. మగతనం ఉందా? అంటూ పవన్ వేసిన ప్రశ్నకు జగన్ సైతం అదే విధంగా నిలదీశారు. పెళ్లాలను మార్చడమే మగతనమా? అంటూ పవన్ పై విరుచుకుపడ్డారు.
పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన బహిరంగ సభలో జనసేనాని పవన్‌పై జగన్ ఓ రేంజ్లో మండిపడ్డారు. పవన్.. నాలుగేళ్లకోసారి కార్లను మార్చినట్లుగా భార్యలను మారుస్తారని,.. పవన్‌కు నలుగురు భార్యలున్నారని..ఇదే విషయం ప్రస్తావించి..ఎత్తి చూపితే..ఎత్తి చూపిన వారి కుటుంబాల్లోని మహిళలపై సోషల్ మీడియలో అసహ్య ప్రచారం చేయిస్తారని జగన్ దుయ్యబట్టారు. పవిత్రమైన పెళ్లి అనే వ్యవస్థను పవన్ రోడ్డు మీదకు తీసుకొచ్చారని విమర్శించారు. నిత్య పెళ్లి కొడుకు మాదిరి నాలుగేళ్లకోసారి భార్యను మార్చటమే మగతనమా? అని పవన్ ను ప్రశ్నించారు.
పవన్ రెండో భార్య రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పవన్ తనతో కాపురం చేస్తుండగానే ఏ రకంగా వ్యవహరించాడో వివరించారని..దీంతో జీవితం పంచుకున్న మహిళ అని కూడా చూడకుండా ఆమెపై అభిమానులతో ఇష్టానుసారం సోషల్ మీడియాలో వేధింపులకు దిగటమే మగతనమా? అని పవన్ ను నిలదీశారు.
పవన్‌కు రాజకీయ అవగాహన లేదని జగన్ దుయ్యబట్టారు. సీఎం చంద్రబాబు అవినీతి పవన్‌కు ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్యాకేజీలకు అమ్ముడుపోయి.. తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని జగన్ విమర్శించారు. చంద్రబాబుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. ‘పవన్ కళ్యాణ్ చంద్రబాబు పార్టనర్.. నాలుగున్నరేళ్లు కలిసి కాపురం చేశారు. ఇప్పుడు విడిపోయినట్లు డ్రామాలాడతారు. తెర వెనుక దోస్తీ చేసుకొని.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. బాబు చెప్పిన ప్రతీ అబద్ధం.. మోసం.. అవినీతిలో భాగస్వామి. అక్కడ చంద్రబాబు పేమెంట్ ఇవ్వగానే పవన్ కాల్షీట్లు ఇస్తారు. డైరెక్టర్ చంద్రబాబు.. యాక్టర్ పవన్ కళ్యాణ్.. నిర్మాత ఎవరో తెలుసా లింగమనేని. ఇక నేను అవినీతి పరుడిని అంటున్న పవన్ కళ్యాణ్.. 2004లో రాజకీయాల్లోకి రాలేదు. అప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాలన జరిగింది. 2009లో ఆ మహా నేత పాలన చూసి మళ్లీ ప్రజలు గెలిపించారు. మరి అలాంటప్పుడు జగన్ అవినీతిపరుడని ఎలా చెబుతావు.. నువ్వేమన్నా చూశావా ’ అంటూ మండిపడ్డారు.
లాండ్ పూలింగ్ బాధితుల తరపున నిలబడతానని చెప్పిన పవన్..పక్కా స్కెచ్ ప్రకారం లాభపడిన చంద్రబాబు బినామీ లింగమనేని రమేష్ వద్ద నాలుగు కోట్ల రేటు ఉన్న ప్రాంతంలో ఎకరాను కేవలం 20 లక్షలకే తీసుకోవటం అవినీతి కాదా? అని జగన్ ప్రశ్నించారు. ‘ఈ పవన్ కళ్యాణ్.. రాజధానిలో ఓ వైపున ల్యాండ్ పూలింగ్ బాధితుల తరపున పోరాటాలు చేసినట్లు బిల్డప్ ఇస్తారు. మరోవైపు అదే ల్యాండ్ పూలింగ్‌లో తన భూములు పోకుండా స్కెచ్ వేసిన.. చంద్రబాబు బినామీ లింగమనేని దగ్గర భూములు కొంటారు. అది కూడా ఎకరా రూ.4 కోట్లు అయితే.. రూ.20 లక్షలకు కొనుగోలు చేయలేదా. పవన్ కళ్యాణ్ తీసిన సినిమా నువ్వు తీసిన సినిమా అజ్ఞాతవాసి. ఆ సినిమాకు చంద్రబాబు.. ఏ సినిమాకు ఇవ్వని రాయితీలు ఇవ్వలేదా. మరి ఆ రాయితీలతో పవన్ కోట్లాది రూపాయలు సంపాదించలేదా.. ఇది అవినీతి కాదా. ఇలాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడతున్నారు.. ఇది కూడా చంద్రబాబు స్క్రిప్ట్‌లో భాగమే’ అని జగన్ ధ్వజమెత్తారు.
అనంతపురంలో జనసేన కవాతులో జగన్ పై పవన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన జగన్ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబు భయంతో అసెంబ్లీకి వెళ్లడం లేదని, ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం తప్ప ప్రజా సమస్యల గురించి పట్టదని, జగన్ నేరాలు చేశాడని ఎప్పటికైనా లాలూప్రసాద్ యాదవ్‌లా జైలుకు వెళ్లడం ఖాయమని, తన ఇంటి మహిళలను అంటే ఊరుకోనని పవన్ హెచ్చరించారు. దీనికి ప్రతి స్పందనగా జగన్ ఘాటు విమర్శలతో ఎదురుదాడికి దిగి రాజకీయాలను మరింత వేడెక్కించారు.
Tags : jagan fires on pawanjagan sensational comments on pawanpawan kalyanpawan marriagespraja sankalpa yatrays jagan