08/10/18 3:51 PM

నా భార్య పేరు చూసి షాకయ్యాను-జగన్

Untitled-1 copy

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ట్వీట్ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ఇంతకీ జగన్ చేసిన ట్వీట్ ఏంటంటే.. ‘’నా భార్య భారతిని నిందితురాలిగా చేరుస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్ ను దాఖలు చేసిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి షాకయ్యాను. చివరకు కుటుంబ సభ్యులను కూడా వదలని స్థాయికి రాజకీయాలు దిగజారడం చూస్తుంటే బాధనిపిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ జగన్ ట్వీట్ చేశారు.

 

కాగా, భారతీ సిమెంట్స్ కేసులో ఈడీ జగన్ సతీమణిని నిందితురాలిగా చేర్చిందంటూ ఈ ఉదయం వార్తలొచ్చిన సంగతి విదితమే. ఇదిలా ఉంచితే, అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ ఈ ఉదయం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

 

జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన భార్య వైఎస్ భారతి పేరును కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఛార్జిషీట్‌ లో చేర్చినట్టు కథనాలు వెలువడ్డాయి. భారతి సిమెంట్స్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమెను నిందితురాలిగా చేర్చినట్టు సమాచారం.  ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ ఇటీవల చార్జిషీటు దాఖలు చేసిందని చెబుతున్నారు. తొలిసారి ఈడీ ఛార్జిషీట్‌ లో ఆమె పేరున్నట్టు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.

 

భారతితోపాటు విజయసాయి రెడ్డి, సిలికాన్ బిల్డర్స్, సండూరు పవర్, క్లాసిక్ రియాల్టీ, సరస్వతి పవర్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం పేర్లను ఈడీ ఛార్జిషీట్‌ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

 

ఈడీ చార్జీషీటును కోర్టు విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. జగన్ పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణ కోసం జగన్ ఇప్పటికే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారతిపై దాఖలు చేసిన చార్జిషీటును కూడా కోర్టు స్వీకరిస్తే ఆమె కూడా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది.

 

జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈ కేసులోనే తొలిసారిగా జగన్ సతీమణి భారతిపై ఇలా అభియోగాలు నమోదయ్యాయని తెలుస్తోంది. ఈ కేసులకు సంబంధించి సిబిఐ అభియోగ పత్రాలలో భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ సీబీఐ భారతిని నిందితురాలిగా చేర్చలేదు. అయితే సీబీఐ వదిలేసినా…ఈడీ దర్యాప్తులో మాత్రం భారతి ని నిందితురాలిగా పేర్కొంది.

 

ఇక జగన్‌ కంపెనీల్లోకి అక్రమ పెట్టుబడులకు సంబంధించిన మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. సీబీఐ సమర్పించిన 11 చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరిన్ని అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు.

 

భారతీ సిమెంట్స్‌ ద్వారా జగన్‌ అక్రమంగా రూ.5068.05 కోట్లు పొందినట్లు సీబీఐ తన చార్జిషీట్‌ లో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపట్టి ఇప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేసిందని సమాచారం.

Tags : cbi courted casejagan assets caseys bharathiys jaganys jagan wife

Also read

Use Facebook to Comment on this Post



Menu