03/15/19 6:06 PM

వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య : వైసీపీ సంచలన ఆరోపణలు

YS Vivekananda Reddy Murder, YSRCP Leaders Sensational Allegations On TDP

ఎన్నికల వేళ వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మరణం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. వివేకా మరణం రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు ఏపీ రాజకీయమంతా వివేకానంద హత్య చుట్టూనే తిరుగుతోంది. ఎన్నికల్లో లబ్ది కోసమే వివేకాను చంపేశారనే ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డిని హత్య చేసింది టీడీపీ వాళ్లే అని ఆరోపిస్తున్నారు. వివేకా హత్య వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి హస్తముందని…ఈ కేసుపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో రాష్ట్రపతి, గవర్నర్ జోక్యం చేసుకోవాలంటున్నారు.

 

వివేకానంద రెడ్డి మరణం వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ సతీశ్ రెడ్డి హస్తం ఉందని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో పన్నిన కుట్రలో భాగంగా వివేకా హత్య జరిగిందన్నారు. జగన్ పై ఎయిర్ పోర్ట్ లో దాడి కూడా ఇందులో భాగమే అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం కూడా ఈ కుట్రలో భాగమే అన్నారు. చేతికి మట్టి అంటకుండా టీడీపీ కుట్రలు పన్నుతోందన్నారు. వివేకా మృతిపై ఏపీ పోలీసులు కాకుండా.. కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జీల నేతృత్వంలో ఈ దర్యాప్తు జరగాలన్నారు. ఈ హత్య గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రవీంద్రనాథ్ తెలిపారు. జగన్, ఆయన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. హత్యా రాజకీయాలు చేయడంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎహ్మెల్సీ సతీష్ రెడ్డి దిట్ట అని ఆరోపణలు చేశారు.

 

వివేకా హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షనేత జగన్ పైనా హత్యాయత్నం జరిగిందని గుర్తు చేశారు. ఈ హత్య వెనక కడప జిల్లా నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందని అంటున్నారు. సీబీఐ విచారణకు అదేశించాలన్నారు. హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలి అని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. మేం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని అనుకున్నాము.. కానీ ఏకంగా మనుషులనే తొలగిస్తున్నారు అని మండిపడ్డారు.

 

టీడీపీ నియమించిన సిట్‌పై తమకు నమ్మకం లేదని వైసీపీ నాయకులు అన్నారు. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆది నారాయణను ఎంపిక చేసినప్పుడే మహాకుట్రకు బీజం పడిందన్నారు. కడప పార్లమెంట్ స్థానంలో, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాగైనా గెలుస్తామని కొన్ని రోజులుగా టీడీపీ నేతలు చెబుతున్నారని, వారి తీరును ప్రజలంతా గమనిస్తున్నారని కామెంట్ చేశారు. వివేకానంద రెడ్డి మరణం హత్య అని తేలిందని… చంద్రబాబు అనేక సార్లు ప్రతిపక్షాన్ని ఫినిష్ చేస్తాను అని అన్నారని చెబుతున్నారు.

 

మరోవైపు వైసీపీ చేస్తున్న విమర్శలపై మంత్రి ఆదినారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారి ఆరోపణలను ఖండించారు. గతంలో జగన్‌పై దాడి జరిగిన సమయంలోనూ తనపై నేరారోపణలు చేశారని గుర్తుచేశారు. హత్యా రాజకీయాలు తమ సంస్కృతి కాదన్నారు. ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోలేకే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆది విమర్శించారు. వైఎస్ కుటుంబంలోనే గొడవలు ఉన్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్సీగా ఓడిపోయిన నాటి నుంచే వైఎస్ వివేకానందరెడ్డి ఆవేదనలో ఉన్నారని ఆది అన్నారు. అబద్దాలు చెప్పడం వైఎస్ జగన్‌కు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. కేసు విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని మంత్రి ఆది డిమాండ్ చేశారు.

 

వివేకా మృతి బాధాకరమని, దీన్ని ఆసరాగా తీసుకుని తమ పార్టీపై నిందలు వేయడం సమంజసం కాదని కడప జిల్లా టీడీపీ నేత సతీష్‌రెడ్డి మండిపడ్డారు. కడప ఎంపీ సీటు విషయంలో వివేకా, అవినాష్‌రెడ్డికి మధ్య వివాదం నెలకొందని, ఈ క్రమంలోనే ఆయన చనిపోవడంతో కుటుంబసభ్యులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చావును సైతం రాజకీయం చేయడం వైసీపీ నేతలకే చెల్లిందంటూ మండిపడ్డారు. వివేకానందరెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

 

శుక్రవారం తెల్లవారుజామున వైఎస్ వివేకానంద రెడ్డి తమ ఇంట్లోని బాత్రూమ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించారు. తొలుత గుండెపోటుతో చనిపోయారని అన్నారు. అయితే ఆయన ఒంటిపై లోతైన, బలమైన గాయాలు ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తాయి. చివరికి వివేకాది హత్య అని పోస్టుమార్టమ్ రిపోర్టులో తేలింది. దీంతో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. కడప జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

Tags : politica murderpostmortem reportpulivendulaTDPys jaganys vivekananda reddy murderys vivekananda reddy passed awayysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu