01/12/19 6:49 PM

పొత్తుల వివాదం : పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఆగ్రహం

YSRCP Leaders Fire On Pawan Kalyan

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. గెలుపు కోసం పార్టీల వ్యూహ ప్రతివ్యూహల్లో మునిగిపోయాయి. ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తులపై పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. నా మద్దతు కోసం నా వెంట పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నాయకులకు కోపం తెప్పించాయి.

 

జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, దీనికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు తనను సంప్రదించారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు మండిపడ్డారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ఎవరు మాట్లాడారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ వద్దకు వచ్చిన వారు అధికారికంగా వచ్చారో, లేక వ్యక్తిగతంగా వచ్చారో చెక్ చేసుకుని మాట్లాడాలని సూచించారు. టీడీపీతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని పవన్ బయటపెట్టాలని సుధాకర్ బాబు అన్నారు.

 

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా పవన్‌పై ఫైర్ అయ్యారు. పవన్ తీరు చూస్తుంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఉత్సుకత ఆయనలో కనిపిస్తోందన్నారు. టీడీపీతో సంబంధాలు ఉన్నాయో లేదో పవన్ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపైనా బొత్స మండిపడ్డారు. ఏపీలో పింఛన్ ను రూ. 2వేలకు పెంచడం వైసీపీ ఘనతేనని చెప్పారు. తమ పార్టీ ప్రకటించిన నవరత్నాలలో ఈ పథకం కూడా ఉందని… ఆ భయంతోనే సీఎం చంద్రబాబు ముందుగానే పింఛనును పెంచేశారని బొత్స విమర్శించారు. జగన్‌పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు లేఖ రాయడం సరికాదని బొత్స అన్నారు. ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కోర్టే ఆదేశించిందని చెప్పారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఏపీ పోలీసుల నివేదికలో కూడా ఉందని గుర్తు చేశారు. కేసును ఎన్ఐఏకు బదిలీ చేస్తే చంద్రబాబుకు భయం ఎందుకని బొత్స ప్రశ్నించారు.

 
వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన, వైసీపీ పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయసాయి రెడ్డి, నాగబాబు మధ్య చర్చలు జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, వామపక్షాలతో కలిసి వెళ్తామని, 175 స్థానాల్లోనూ సంపూర్ణంగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ అన్న సంగతి తెలిసిందే. వైసీపీ, టీడీపీ అబద్దాలు చెబుతున్నాయని, ఎవరితోనూ పొత్తులు ఉండవని పవన్ స్పష్టం చేసిన విషయం విదితమే.

Tags : ap electionsjanasenajanasena ysrcp alliancepawan kalyanYs jagan mohan reddyysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu