06/26/17 4:02 PM

మిడిల్ క్లాస్ పై GST ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది?

GST IMPACT ON MIDDLE CLASS

జూలై 1 నుంచి GST అమలులోకి రానుంది. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో , ఈ నెల ముప్పై వతేదీ అర్థరాత్రి పార్లమెంటులో భారీ హంగామా, ఉత్సవాల మధ్య గంట మోగించి పన్నులలో కొత్త శకానికి నాంది పలకబోతున్నారు. ఈ GST వల్ల సామాన్యులకి ఒరిగేది ఏమిటి? మధ్యతరగతి ఇంటి బడ్జెట్ ను GST ఎంతవరకు ప్రభావితం చేయబోతోంది? మధ్యతరగతి నిత్యం ఉపయోగించే వస్తువులపై GST ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం..

 

ఆహార పదార్ధాలు:  

అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను GST పరిధి నుంచి మినహాయించడము జరిగింది.  బియ్యం, పప్పులు వంటి నిత్యావసరాలను సున్న శాతం పరిధిలో చేర్చడం జరిగింది. శుధ్ది చేసిన ఆహారపదార్ధాలు, నూనెలు, పంచదార లాంటి వాటిపై గతంలోలానే పన్నులు విధించడం జరిగింది.  కేవలం బ్రాండెడ్ (అది కూడా ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అయితేనే) వస్తువులపై మాత్రమే 5 శాతం పన్ను విధించారు.  నిరుత్సాహకార వస్తువులైన శీతల పానీయాలపై 28 శాతం పన్ను విధించారు.  ఎలాగు బ్రాండెడ్ వస్తువులను అమ్మే కంపెనీలు తాము ఇతర స్థాయిలలో కట్టే పన్నులపై ఇన్ పుట్ ట్యాక్స్ పొందడం, బ్రాండ్ పేరుతో 20 నుండి 30 శాతం అధిక ధరను పొందడం చేస్తాయి కాబట్టి దీని ప్రభావము పెద్దగా ఉండబోదు. కాబట్టి ఈ రంగంలో ఆరోగ్యకర పోటీ నెలకొని ధరలు దిగిరావడమో, లేదంటే కనీసం ఉన్న స్థాయిలోనైనా కొనసాగే అవకాశమో ఉంది.

 

వస్త్రాలు, పాదరక్షలు: 

రూ. 500లోపు పాదరక్షలపై 5 శాతం పన్నును, దాటితే 18 శాతం విధించారు.  కాబట్టి గతంతో పోలిస్తే మొత్తంగా పెద్ద మార్పేమీ ఉండదు.  వస్త్రాలపై రూ.1000 లోపు వాటిపై 5 శాతం, దాటితే 12 శాతం విధించారు.  అంతేగాక ముక్కలు, చెక్కలుగా ఉన్న సరఫరా వ్యవస్థను ఒకే తాటి పైకి తీసుకువచ్చి పన్నులను క్రమబద్దీకరించే ప్రయత్నం చేసారు. పెట్టుబడి వస్తువులైన మెషినరీ లాంటి వాటి కొనుగోలు పై చెల్లించే పన్నులపై ఇన్ పుట్ క్రెడిట్ పొందే వెసులుబాటు కల్పించారు.  కాబట్టి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులున్నా దీర్ఘ కాలంలో అనేక కోట్ల మందికి ఉపాధిని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఈ రంగానికి మేలు జరిగే అవకాశాలు ఎక్కువ.

మందులు, ఔషధాలు:

 

కొన్ని రకాలు మందులు మినహాయిస్తే దాదాపు అన్ని రకాల ఔషదాల పై దాదాపు గతంలోలానే పన్ను విధించారు. గతంలోలా వివిధ స్థాయిలలో సమర్పించాల్సిన పత్రాల అవసరము తగ్గిపోవడం వలన సరఫరా ఖర్చులు తగ్గి, సరసమైన ధరలో లభించవచ్చు.

విద్య:

విద్యా సంస్థలు అందించే సేవలు, విద్యా సంస్థలు పొందే కొన్ని రకాలు సేవలపై పన్ను మినహాయింపు కల్పించారు.  అలాగే  నోట్ బుక్ లు, ఇతర స్టేషనరీ పై పన్ను రేట్లను వీలైనంత తక్కువగా ఉంచారు.కాబట్టి విద్యాసంస్థలపై పడే నిర్వహణ భారాన్ని GST తగ్గిస్తుందనే చెప్పవచ్చు.

ఆసుపత్రి బిల్లులు:  

ఆసుపత్రులు అందించే సేవలపై గతంలోలానే GST లో కూడా పన్ను మినహాయింపు కల్పించడం జరిగింది.   కాబట్టి ఆసుపత్రి బిల్లులో ఎలాంటి మార్పు ఉండబోదు.

మద్యం:

దీనిని GST పరిధిలో చేర్చలేదు.  కాబట్టి యధాతధ స్థితి కొనసాగే అవకాశము ఉంది. అలాగే ఇది రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరు మరియు నిరుత్సాహపరచాల్సిన వస్తువు కాబట్టి తక్కువ పన్ను రేటును సమర్ధించలేము.

విద్యుత్ చార్జీలు:

గతంలోనూ మరియు ప్రస్తుతము కూడా విద్యుత్ సంస్థలు అందిస్తున్న సేవలు పన్ను పరిధిలో లేవు.  కాబట్టి GST వలన విద్యుత్ చార్జీలు ప్రభావితం కాబోవు.

గృహోపకరణాలు:

టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మిక్సీలు వంటి గృహోపకరణాలను 28శాతం పరిధిలో ఉంచారు.  గతంతో పోలిస్తే ఇది 2 నుండి 3 శాతం అధికము.  కాబట్టి ధరలు స్పల్పంగా పెరగవచ్చు.

వాహనాలు:  

కేంద్ర ఎక్సైజ్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ కలుపుకుని ప్రస్తుతము ఈ రంగంపై పడుతున్న 26 నుండి 44 శాతం పన్నులను 18 మరియు 28 శాతం స్లాబులలో కుదించడం జరిగింది.  పన్ను రేట్లలో తగ్గింపు వలన వాహన ధరలు దిగి వస్తాయి.  మరీ ముఖ్యంగా లగ్జరీ వాహనాలు.

రవాణా ఖర్చులు: 

సరుకు రవాణ పై 5 శాతం పన్ను విధించారు.  కాకపోతే ఇది వ్యాపార సంస్థలకు సరఫరా చేసేవాటికి మాత్రమే పరిమితం.  పైగా ఆయా వ్యాపార  సంస్థలే వీటిని చెల్లించాలి.  ప్రయాణీకుల రవాణా చార్జీలపై 5శాతం పన్ను విధించారు.  చెక్ పోస్టుల ఎత్తివేత, రవాణా పత్రాల నిబంధనలు సరళము చేయడము వలన సమయం ఆదా అవ్వడమే గాక సరుకు రవాణా చార్జీలు తగ్గే అవకాశము ఉంది.  ప్రయాణీకుల రవాణా మాత్రం కాస్త ప్రియం కావచ్చు.

గృహాలు మరియు అపార్ట్ మెంట్ కొనుగోలు: 

రియల్ ఎస్టేట్ రంగాన్ని దాదాపుగా GST కి వెలువలే ఉంచారు.  భవిష్యత్తులో తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువ.  అలాగే ఈ రంగంలో వినియోగించే వస్తువులపై సరాసరిగా 2 నుండి 3 శాతం పన్ను పెరుగుదల కనిపిస్తోంది.  లావాదీవీలలో పారదర్శకత పెరగడం లాంటి వాటి వలన ధరలు తగ్గడమో లేదా యధాతధముగా ఉండే అవకాశము ఎక్కువ.

వీలైనంత వరకు పన్నుల ఎగవేతను అరికట్టడం, మరింత మందిని పన్ను పరిధిలోకి తీసుకురావడం, సమాంతర ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యము చేయడమే లక్ష్యంగా  కేంద్రరాష్ట్రప్రభుత్వాలు  ఆలోచిస్తున్నట్లు కొరడా భావిస్తోంది.

మొత్తం మీద GST వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందనే ప్రచారమూ తప్పే, భారీగా ధరలు తాగుతాయి అనే వాదన కూడా తప్పే.  GST వల్ల మధ్యతరగతి ఇంటి బడ్జెట్ లో పెద్దగా మార్పేమీ ఉండదు.

(నోట్: ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రం వివిధ రకాల పన్ను రేట్లను సరాసరిగా తీసుకుని అంచనాలు వేయడము జరిగింది)

-శివకృష్ణ వనమాల

 

Tags : arun jaitleyFINANCEGSTGST IMPACT ON INDIAN MIDDLE CLASSpricesretail

Also read

Use Facebook to Comment on this PostMenu