01/13/19 9:21 PM

బాలకృష్ణ, మహేష్, పవన్ కళ్యాణ్ : నీతులు చెప్పడానికేనా

Balakrishna, Mahesh Babu, Pawan Kalyan Pending Traffic Challans

వాళ్లంతా స్టార్ హీరోలు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. కోట్ల రూపాయలు సంపాదించారు. తెరమీద ఎన్నో నీతులు చెప్పారు. బాధ్యత గల పౌరుడిగా ఉండాలని సందేశాలు ఇచ్చారు. మరి రియల్ లైఫ్‌లో వాటిని ఆచరిస్తున్నారా? అంటే లేదనే సమాధానం వస్తుంది. స్టార్ హీరోలు బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తీరు చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్ గీత దాటడమే కాదు యేళ్ల తరబడి చలాన్లు చెల్లించకుండా విమర్శలకు కేంద్ర బిందువయ్యారు మన అభిమాన హీరోలు.

 

నీతులు ఉండేది పక్కోడికి చెప్పేందుకే అని అంటారు. దాన్ని నిజం చేశారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు. ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్ చేసిన కొందరు పెద్ద హీరోలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాశారు. అయితే ఆ చలాన్లను మాత్రం వాళ్లు పే చెయ్యడం లేదు. రెండు మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉంచారు. కట్టాల్సింది పెద్ద మొత్తమా అంటే అదీ కాదు. జస్ట్ వేల రూపాయలే. వాళ్లు అనుకుంటే పెద్ద లెక్క కాదు. కానీ ఆ అమౌంట్ కూడా చెల్లించలేకపోతున్నారు.

 

ఈ మధ్యే హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రికార్డ్‌లను తిరగవేయగా… కొందరు ప్రముఖ హీరోలు నిబంధనల్ని ఉల్లంఘించడమే కాకుండా, జరిమానాల్ని చెల్లించలేదని తేలింది. పెద్ద హీరోలు నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌ హీరోలు చెలాన్లు పెండింగ్ పెట్టిన వారి జాబితాలో ఉన్నారు. వారు ప్రయాణించిన వాహనాలు ఓవర్‌స్పీడ్‌, పార్కింగ్‌ నిబంధనలు ఉల్లఘించి ట్రాఫిక్‌ కెమెరాకు చిక్కాయి. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి.

 

* వీరిలో అత్యధికంగా మహేష్‌ 7సార్లు నిబంధనలు ఉల్లంఘించారు.
* మహేశ్ పేరుపై రూ.8,745 చలాన్లు ఉన్నాయి. 2016 నుంచి పెండింగ్‌
* 2018 మే లో బాలకృష్ణ కారు రాజేంద్రనగర్‌ వద్ద ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతో రూ.1035 ఫైన్‌ వేశారు.
* పవన్‌ కళ్యాణ్‌ వాహనం పార్కింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 3 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
* 2016 నుంచి రూ.505 ఫైన్‌ను పవన్ చెల్లించలేకపోతున్నారు.
*  హీరో సునీల్ వనస్థలిపురం, మాదాపూర్, శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో వేగంగా కారు నడిపినందుకు రూ.4,540      ఫైన్ వేశారు. అది పెండింగ్‌లో ఉంది.
* హీరో నితిన్ అల్వాల్ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించినందుకు రూ.1035 జరిమానా విధించారు. అది పెండింగ్‌లో ఉంది.
* 10 చలాన్లు మించి పెండింగ్‌లో ఉన్నట్లైతే వాహనాలను సీజ్‌ చేస్తామని ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

 

మనపై చర్యలు తీసుకునే ధైర్యం ఎవరికి ఉంది? అనే ధీమానో.. కడితే ఎంత? కట్టకపోతే ఎంత? అనే నిర్లక్ష్యమో కానీ.. చలాన్లు పెండింగ్‌లో పెట్టి మన హీరోలు ఇరుకునపడ్డారు. ఈ హీరోలకు సదరు చలాన్ల మొత్తం చాలా చిన్నదే అయినా చెల్లించకపోవడం ఆశ్చర్యంగా ఉందని, అయితే వారు సెలబ్రిటీలు కావడంతో చర్యలు తీసుకోలేకపోతున్నామని పోలీసులు వాపోతున్నారు. పెద్ద హీరోల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్లాది రూపాయలు సంపాదించారు, సినిమాల్లో నీతులు చెబుతారు.. సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి లెక్చర్లు ఇస్తారు. రాజకీయాల్లో ఉంటున్నారు. అది చేస్తాం, ఇది చేస్తామని ప్రజలకు హామీలు ఇస్తున్నారు. మరి రియల్ లైఫ్‌లో ఎందుకు పాటించడం లేదని నిలదీస్తున్నారు. సభ్య సమాజానికి, ఫ్యాన్స్‌కు ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు.. అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మన స్టార్ హీరోల్లో చలనం వచ్చి చలాన్లు పే చేస్తారో లేదో చూడాలి.

Tags : balakrishnamahesh babunitinpawan kalyanpending traffic challanssunilTOLLYWOOD STARStraffic finesTraffic Violations

Also read

Use Facebook to Comment on this PostMenu